ఏజెన్సీ మరణాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి
ఏజెన్సీ మరణాలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి
Published Tue, Jun 27 2017 1:18 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
జాతీయ రహదారిపై రాస్తారోకో, ర్యాలీ
రావులపాలెం(కొత్తపేట) : ఏజెన్సీ ఏరియాలో 16 మంది గిరిజనులు విషజ్వరాలు, వాంతులతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఈ మరణాలకు సమాధానం చెప్పాల్సింది సీఎం చంద్రబాబు నాయుడే నని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏజన్సీ ఏరియాలో మరణాల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిని వ్యతిరేకిస్తూ సోమవారం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పదహారో నంబర్ జాతీయ రహదారిపై రావులపాలెం కళా వెంకట్రావు సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇంత మంది మృత్యువాత పడినా ప్రభుత్వం కంటి కనిపించకుండా గుడ్డిగా ఉందని కళ్లకు గంతలు కట్టుకుని జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగాలని ఈ మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. అలాగే స్థానిక సెంటరులో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఏజన్సీలో ఇంత మంది మరణిస్తే ఇటీవల కాలంలో రెండు సార్లు జిల్లాకు వచ్చిన చంద్రబాబు కనీసం ఏజన్సీ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తే సరిపోతుందన్న తీరుగా వ్యవహరించడం దారుణం అన్నారు. వెంటనే ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. సంబంధిత మంత్రి అధికారులు మొద్దునిద్ర పోతున్నారని, వారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలన్నారు. గత కలెక్టర్ ఆ ప్రాంతంపై సక్రమంగా పని చేయాలేదని, వైద్య ఆరోగ్యశాఖ మొద్దు నిద్రపోతూ నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుందన్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖలో అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను పంపి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆరు నెలల కిత్రం ఈ ప్రాంతంలో పర్యటించి అక్కడ పరిస్థితులను సమీక్షించారని, ఆ ప్రాంతంలో ఏడు స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలిచిందని ప్రభుత్వం ఈ విధంగా వ్యవహిరస్తుందని జగ్గిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, ఎంపీటీసీ బొక్కా ప్రసాద్, కె.రామకృష్ణ, కముజు సత్యనారాయణ, తోరాటి లక్ష్మణరావు, యనమదల నాగేశ్వరరావు, ఆనెం వెంకన్న, దియ్యన పెదకాపు, తోటకూర సత్యనారాయణ, పమ్మి చంటి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement