
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు(ఫైల్)
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్ష పేరిట చంద్రబాబు గత నాలుగేళ్లుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు నవనిర్మాణ దీక్షపై స్పందించారు. నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ తమ లోపాలను, అసమర్థతలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మొన్నటివరకు తప్పంతా కాంగ్రెస్‌దే అన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నవనిర్మాణ దీక్ష పేరిట బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదన్నారు. ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.