స్కీములు వారికి... కేసులు మాకు
స్కీములు వారికి... కేసులు మాకు
Published Tue, Jul 25 2017 11:39 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి జిల్లాలో లేదు
అనపర్తి : బ్రిటిష్ వారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విభజించు–పాలించు దుర్నీతిని అనుసరించి పాలన చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. అనపర్తిలో వైస్సార్‌సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలు లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలు పచ్చ చొక్కాల వారికి అందజేస్తూ, వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే స్వేచ్ఛ, హక్కు ఉందన్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టబోయే పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను అణచి వేసేందుకు అధికారపార్టీ నాయకులు కుట్ర సాగుతోందన్నారు. అప్పటికే ప్రభుత్వం గత కొన్ని రోజులుగా సెక‌్షన్ 30 అమలు చేయటంతో సామాన్యులు ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రను సైతం చంద్రబాబు సర్కారు రాజకీయం చేస్తూ, అమాయకులపై కేసులు నమోదు చేయడం తగదని, దీనికి చంద్రబాబునాయుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవ రత్నాలు స్కీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మతి భ్రమించిందన్నారు. ఏమీ పాలుపోని స్థితిలో ఉన్న ఆయన నిరసన కార్యక్రమాలను సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న నిరంకుశ పాలనను గుర్తెరిగిన ప్రజలు తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల స్ధాయి నేతలను, నాయకులను, కార్యకర్తలను గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న నియోజకవర్గ పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కార్యదర్శి చిర్ల వీర్రాఘవరెడ్డి, కాపు నేతలు అడబాల వెంకటేశ్వరరావు, యక్కలదేవి శ్రీను, ర్యాలి కృష్ణ, కేదారి రంగారావు, చింతా భాస్కరరామారావు, కేదారి బాబూరావు, గొల్లు హేమసురేష్, పడాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement