ఓరి దేవుడా..ఇదేం పెన్షన్ | Pension to the elderly has become a problem to the government routinely | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా..ఇదేం పెన్షన్

Published Sun, Nov 10 2013 1:58 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM

Pension to the elderly has become a problem to the government routinely

దుర్గి, న్యూస్‌లైన్ :పెన్షన్ తీసుకునే వృద్ధులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఇది ఏదో రకంగా పెన్షన్ ఎగ్గొట్టే ఎత్తుగడగా కనిపిస్తోంది. రెండు నెలల నుంచి పోస్టాఫీసుల్లో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. గతంలో పెన్షన్లు మ్యానువల్ పద్ధతిలో పంపిణీ చేయటం వల్ల ఒక నెలలో తీసుకోని వారికి మరో నెలలో ఇస్తుండే వారు. ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్ పద్ధతి ప్రవేశ పెట్టటంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ కనెక్ట్ కాలేదని చెబుతుండడంతో పలుమార్లు పోస్టాఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నారు. ప్రతీ నెలా మొదట్లో వందల సంఖ్యలో వృద్ధులు పోస్టాఫీసుకు వస్తున్నారు. ఆన్‌లైన్ కనికరిస్తేనే పెన్షన్ అందుతుంది. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుడి కార్డు నంబర్ ఫీడ్ చేసినప్పటికీ ఆధార్ కార్డు నంబర్ లేకపోయినా, వేలిముద్రలను బయోమెట్రిక్ మిషన్ సరిగ్గా తీసుకోకపోయినా పెన్షన్ రావడం లేదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 రోజుల కొద్దీ తిరిగినా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఇంటి ముఖం పడుతున్నారు. అంతేకాక కొన్ని పోస్టాఫీసుల్లో రోజువారీ పనిభారం కారణంగా వృద్ధుల పెన్షన్ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటుంది.సిబ్బంది ఉంటే మరింత స్పీడ్‌గా...  మండల కేంద్రం దుర్గిలో వున్న పోస్టాఫీసుకు 11 గ్రామీణ సబ్ పోస్టాఫీసులు అనుసంధానమై ఉన్నాయి. వీటికి తోడు మరో నాలుగు శివారు గ్రామాల్లో పనుల కూడా ఈ పోస్టాఫీసులోనే చూడాలి. ఇక్కడ ప్రస్తుతం పోస్టుమాస్టర్‌గా ప్రసన్నాంజనేయ రాజు విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ విధులతోపాటు నెల మొదటి వారంలో పెన్షన్ల పంపిణీ చూస్తున్నారు.సిబ్బందిని కేటాయిస్తే ఇక్కడకు వచ్చే వృద్ధులకు మరింత వేగంగా పెన్షన్‌లు అందించగలమంటున్నారు.  - ప్రసన్నాంజనేయరాజు, పోస్టుమాస్టర్ 
 
 మాకెందుకీ ఇబ్బందులు: నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు పోస్టాఫీసులోనే వుంటున్నాం. అదేదో ఆన్‌లైన్ అంటా దాని వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ మాకెందుకు ఎప్పటి లాగా పంచాయతీ కార్యాలయంలోనే ఇస్తే బాగుణ్ణు. 
 - పగడాల మాధవరావు, వృద్ధుడు 
 
 ముప్పు తిప్పలు పెడుతున్నారు... మూడు రోజులుగా పోస్టాఫీసుకు వస్తున్నా. ఆన్‌లైన్‌లో కలిస్తే కంప్యూటర్‌లో చీటీ వస్తుంది. వేలి ముద్రలు తీసుకోవటం లేదు. ఒక సారి ఆధార్ కార్డు, ఇంకోసారి బియ్యం కార్డులు అడుగుతున్నారు. ప్రతీ సారీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. - కటకం సీతమ్మ, వృద్ధురాలు 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement