ఎండుటాకులు! | dry leafs | Sakshi
Sakshi News home page

ఎండుటాకులు!

Published Fri, Jun 2 2017 11:35 PM | Last Updated on Sat, Oct 20 2018 4:47 PM

ఎండుటాకులు! - Sakshi

ఎండుటాకులు!

మండుటెండలో పింఛన్ల పంపిణీ
- పడిగాపులు కాస్తే తప్ప అందని సొమ్ము
- వేళాపాళా పాటించని అధికారులు
- ఇళ్ల వద్ద పంపిణీ ఒట్టిదే..
- నీళ్లు, నీడ కూడా ఏర్పాటు చేయని వైనం
 
  •  డోన్‌ పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. శుక్రవారం కూడా అలాగే ఇస్తారని భావించి చాలా మంది పండుటాకులు, దివ్యాంగులు ఉదయం 6 గంటలకే కనీసం టీ కూడా తాగకుండా పింఛన్‌ కోసం చేరుకున్నారు. ఉదయం 10 గంటలైనా పింఛన్‌ ఇచ్చేవారు రాలేదు. ఎందుకు రాలేదంటే.. నవ నిర్మాణ దీక్షకు వెళ్లారని సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కొందరు విలేకరులు స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేస్తే అప్పటికప్పుడు ఆయన పింఛన్‌ పంపిణీ అధికారులను కార్యాలయానికి పంపించారు.
  •  ఆలూరులోని ఎస్సీ కాలనీలో ఉన్న మార్కెమ్మ దేవాలయం వద్ద సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉదయం 7 గంటలకే వచ్చి కూర్చున్నారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 12 గంటలైనా అధికారులు రాలేదు. కనీసం టిఫిన్‌ కూడా చేయకుండా వచ్చిన లబ్ధిదారులు ఇంటికి వెళ్దామంటే అధికారులు వస్తారేమోనని అలాగే కూర్చున్నారు. కొందరైతే సొమ్మసిల్లి అక్కడే కూలబడిపోయారు. సాయంత్రం 5 గంటలైనా అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. 
 
మొత్తం పింఛన్లు : 3,30,607
వృద్ధాప్య : 1,26,288
వితంతు : 1,37,745
దివ్యాంగులు : 43,114
చేనేత : 3,712
కల్లుగీత : 220
అభయహస్తం : 19,528
 
కర్నూలు(హాస్పిటల్‌)/డోన్‌/ఆలూరు: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తీరు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉద్యోగులు తమ వీలు చూసుకుని చేపడుతున్న పంపిణీతో వృద్ధులు, వికలాంగులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం కనిపించని పరిస్థితి. లబ్ధిదారులను ఒక చోటకు పిలిపించి పంపిణీ చేపడుతున్నారు. ఇదేమంటే.. వారే వస్తున్నారని బుకాయిస్తున్నారు. తామే ఇంటికి వస్తామంటే ఇంతటి అవస్థలు పడు ఎందుకు వస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం కరువవుతోంది. పింఛన్ల కోసం రెండు మూడు రోజులు తిరిగితే కానీ చేతికందడం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో ఎండ తీవ్రతతో సొమ్మసిల్లి పడిపోతున్నారు. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో షామియానాలు, షెల్టర్‌ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్లు అందివ్వాల్సి ఉంది. ఈ బాధ్యతను స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. కానీ జిల్లాలో ఎక్కడా ఇలాంటి సదుపాయాలు కల్పించిన దాఖలాల్లేవు. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీనికి తోడు ఉక్కపోత అధికమైంది. ఫలితంగా పింఛను కోసం వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థలను చూసి పలుచోట్ల పింఛను పంపిణీ ఉద్యోగులే సొంత డబ్బుతో నీటి వసతి కల్పిస్తున్నారు.
 
పొద్దున్నే టీ తాగకుండా వచ్చిన
గురువారం పొద్దున 6గంటల నుంచే పింఛన్లు ఇచ్చారంట. ఈ ఇసయం తెల్సుకుని ఈ రోజు(శుక్రవారం) నేను కూడా ఆరు గంటలకే వచ్చిన. పది గంటలైనా పింఛన్‌ ఇచ్చే వాళ్లెవ్వరూ రాలేదు. అదేదో దీక్షకు పోయినారంట. ఆ ఇసయం మాకు ముందే సెబితే లేటుగా వచ్చేవాళ్లం కదా నాయనా. పొద్దున్నుంచి కనీసం టీ కూడా తాగకుండా ఈడకు వచ్చినం.
– హనుమక్క, డోన్‌
 
ఇండ్ల కాడికి రానేరారు
మా లాంటి చేతగానోళ్లకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్‌ ఇయ్యాలంట. కానీ ఎవరొస్తున్నారు. యానాడూ ఇండ్లకాడికి వచ్చిందే లేదు. ఈడికి వచ్చినా రెండు, మూడు రోజులు తిప్పుకుంటున్నారు. వచ్చినా కూడా గంటల తరబడి ఎదురుసూడాల. దాహం వేసినా నీళ్లిచ్చేటోళ్లు లేరు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాల.
– గోవిందమ్మ, డోన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement