పంట నష్టం పట్టకుండా నవ నిర్మాణ దీక్షలా?
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
కొత్తపేట: అర్ధాంతరంగా వచ్చిన సుడిగాలి, వానతో వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమై రైతులు నష్టపోతే వారిని పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు నవ నిర్మాణ దీక్షలకు పరిమితమవుతారా?అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వచ్చిన గాలివానకు నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమయ్యాయి. మంగళవారం జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం, వానపల్లి లంక ప్రాంతాల్లో పర్యటించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చారా? నష్టాన్ని అంచనా వేశారా?అని జగ్గిరెడ్డి రైతులను ప్రశ్నించారు. ఇంతవరకూ ఎవరూ రాలేదని తెలపడంతో ఆయన అమలాపురం ఆర్‌డీఓ జి.గణేష్‌కుమార్‌కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరిస్తూ వెంటనే పంట నష్టాలు నమోదు చేసి పంపిస్తే కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ అయినా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉందన్నారు. ఐదు రోజులుగా అధికారులను నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. పంట నష్టాలపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని, అవసరమైతే వైఎస్సార్‌సీపీ తరఫున ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. జగ్గిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల సేవాదళ్ కన్వీనర్ గూడపాటి ప్రవీణ్‌కుమార్, వాడపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి శేఖర్, పార్టీ రైతు విభాగం నాయకుడు పెదపూడి శ్రీనివాస్ ఉన్నారు.