ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు(అర్బన్): సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒకరిపై ఒకరు వేలు చూపుతూ తీవ్ర విమర్శలకు దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత.. డోన్టాక్ అంటూ అరుచుకున్నారు. ఇదంతా మంగళవారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల సాక్షిగా జరిగింది. విషయాన్ని పరిశీలిస్తే జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సభను నడిపిస్తూ సాగునీటి రంగం అజెండాను ముందుకుతెచ్చారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల శాఖ సెంట్రల్ ఈఈ కృష్ణమోహన్‌తో కనుపూరు కాలువ పనులు పూర్తిచేశారా అని అడిగారు. ఈఈ సమాధానమిస్తూ పనులు పూర్తి కాలేదని, ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. అందుకు కాకాణి స్పందిస్తూ పనులు జరుగుతుంటే మాకిచ్చిన బుక్‌లో పనులు పూర్తయినట్టు ఎలా రాశారని ప్రశ్నించారు. దీనికి ఈఈ కృష్ణమోహన్ వివరణ ఇస్తూ పొరపాటున అలా జరిగింది సార్.. పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. అంటే తాము ప్రశ్నించకపోతే పనులు పూర్తయినట్టు చూపుతారు.. నిలదీస్తే మాత్రం పనులు జరుగుతున్నాయని చెబుతారా.. ఇదేనా మీ సమాధానం అంటూ కాకాణి నిలదీశారు. పనులు కూడా బిట్లు, బిట్లుగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కంటిన్యూగా చేస్తే టెండర్లు పిలవాల్సివస్తుందని, బిట్లు, బిట్లుగా చేస్తే మధ్యలో ఉన్న కాలువ పనులు ఎవరు పూర్తిచేస్తారని అన్నారు.
ఎవరి కమీషన్ల కోసం మీరు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దశలో వేదికపై ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. తమ కాలంలో కనుపూరు చివరి ఆయకట్టు బండేపల్లి వరకు పూర్తిగా సాగునీరిచ్చామన్నారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చేశామన్నారు. రివర్స్ పద్ధతిలో పల్లపు ప్రాంతాల నుంచి 100 హార్స్‌పవర్ మోటార్‌తో నీటిని ఎత్తైన ప్రదేశాలకు పంప్ చేసి వరిపంటను కాపాడామన్నారు. దీంతో ఎమ్మెల్యే కాకాణి జోక్యం చేసుకుంటూ 60 హార్స్‌పవర్ మోటారు పెట్టి 100 అంటారా.. ఎక్కడ పెట్టారో ఈఈ చెప్పాలన్నారు. మళ్లీ మంత్రి జోక్యం చేసుకుంటూ శ్రీశైలం నుంచి నీరు తెచ్చి బండేపల్లి వరకు మొదటిసారిగా నీరిచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ విషయం చెప్పాలంటూ ఈఈకి సూచించారు. దీంతో ఆగ్రహించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి తాము అధికారి ఈఈని వివరణ అడుగుతున్నామని, ఈఈ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరు మధ్యలో కలుగు చేసుకోవద్దన్నారు. అందుకు ఆగ్రహించిన సోమిరెడ్డి తాను మంత్రినంటూ మండిపడ్డారు. దీంతో కాకాణి బదులిస్తూ మంత్రి అయితే ఏంటీ? అధికారులను అడిగితే నీకెందుకు.. అధికారి సమాధానం చెప్పాలకదా అని ఆవేశంగా మాట్లాడారు. దీంతో మంత్రి డోన్టాక్ అనడంతో కాకాణి అసలు నీవెవరివి.. ఇరిగేషన్ అధికారులు పనులు చేయకుండా చేసినట్టు చూపడంపై సభా చైర్మన్‌ను అడుగుతానన్నారు. ఈ దశలో సభ అదుపు తప్పింది. నీవెంత అంటే నీవెంత అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో చైర్మన్ బొమ్మిరెడ్డి జోక్యం చేసుకుని వ్యక్తిగతంగా వెళ్లవద్దని చెప్పారు. గొడవ సద్దుమణగక పోవడంతో సభను అర్ధంతరంగా వాయిదా వేస్తున్నట్టు బొమ్మిరెడ్డి ప్రకటించారు. దీంతో సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు.
తండ్రీ కొడుకులు అవినీతి పరులు : కాకాణి
సభ అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తండ్రీ కొడుకులు అవినీతి పరులంటూ మంత్రినుద్దేశించి మాట్లాడారు. కనుపూరు కాలువలో రూ.25 కోట్లకు దొంగబిల్లులు పెట్టేందుకు ప్రయత్నించారని, కాలువపై రివర్స్ గేర్ పేరుతో మోటార్లకు రూ.75 లక్షల బిల్లులు పెట్టాలని చూశారని అన్నారు. తాము వెళ్లి నిలదీస్తే వాటిని రూ.35 లక్షలకు తగ్గించారని గుర్తుచేశారు. అధికారులను ప్రశ్నిస్తే అవినీతి బండారం బయట పడుతుందని తమను సోమిరెడ్డి అడ్డుకున్నారన్నారు. మంత్రి పోయిన ప్రతి గ్రామంలో 4 ఇళ్లు తగుల బడుతాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పేద రైతుల భూములకు వచ్చే నష్టపరిహారాన్ని దిగమింగాలనుకున్నారని ఆరోపించారు. పొదలకూరు మండలంలో పంటలు నిలువునా ఎండిపోతున్నాయని, చిత్తశుద్ధి ఉంటే కాపాడాలని అన్నారు. మిల్లర్ల నుంచి రూ.50 కోట్లు దండుకున్నారని, నిన్ను సర్వేపల్లి ప్రజలు తిరస్కరించడంతో నాలుగుసార్లు ఓడిపోయావని ఎద్దేవా చేశారు. ఖర్మకాలి దొడ్డిదారిన శాసన సభలో అడుగు పెట్టావన్నారు. నీముఖం చూడలేక అసెంబ్లీకి కూడా రాలేదన్నారు. రానున్న రోజుల్లో నీవు విదేశాల్లో దోచుకున్న ధనాన్ని కక్కిస్తామన్నారు. నీఉడుత బెదిరింపులకు భయపడేది లేదన్నారు. సమాధానం చెప్పలేక జెడ్పీ నుంచి పలాయనం చిత్తగించావని దుయ్యబట్టారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శలు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాము రైతుల పక్షాన నిలిచి చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక కాకాణి గోవర్ధన్‌రెడ్డి తనను విమర్శిస్తున్నారని అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తైన చివరి ఆయకట్టు వరకు నీరిచ్చిన ఘనత తమదేనన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పంట దిగుబడి సాధించిన జిల్లాగా నెల్లూరును తీర్చిదిద్దామన్నారు. ఈ సంవత్సరం కరువు చాయలున్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు దమ్ములేక అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విమర్శల దాడి పెరిగినప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అక్కడే ఉండి మౌనం దాల్చ డంపై టీడీపీ వర్గాల్లోని అసమ్మతి బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment