సాక్షి, నెల్లూరు: ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో నెల్లూరు జిల్లాలో రైతులు రెండు పంటలు పండించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కోకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లా చరిత్రలొనే మొదటిసారి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కోసం రూ. 793 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. రెండో పంటకు సంబంధించి ఇప్పటికే 2 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, వర్షాల వల్ల తేమ శాతం నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నా.. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. మిల్లర్లతో సంప్రదించి రైతులకు న్యాయం చేస్తున్నామని, పక్క జిల్లాలలోని గోదాముల్లో కూడా ధాన్యాన్ని నిల్వ చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ హయాంలో ఎంత కొనుగోలు చేశారో రికార్డులు చూడాలని, లెక్కలు తెలియకుండా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మిల్లర్లతో కుమ్మకై ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతుల కంటే మిల్లర్లకే లబ్ది కలిగిందని, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించారని గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీలన్ని సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చి ‘వైఎస్సార్ జల కల’ పేరుతో పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలో రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment