
శనివారం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరిగిన నవ నిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ చేయిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో స్పీకర్ కోడెల, టీడీపీ నేతలు, ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఏమిచ్చారని ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలకు ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణ దీక్ష జరుపుకొంటున్నట్లు చెప్పారు. విజయవాడ బెంజిసర్కిల్ కూడలిలో జాతీయ రహదారిపై శనివారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పూర్తిగా అన్యాయం చేస్తే బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా వద్దనేవారు రాష్ట్రంలో ఎవరూ లేరని చెప్పారు. ప్రధానమంత్రి తిరుపతి, నెల్లూరు సభల్లో రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తర్వాత హోదా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా సాగునీటి ప్రాజెక్టులను 54 శాతం పూర్తి చేశామన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి ధోలేరా, గుజరాత్‌పై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ. 2,500 కోట్లు ఇచ్చామంటున్నారని, విజయవాడ–గుంటూరు నగరాలకు ఇచ్చిన నిధుల్ని కూడా రాజధానికి ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సింగపూర్ ప్రధాని అమరావతి గురించి మన ప్రధానికి చెప్పారంటే ఎలా అభివృద్ధి చేస్తున్నామో తెలుసుకోవాలన్నారు. లాభాలు రావని తెలిసినా ఢిల్లీ–ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు నిధులిచ్చారని, రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు మాత్రం లాభాల గురించి అడుగుతున్నారని, ఏపీకి రైల్వేజోన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రధానిని మెప్పించేందుకు తాను 30 సార్లు సార్, సార్ అని అడుక్కున్నానని చెప్పారు. తనపై మహాకుట్ర పన్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దివాళా తీసిందన్నారు. తాను కేంద్రంతో విభేదించాక పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నాడన్నారు.
తిరుపతి పరిశుభ్రత ఘనత నాదే..
టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితుల్ని బీజేపీ వాడుకుంటోందని, దేవుణ్ణి కూడా అపవిత్రం చేయాలనకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వారణాసి అపరిశుభ్రంగా ఉంటుందని, కానీ తిరుపతి పరిశుభ్రంగా ఉంటుందని ఆ ఘనత తమదేనన్నారు. రాష్ట్ర బీజేపీకి ఒక కొత్త అధ్యక్షుణ్ణి పెట్టారని ఆయన బీజేపీకి అద్దె మైకుగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకుగా మారారని చెప్పారు. బీజేపీ కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి, ఒక్క పైసా మాత్రం తగ్గించడం ప్రపంచంలో అతి పెద్ద జోక్ అని విమర్శించారు. ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు సంవత్సరంలో రిటైర్ అవుతున్నారని ఆయన్ను రాజకీయాల్లో ప్రజాసేవ చేసేందుకు రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవానీ, అయ్యప్ప, వెంకన్న దీక్షలు చేసినట్లే రాష్ట్రాభివృద్ధికి నవ నిర్మాణ దీక్ష చేయాలని కోరారు. సభకు హాజరైన వారితో ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు అరకిలోమీటర్ నుంచి వేదిక వద్దకు ముఖ్యమంత్రి ర్యాలీగా వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment