అన్క్లెయిమ్డ్ మొత్తం...ఇక వృద్ధుల సంక్షేమానికి!
ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు
♦ చిన్న పొదుపు, ఈపీఎఫ్‌లో రూ.9వేల కోట్లున్నట్లు అంచనా
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య భద్రత సదుపాయాలు, పెన్షన్ సౌలభ్యం కోసం కేంద్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. చిన్న పొదుపు పథకాలు, ఈపీఎఫ్, పీపీఎఫ్‌లలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ (ఎవ్వరూ క్లెయిమ్ చెయ్యనివి) మొత్తాన్ని వీరి సంక్షేమానికి వినియోగించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇలాంటి అన్‌క్లెయిమ్డ్ మొత్తాలు దాదాపు రూ.9,000 కోట్లు ఉన్నట్లు అంచనా. ఈ నిధుల వినియోగం విషయమై తాజాగా కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం పోస్టాఫీసులు, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వంటి ప్రభుత్వ సంస్థలు- ఏటా మార్చి 1వ తేదీలోపు అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను లెక్కించి, ‘సీనియర్ సిటిజన్ వెల్‌ఫేర్ ఫండ్’కు జమ చేయాల్సి ఉంటుంది. వీటిని సీనియర్ సిటిజన్ల ఆర్థిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా సంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తారు. వృద్ధాశ్రమాలు, వృద్ధుల రోజూవారీ సంరక్షణ, వారికి సంబంధించి పరిశోధనా కార్యకలాపాలపై సైతం సంక్షేమ నిధి దృష్టి సారిస్తుంది.
మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే....
♦ దేశంలో దాదాపు 10.5 కోట్ల మందికి పైగా వృద్ధులున్నట్లు అంచనా. వీరిలో కోటి మందికి పైగా 80 యేళ్ల వయస్సు పైబడినవారే. 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు.
♦ అన్‌క్లెయిమ్డ్ నిధులను సంక్షేమ నిధికి బదలాయించే ముందు ఆయా కేంద్ర ప్రభుత్వ సంస్థలు... అన్‌క్లెయిమ్డ్ డబ్బుకు సంబంధించిన అకౌంట్ హోల్డర్లను గుర్తించడానికి తగిన ప్రయత్నాలన్నీ చేయాలి. లిఖితపూర్వక నోటీసులు, ఈ మెయిల్, టెలిఫోన్ మెసేజ్‌లు ఇతరత్రా మార్గాల ద్వారా ఈ ప్రయత్నాలు జరగాలి.