సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
Published Sun, Mar 5 2017 10:43 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆత్రేయపురం (కొత్తపేట) : నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టి తెచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఆత్రేయపురంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం డైరెక్టర్ చిలువూరి బాబిరాజు స్వగహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా నష్టం కలిగిస్తోందన్నారు. ఆలమూరు మండల సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని మండపేటకు , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కపిలేశ్వరపురానికి తరలించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విషయంలో కూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే విషయం ఒక్కటీ, అధికారులకు చెప్పేది మరొకటి అవుతుందన్నారు. ర్యాంపులో పక్కన పెట్టిన డబ్బును కూలీలకు పంచాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణం , పింఛన్లు , రుణాలు పంపిణీలో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. పంచాయతీల్లో పన్నులు అడ్డుగోలుగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో రైతులకు మోటార్లకు ఆయిల్ అందించాల్సి ఉందని అలా అందించకుండా ఈ సొమ్మును పచ్చచొక్కాల సెలక్షన్ కమిటీలు పంచుకుంటున్నాయని విమర్శించారు. గత శాసన సభలో ఇరిగేషన్ మంత్రి దృష్టికి తెచ్చి పేరవరం ఎత్తిపోతల పథకం ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయించగా పనులు నత్తనడకన నడుస్తున్నాయని వాపోయారు. ఉచ్చిలి పంపింగ్ మోటార్లు సైతం పనిచేయడం లేదన్నారు. సభలో సమస్యలు చర్చించడానికి సమయం ఇవ్వాలని కోరితే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను సస్పెస్షన్ చేసి నోరు నొక్కేయడం దారణమన్నారు. అమరావతిలో నూతన అసెంబ్లీ కౌన్సిల్ భవనాలు ప్రారంభానికి వైఎస్సార్‌సీపీ సభ్యులను కనీసం ఆహ్వానించకుండా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మాదిరిగా ప్రారంభించుకోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శీతాకాల సమావేశాలు నిర్వహించకుండా తప్పించుకున్నట్టు తెలిపారు. రైతాంగానికి నీరు అందించకుండా వేరే చోటకు తరలించడం ప్రజల క్షేమం దృష్ట్యా మంచిది కాదని సభలో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. అనంతరం స్దానిక వైఎస్సార్‌సీపీనేత దండు సుబ్బరాజు స్వగృహంలో జరిగే వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి కర్రినాగిరెడ్డి, ఉప సర్పంచ్ చిలువూరి చిన వెంకట్రాజు పాల్గొన్నారు.
Advertisement