ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలి
ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలి
Published Sun, Aug 28 2016 9:52 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
రావులపాలెం: డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో వైద్యసేవలందించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని దేవరపల్లి, రావులపాలెం, నార్కెడిమిల్లి, వానపల్లి తదితర గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలడంతో బాధితులు పలువురు రాజమహేంద్రవరంలోని వివిధ ప్రవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని ఆదివారం ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆయా ఆస్పత్రుల్లో పరామర్శించారు. వారిS ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచిం చారు. రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మందిని ఆయన పరామర్శించారు. అనంతరం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి డెంగీ కేసులు నమోదు కాలేదని చెబుతున్న వైద్యులకు ఇంత మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నప్పటికీ విషయం తెలియడం లేదా అని ప్రశ్నించారు. గోపాలపురం, ఊబలంక, ర్యాలి, ఆత్రేయపురం, వానపల్లి, అవిడి పీహెచ్‌సీల పరిధిలో డెంగీ కేసులను గుర్తించలేదని వైద్యులు చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయి ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ప్రైవేట్ ఆస్పతుల్లో చేరుతున్నారన్నారు. ఒక్కొక్కరికీ సుమారు రూ.60 వేల వరకూ ఖర్చు అవుతోందన్నారు. బాధితుల్లో అధికశాతం పేద, మధ్యతరగతి వారే కావడంతో వారికి వైద్య ఖర్చులు తలకు మించిన భారంగా మారుతున్నాయన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన పడితే వారు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీలో చోటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు లేఖరాస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం డెంగీ తదితర జ్వరాలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవలు ప్రభుత్వాస్పత్రుల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో అంతాబాగుందని మంత్రి కామినేని చెబుతున్నారని, ఎవరూ రాకపోతే అంతా బాగానే ఉంటుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో జ్వరాల తీవ్రతపై ఆయన ఫోన్‌లో డీఎంఅండ్‌హెచ్‌ఓతో మాట్లాడారు. వెంటనే ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలను అదుపు చేయాలని సూచించారు. అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, అప్పారి విజయకుమార్, సీహెచ్ సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.
Advertisement