మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేటటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేయడం తప్ప ఏం సాధించారో చెప్పే ధైర్యం ఉందా అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఇన్‌చార్జ్ కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై పొట్టి శ్రీరాములు స్వస్థలమైన జువ్వలదిన్నెలో ప్రజలు నిలదీస్తారని ఇంటిలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో సభను మార్చేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయా సాధన కోసం జాతీయ పార్టీ నాయకురాలి అదేశాలను సైతం లేక్క చేయక తమ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి మగధీరుడిలా బయటకు వచ్చి వైఎస్సార్ సీపీని స్థాపించారన్నారు. అలాంటి తమ నేతను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతో చేపట్టే సభలో జిల్లాలో టీడీపీ నాయకులు నదుల్లో ఇసుకను కొల్లగొడుతున్న తీరు, నీరు–చెట్టు పేరుతో జరుగుతున్న రూ.కోట్ల అవినీతి, ఆక్రమణల పేరిట 400 కుటుంబాలను రోడ్డుపై పడేసిన తీరు, పులికాట్ ముఖద్వారాల్లో పూడికతీయిస్తాం అంటూ చేప్పే మోసకారి మాటల గురించి ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మొదట్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచిపడి చీకటి ఒప్పందాలు చేసుకుని, రాష్ట్ర విభజనకు కారకుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ప్రధాని మోదీతో పాటు కేసీఆర్‌తో లాలుచీ పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పదవులను త్యాగం చేసిన ఎంపీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులు లేదన్నారు.
వారికి దమ్ముంటే వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామలు చేయించి, వారిని మళ్లీ పోటీలో నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, పట్టణాధ్యక్షుడు షేక్ రఫీ, కౌన్సిలర్ కళాచంద్ర, జరీనా, జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు కె.హరిబాబు మొదలియార్, డి.రవీంద్ర, పి.రఘ, జి.సిద్ధయ్య, డి.రాజశేఖరరెడ్డి, మెస్ భాస్కర్‌రెడ్డి, మోహన్‌రావు, సీహెచ్ మోహన్‌కృష్ణశర్మ, సి.చెంగయ్య, పి.భాస్కర్, రత్నశ్రీ, సుగుణమ్మ, అనురాధ, ఇరుగు సాయి, వెంకటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment