కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేసేటప్పుడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా దానిని విస్మరించి విమానయాన శాఖ వారు సాధారణ ప్రయాణికుడిలాగా తనిఖీలు నిర్వహించారని ఇది ఉద్దేశపూర్వకంగా ఆయనను కించపరచడానికి చేసిన చర్యగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించి నిరసనలు తెలపడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి విమాన శాఖ రక్షణ విభాగం ఈ అంశంలో వివ రణ ఇస్తూ కేవలం గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేరుగా విమాన ప్రవేశం ఉంటుందని జడ్ ప్లస్ విభాగానికి చెందిన ప్రయాణికులను కూడా సాధారణ ప్రయాణికుల గానే పరిగణించి తనిఖీలు నిర్వ హిస్తారని తెలియజేయడం జరిగింది.
ఈ మొత్తం ఉదంతానికి మూలం రాజకీయ నాయకులు వారి అభిమానులు ఊహించుకున్న లేని ప్రాధాన్యత. మర్యాదలు ప్రత్యేక సదుపాయాలు పదవికి సంబంధించినవే కాని వ్యక్తికి సంబంధించినవి కావు అనే ప్రధానమైనటువంటి అంశం మరిచిపో బట్టే చాలామంది నాయకులు పదవీచ్యుతులు అయిన పిదప కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కని పరిపాలన సంçస్కృతులు ఉన్న ఐరోపా దేశాలలో పదవిలో ఉన్నప్పుడే ప్రధాన మంత్రులు ఇతర ఉన్నత స్థాయి నాయకులు మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఉపయోగించుకోవటం, సైకిల్‌పై పార్కులు లాంటి బహిరంగ స్థలాల్లో వచ్చి మిగిలిన వారితో కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది.
కానీ భారతదేశం లాంటి దేశాలలో వలస పాలన వారసత్వంగా పాలకులకు పాలితులకు మధ్య మొదటినుంచి దూరం ఉంటూనే ఉన్నది. అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలలో సివిల్ లైన్స్ ప్రాంతాల్లో ఉండటం ఆఫీసు హంగామా, దర్జా ,బిళ్ళ బంట్రోతు లు ఒక కృత్రిమమైన వాతావరణాన్ని అధికారంలో ఉన్నవారి చుట్టూ కల్పిస్తాయి. వలస పాలనకు చిహ్నాలైన ఇదే విధానాలను గణతంత్ర ప్రజాస్వామ్యం అయిన తరువాత కూడా భారతదేశంలో మనం కొనసాగిస్తూనే ఉన్నాం. దీంతో రాజకీయ నాయకులు స్వతంత్ర భారతంలో ఆధునిక కాలపు మహారాజులాగా తయారైనారు. సరైన నియంత్రణ బాధ్యతాయుత విధానాలు లేకపోవడంతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, దుబారా దర్జా ఖర్చులకు అలవాటై పోయారు. అంతేకాకుండా పదవి కోల్పోయిన తర్వాత కూడా అవే సదుపాయాలను జన్మహక్కు లాగా భావించి ప్రవర్తించడం జరుగుతున్నది. పదవి కోల్పోయిన తర్వాత కూడా ఈ నాయకులు ప్రభుత్వ నివాసాలు వదలక పోవడం విద్యుత్తు, నీటి చార్జీలు కూడా కట్టకపోవడం వీరికి పరిపాటి అయిపోయింది. చివరకు కోర్టులు కలగచేసుకొని ప్రభుత్వ నివాసాల నుంచి వీరిని బయటికి పంపించి వారిచే బిల్లులు కట్టించే పరిస్థితి ఏర్పడింది.
ఈ జాడ్యం రాజకీయ ప్రముఖులకే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది. తమను ప్రత్యేకంగా గుర్తించి మర్యాదలు చేయాలని భావించడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య టోల్‌గేట్ వద్ద ఒక మంత్రిగారి భార్య ప్రవర్తించిన విధానం ఈ అహంకార భావన ఫలితమే. ఇటువంటి దౌర్జన్యాలు అధికారులపై రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు చేయటం సాధారణం అయిపోయింది. సరైన నియంత్రణ విధానాలు ఆడిట్ విధానాలు లేకపోవటంతో రాజకీయ ప్రముఖులు నాయకులు వారి హోదాకి, స్థాయికి మించిన అనేక సదుపాయాలను, సౌకర్యాలను పొందుతున్నారు. సరైన ఆడిటింగ్ విధానాలు, నియంత్రణల ద్వారా వీరందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించేటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన సంఘటనకు వస్తే ఇది అధికారికంగా ఉన్న సదుపాయము సౌకర్యము కానే కాదు. కేవలం ఆయన అభిమానులు ఊహించుకున్న ప్రాధాన్యం లేని సౌకర్యాలు మాత్రమే. ఇతర జడ్ కేటగిరి వ్యక్తుల లాగానే ఆయనను విమానయాన సంస్థ వారు పరిగణించడం జరిగింది. ఈ అంశంపై విమానయాన భద్రత విభాగం వారు ఇచ్చిన వివరణలో ఒక అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. వారి వివరణ గవర్నర్ ముఖ్యమంత్రి స్థాయి వారికి మాత్రమే తనిఖీ లేని ప్రవేశానికి అవకాశం ఉన్నది. తనిఖీ అనేది ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేసే అంశం కాదు. మిగిలిన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసే చర్య. అందువలన దీని నుంచి ఎంత గొప్ప వారైనా మినహాయింపు ఉండటానికి అవకాశం లేదు. అందరిని భద్రత తనిఖీ తర్వాతనే ప్రవేశం ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ముందే తెలియదు కదా!
వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
iyrk45@gmail.com
ఎవరి తనిఖీలైనా భద్రత కోసమే!
Published Thu, Jun 20 2019 5:09 AM | Last Updated on Thu, Jun 20 2019 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment