Vijayawada Airport
-
గడువులోపు పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సదరు కాంట్రాక్ట్ సంస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. విమానాశ్రయంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డును శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి మొక్కలు నాటారు.అనంతరం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. కోవిడ్ పరిస్థితులు, వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. టెర్మినల్ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా 52 శాతం పనులనే పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 జూన్ 30 నాటికి టెర్మినల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై అవసరమైతే ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అనకాపల్లి ఎంపీ రమేష్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, సివిల్ విభాగం జనరల్ మేనేజర్ రామాచారి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ఇండిగో–ఢిల్లీ సర్వీస్ ప్రారంభంతొలుత న్యూఢిల్లీ–విజయవాడ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నడపనున్న విమాన సర్వీస్ ప్రారంభ వేడుకలను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర
సాక్షి, విజయవాడ: మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మొదటి ప్లోర్లోని సీసీఎల్ఏ కాన్ఫరెన్స్ హాల్లో మైనార్టీ శాఖ సెక్రటరీ ఎ.ఎం.డి. ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మన్ బి.ఎస్. గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో జరిగిన హజ్ కమిటీ సమన్వయ సమావేశంలో మంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపడం జరుగుతుందన్నారు. 7 జూన్, 2023 నుండి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్రలో భాగంగా ప్రతి రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్‌కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లో సీఎం జగన్ ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించి హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని కోరామన్నారు. తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు. ఈ విషయమై పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు అంజాద్ బాషా వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా ఒక్కొక్కరికి రూ. 80,000ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ యాత్రికుల తరపున అంజాద్ బాషా కృతజ్ఞతలు తెలిపారు. హజ్ యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు వద్ద గల మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాత్రికుల లగేజ్‌ను మదరసాలోనే స్కానింగ్ చేసి అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు తరలించేలా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అదే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 ఏసీ బస్సుల ద్వారా యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. హజ్‌కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అంజాద్ బాషా కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఇంతియాజ్ మాట్లాడుతూ 7 జూన్, 203 నుండి 19 జూన్, 2023 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్‌కు బయలుదేరే యాత్రికుల యాత్ర సవ్యంగా సాగాలని ఆకాంక్షించారు. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, హజ్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.నవాబ్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యులు ఇసాక్, మైనార్టీ శాఖ సలహాదారు ఎస్.ఎం. జియావుద్దీన్, ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవాబ్ ఖాదర్ సాబ్, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఆర్డీవోలు, ఎయిర్ లైన్స్ అధికారులు, గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ, కస్టమ్స్, బ్యాంకర్లు, ఆర్టీసీ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బీ, బీఎస్ఎన్ఎల్, ఫైర్ సర్వీసు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా!
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రయాణం మరింత సులభతరం కానుంది. దేశీయ ప్రయాణాల కోసం ఇక టెర్మినల్‌లోని సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాయింట్ల వద్ద వేచి చూడాల్సిన అవసరం ఉండదు. తమ ఫోన్ నుంచే బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసి నేరుగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టు ఆవరణలో కేంద్ర పౌర విమానయాన శాఖ ‘డిజి యాత్ర’ పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ తరహా సేవలు ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, వారణాసి విమానాశ్రయాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి విజయవాడతో పాటు హైదరాబాద్, కోల్‌కతా, పూణే విమానాశ్రయాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే విజయవాడ విమానాశ్రయంలో డిజి యాత్ర కోసం నాలుగు కియోస్క్‌లను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ కూడా ప్రారంభించారు. డిజి యాత్ర యాప్‌లో నమోదు... సేవలు ఇలా... ► డిజి యాత్ర యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆ యాప్‌లో వినియోగదారులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్, చిరునామా, ఫొటో, ఆధార్ ఆధారిత ధ్రువీకరణపత్రం అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారునికి డిజి యాత్ర ఐడీ వస్తుంది. దానిని వినియోగదారులు నమోదు చేసుకోవాలి. ► విమాన టికెట్ బుకింగ్ సమయంలో డిజి యాత్ర ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలి. విమాన ప్రయాణానికి సంబంధించి బోర్డింగ్ పాస్‌ను కూడా యాప్‌లో స్కాన్ చేయాలి. దీంతో ప్రయాణికుడి వివరాలు సదరు విమానాశ్రయానికి చేరుతాయి. ► ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత టెర్మినల్ బయట ఈ–గేట్ వద్ద డిజి యాత్ర యాప్‌ను ఉపయోగించి బోర్డింగ్ పాస్ బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి, ఫేషియల్ రికగ్నైజేషన్ చేయించుకోవాలి. దీంతో విమానాశ్రయం నుంచి ప్రయాణికుల వ్యక్తిగత, ప్రయాణ వివరాలు సంబంధిత ఎయిర్‌లైన్స్ ఆన్లైన్లో ధ్రువీకరించుకుంటుంది. దీనివల్ల ప్రయాణికులు సెక్యూరిటీ చెక్ వద్ద గుర్తింపు కార్డు చూపించకుండానే, బోర్డింగ్ పాయింట్ల వద్ద నిరీక్షించకుండా సులభంగా ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు. ట్రయల్ రన్ దశలో... ప్రస్తుతం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం ట్రయల్ రన్ దశలో ఉంది. బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి డిజి యాత్రలో నమోదైనవారి వివరాలతో ఈ సిస్టం పనితీరును పర్యవేక్షిస్తున్నారు. దీనిపై ప్రయాణికులకు మరింత అవగాహన కలిగించేందుకు టెర్మినల్ ఆవరణలో డిజి యాత్ర యాప్‌కు సంబంధించిన స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెల నుంచి పూర్తిస్థాయిలో డిజి యాత్రను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
విజయవాడ నుంచి హజ్ యాత్రకు అనుమతించాలి
సాక్షి, అమరావతి: విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు అనుమతించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌసల్ ఆజామ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో హజ్‌యాత్రకు వెళ్లేవారిని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంపేందుకు వీలుగా పాయింట్‌ను ప్రకటించాలని కోరారు. హజ్ యాత్రకు నెల ముందుగా ఏపీ హజ్ కమిటీ నుంచి ఒక అధికారిక బృందం మక్కా, మదీనా నగరాలకు వెళ్లి అక్కడి వసతిగృహాల్లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేలా సౌదీ ప్రభుత్వ అనుమతిని ఇప్పించాలని కోరారు. ఏపీ హజ్ కమిటీ సభ్యులు ఇషాక్ బాషా, రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. -
అక్టోబర్ 31 నుంచి షార్జా–విజయవాడ విమానం
గన్నవరం: సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ పస్ట్‌వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్ ఆల్ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు. అంతేగాకుండా గల్ఫ్‌లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్‌లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
దూసుకెళ్తున్న విమానం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విమాన ప్రయాణం వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతున్నారు. కోవిడ్ సమయంలో పూర్తిగా వెనక్కి తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య తాజా పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడుతోంది. నెలరోజులుగా 90–95 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. దీంతో విమానయాన సంస్థలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రోజుకు 2,500 మందికిపైగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. దేశీయ విమాన సర్వీసులివే.. కరోనా పరిస్థితుల్లో వందేభారత్ మిషన్‌లో భాగంగా కొన్ని విమాన సర్వీసులు మాత్రమే నడిచాయి. గతంలో విజయవాడ విమానాశ్రయం నుంచి 36 విమానాలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవి. కరోనా పరిస్థితులు క్రమంగా కనుమరుగవుతుండటం, వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే విమానాల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా ప్రస్తుతం 18 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. హైదరాబాద్‌కి ఏడు, బెంగళూరుకి ఐదు, చెన్నైకి రెండు, విశాఖపట్నం, ఢిల్లీ, తిరుపతి, కడపలకు ఒక్కొక్క సర్వీసు నడుస్తున్నాయి. చెన్నై వెళ్లే విమాన సర్వీసుల్లో 90 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు, కడప, ఢిల్లీ విమాన సర్వీసులు 93 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే మరిన్ని సర్వీసులు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సర్వీసులివే.. విజయవాడ విమానాశ్రయం నుంచి మూడు అంతర్జాతీయ సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ నుంచి మస్కట్, కువైట్, షార్జాలకు విమాన సర్వీసులున్నాయి. ఈ నడిచే సర్వీసుల్లో సైతం 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంటోంది. త్వరలో కొత్త సర్వీసులు విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో మరిన్ని సర్వీసులు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి ముంబైకి, తిరుపతికి వారంలో నాలుగు రోజులు మాత్రమే విమాన సర్వీసు ఉంది. దీన్ని రోజు రెగ్యులర్‌గా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం ఢిల్లీ వెళ్లే సర్వీసు సాంకేతిక సమస్యతో ప్రస్తుతం నడవటం లేదు. త్వరలో దాన్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడినుంచి నడిచే విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వేసవి కావడంతో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగింది. త్వరలో విజయవాడ విమానాశ్రయం నుంచి మరిన్ని కొత్త సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. – పి.వి.రామారావు, ఏపీడీ, గన్నవరం -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..
సాక్షి, అమరావతి: విజయవాడ విమానాశ్రయంలోకి అత్యాధునిక వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలో విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని.. కియోస్క్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నెల రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ వ్యవస్థ వల్ల బోర్డింగ్ పాస్‌ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుంది. కేవలం ముఖం చూపించడం ద్వారా ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా నేరుగా విమానం ఎక్కవచ్చు. ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్, చెక్ ఇన్, బోర్డింగ్ అన్నీ కూడా కేవలం ముఖం చూపించడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మీ కదలికలను ఎప్పటికప్పుడు విమానాశ్రయ సిబ్బంది గమనిస్తుంటారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేశారు. ఇప్పుడు విజయవాడ, వారణాసి, పుణె, కోల్‌కతా విమానాశ్రయాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ నాలుగు విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను ఎన్ఈసీ కార్పొరేషన్ ఇండియా అందుబాటులోకి తీసుకువస్తోంది. -
కొత్త రన్ వేపై విమాన రాకపోకలు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా విస్తరించిన రన్‌వే పై గురువారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ఎయిర్‌బస్ ఎ320 ఉదయం 7.15 గంటలకు ఈ రన్‌వే పై తొలిసారిగా ల్యాండ్ అయ్యింది. అనంతరం అన్ని విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను నూతన రన్‌వే పైనే నిర్వహించారు. విస్తరణ వల్ల 3,360 మీటర్ల రన్‌వే అందుబాటులోకి వచ్చిందని.. భారీ విమానాల రాకపోకలకు అడ్డంకులు తొలిగాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు మార్గం సుగమమైందని చెప్పారు. అలాగే విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్నీ రేంజ్(డీవీవోఆర్) సిస్టమ్‌ను గురువారం ఎయిర్పోర్ట్ అధికారులు ప్రారంభించారు. విమాన ప్రయాణ మార్గం, స్టేషన్ నుంచి అప్రోచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గాలను సమర్థంగా నిర్వహించడానికి డీవీవోఆర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. -
పుంజుకుంటున్న విమానయానం
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుని విమానయానం క్రమేపీ వేగం పుంజుకుంటోంది. సెకండ్ వేవ్ ఉధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తుండటంతో క్రమంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయం కూడా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ నెల ఆరంభం నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. కోవిడ్‌కు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలలో 75 వేల నుంచి 90 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ రెండో దశ తీవ్ర రూపం దాల్చిన ఏప్రిల్ నెలలో 44,214 మంది ప్రయాణాలు చేయగా, మే నెలలో ఆ సంఖ్య 16,381కి తగ్గింది. అయితే జూన్ ఆరంభం నుంచి పరిస్థితి మారింది. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజుకు 600 మంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు వందే భారత్ మిషన్ కింద మస్కట్, దుబాయ్, సింగపూర్, కువైట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. ఢిల్లీ సర్వీసు రద్దుతో ఇక్కట్లు.. ఎయిరిండియా సంస్థ ఢిల్లీ – విజయవాడ ఎయిర్‌పోర్టుల మధ్య రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విమాన సర్వీసులను నడిపేది. వీటిలో ఉదయం సర్వీసును జూలై 31 వరకు రద్దు చేశారు. ప్రధానంగా ఈ సర్వీసు అమెరికా నుంచి వచ్చి, వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ఉండేది. అమెరికా నుంచి అర్థరాత్రి దాటాక ఢిల్లీ చేరుకునే వారు ఈ సర్వీసు ద్వారా ఉదయానికల్లా విజయవాడకు వచ్చేవారు. ఇప్పుడు సాయంత్రం సర్వీసు ఒక్కటే ఉండడం వల్ల వీరంతా 20 గంటలకు పైగా ఢిల్లీలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లేవారూ దాదాపు ఓ రోజు అదనంగా ఢిల్లీలో గడపాల్సి వస్తోందంటున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగింది పక్షం రోజుల్లో ప్రయాణికుల సంఖ్య రోజుకు వెయ్యికి చేరుకుంటుంది. ఈ నెలాఖరుకి ప్రయాణికుల సంఖ్య మునుపటి సగటు ప్రయాణికుల్లో 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. – జి.మధుసూదనరావు, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
గన్నవరంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్–737 విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా శనివారం ఖతార్ రాజధాని దోహా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 64 మంది ప్రయాణికులతో విజయవాడ మీదుగా తిరుచిరాపల్లికి బయలుదేరింది. సాయంత్రం 4.49 గంటలకు విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తరువాత రన్‌వే నుంచి ఆప్రాన్లోని పార్కింగ్ బేలోకి వెళ్తున్న సమయంలో విమానం కుడి రెక్క హైమాస్ట్ లైట్ల విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆ స్తంభం కుప్పకూలి విమానానికి కూతవేటు దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విమానం కుడివైపు రెక్కభాగం దెబ్బతింది. వెంటనే ఎయిర్పోర్ట్ అగ్నిమాపక, భద్రతా దళాలు విమానం దగ్గరకు చేరుకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో విజయవాడ విమానాశ్రయంలో దిగే ప్రయాణికులు 19 మంది, తిరుచునాపల్లికి వెళ్లే ప్రయాణికులు 45 మంది ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. విమానాన్ని పరిశీలిస్తున్న ఎయిర్ పోర్టు సిబ్బంది మరో విమానంలో తరలింపు ప్రమాదానికి గురైన విమానంలోని ఏపీ ప్రయాణికులను ఇక్కడే దించేసి తిరుచిరాపల్లి వెళ్లాల్సిన వారిని మరో విమానంలో పంపే ఏర్పాట్లు చేసినట్టు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జి.మధుసూదనరావు చెప్పారు. పైలట్ తప్పిదమే కారణం! ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణం కావచ్చని విమానాశ్రయ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కాగా విమానం ల్యాండ్ అయ్యే సమయానికి వాతావరణం మబ్బులతో కూడి ఉండటం వల్ల రన్‌వే, ఆప్రాన్‌లపై విజిబిలిటీ అస్పష్టంగా ఉందని పైలట్ చెప్పినట్టు సమాచారం. ఘటనపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విచారణకు ఆదేశించింది. విజయవాడ విమానాశ్రయ చరిత్రలో ఇది రెండో ప్రమాదం. 1980 ఆగస్టు 28న హన్స్ ఎయిర్‌కు చెందిన విక్కర్స్ విస్కౌంట్ వీటీ–డీజేసీ విమానం ల్యాండ్ అవుతుండగా మూడుసార్లు రన్‌వేను గుద్దుకోవడంతో నోస్‌వీల్ దెబ్బతింది. అప్పట్లోనూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కుదుపులొచ్చాయ్ ఖతార్ నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇక్కడికి వచ్చాను. విమానం రన్‌వే పైకి దిగిన తర్వాత లోపల కుదుపులు వచ్చాయి. ఉన్నట్టుండి విమానం ఆగిపోయింది. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. – రేష్మ, ప్రయాణికురాలు, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా చదవండి: అవమానించారు.. డబ్బులడిగారు: మను భాకర్ ఇక ఆర్టీసీలోనూ ఆఫర్లు -
కొత్త రన్‌వేపై ఇక రయ్.. రయ్!
సాక్షి, అమరావతి: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త రన్‌వే ట్రయల్ రన్‌కు సిద్ధమవుతోంది. రూ.125 కోట్ల వ్యయంతో 1,074 మీటర్ల మేర రన్‌వే నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికే 2,286 మీటర్ల పొడవున్న పాత రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకుంటున్నాయి. విమానాశ్రయానికి పెరుగుతున్న విమానాల తాకిడిని దృష్టిలో ఉంచుకుని కొత్త రన్‌వే నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడంతో విమానాశ్రయంలో మొత్తం రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరింది. దీనిపై ట్రయల్ రన్‌కు అనుమతిలిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఉత్తర్వులిచ్చినట్లు సమాచారం. ఈ నెలాఖరు నాటికి కొత్త రన్‌వేపై విమానాల టేకాఫ్, ల్యాండింగ్ల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమయ్యాక ఈ రన్‌వే దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌కు అనువైనదిగా గుర్తింపు వస్తుంది. (దేశీయ ప్రయాణాలకు ఊపు) -
దేశీయ ప్రయాణాలకు ఊపు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా ఊపందుకుంటోంది. సాధారణంగా ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలకు సగటున 90 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. కానీ, కోవిడ్ నేపథ్యంలో మార్చి మూడో వారం నుంచి విమాన సర్వీసులపై ఆంక్షలు విధించడంతో ఆ ప్రభావం ఈ విమానాశ్రయంపైనా పడింది. నెలకు సగటున 1,900 స్వదేశీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించే ఈ ఎయిర్‌పోర్టుకు ఏప్రిల్‌లో కేవలం 27 విమాన సర్వీసులే నడిచాయి. అంతేకాదు.. ఆ నెలలో తొమ్మిది మంది మాత్రమే బయలుదేరి వెళ్లగా, 31 మంది వచ్చారు. మే నెలలో విమాన సర్వీసుల సంఖ్య 191 కాగా, 4,848 మంది రాకపోకలు సాగించారు. అలా క్రమంగా ప్రతి నెలా పెరుగుతూ సెప్టెంబర్ నాటికి 902 విమాన సర్వీసుల్లో 37,613 మందికి చేరింది. ఇలా దాదాపు సగం విమాన సర్వీసులు పునరుద్ధరణ అయ్యాయి. రాకపోకలు సాగించే వారి సంఖ్య 40 వేలకు చేరువవుతోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు లండన్, సింగపూర్, పారిస్, దుబాయ్, దోహా, కువైట్, మస్కట్, షార్జా, అబుదాబి, బహరైన్, రస్‌అల్‌ఖైమా, జెడ్డా, రియాద్ తదితర దేశాలు, ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపారు. ఇలా విజయవాడ విమానాశ్రయానికి మే 20 తేదీ నుంచి ఈనెల 8 వరకు 170 విమానాల్లో 24,054 మంది వచ్చారు. కోవిడ్ భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం విమానాశ్రయంలో కోవిడ్‌పై భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. విమాన ప్రయాణికులెవరూ భయాందోళన చెందవద్దు. విమాన ప్రయాణం సురక్షితం. ఇప్పటికే 40% ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలోనే నూరు శాతానికి పెరిగే అవకాశం ఉంది. – మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ ఎయిర్పోర్ట్ -
విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి
గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి సేవలందించేందుకు సిద్ధమవుతోంది. లాక్డౌన్ వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. తొలుత పరిమిత సంఖ్యలో విమానాలు నడిపేందుకు ఎయిర్‌లైన్స్, ఎయిర్పోర్ట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశీయ విమాన సేవల కోసం ఎయిర్‌పోర్టులోని ట్రాన్సిట్ టెర్మినల్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా టెర్మినల్‌లోని ఎరైవల్, డిపార్చర్ బ్లాకుల్లో బోర్డింగ్ కౌంటర్లు, కన్వేయర్ బెల్ట్స్ వద్ద మార్కింగ్‌లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌పోర్టులోకి అనుమతించనున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం వారికి థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ధేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వీసులు నడుస్తాయి. ముందుగా న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకు మాత్రమే ఇక్కడి నుంచి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. స్పైస్ జెట్ సంస్థ బెంగళూరు నుంచి విజయవాడకు మంగళవారం ఒకటి, మిగిలిన రోజుల్లో రెండు సర్వీస్‌లు చొప్పున నడపనుంది. ఇండిగో సంస్థ రోజుకు ఒకటి చొప్పున హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు సర్వీస్‌లను ప్రకటించగా, ఎయిరిండియా న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి రాత్రి సర్వీస్‌ను మాత్రమే నడపనుంది. ట్రూజెట్ సంస్థ కడపకు 26వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభించనుంది. ఈ సర్వీసులకుగాను ఇప్పటికే ఆయా విమాన సంస్థలు టికెట్ల బుకింగ్ మొదలుపెట్టాయి. -
గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు
ఎయిర్‌పోర్టు (గన్నవరం): గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్‌కు విమాన సర్వీస్‌లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్‌జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ముందుకువచ్చాయి. అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. స్పైస్ జెట్ వైజాగ్ సర్వీస్.. స్పైస్‌జెట్ సంస్థ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్‌కు ఇండిగో నాలుగో సర్వీస్.. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్‌లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్‌ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది. -
ఎవరి తనిఖీలైనా భద్రత కోసమే!
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేసేటప్పుడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా దానిని విస్మరించి విమానయాన శాఖ వారు సాధారణ ప్రయాణికుడిలాగా తనిఖీలు నిర్వహించారని ఇది ఉద్దేశపూర్వకంగా ఆయనను కించపరచడానికి చేసిన చర్యగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించి నిరసనలు తెలపడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి విమాన శాఖ రక్షణ విభాగం ఈ అంశంలో వివ రణ ఇస్తూ కేవలం గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేరుగా విమాన ప్రవేశం ఉంటుందని జడ్ ప్లస్ విభాగానికి చెందిన ప్రయాణికులను కూడా సాధారణ ప్రయాణికుల గానే పరిగణించి తనిఖీలు నిర్వ హిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి మూలం రాజకీయ నాయకులు వారి అభిమానులు ఊహించుకున్న లేని ప్రాధాన్యత. మర్యాదలు ప్రత్యేక సదుపాయాలు పదవికి సంబంధించినవే కాని వ్యక్తికి సంబంధించినవి కావు అనే ప్రధానమైనటువంటి అంశం మరిచిపో బట్టే చాలామంది నాయకులు పదవీచ్యుతులు అయిన పిదప కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కని పరిపాలన సంçస్కృతులు ఉన్న ఐరోపా దేశాలలో పదవిలో ఉన్నప్పుడే ప్రధాన మంత్రులు ఇతర ఉన్నత స్థాయి నాయకులు మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఉపయోగించుకోవటం, సైకిల్‌పై పార్కులు లాంటి బహిరంగ స్థలాల్లో వచ్చి మిగిలిన వారితో కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది. కానీ భారతదేశం లాంటి దేశాలలో వలస పాలన వారసత్వంగా పాలకులకు పాలితులకు మధ్య మొదటినుంచి దూరం ఉంటూనే ఉన్నది. అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలలో సివిల్ లైన్స్ ప్రాంతాల్లో ఉండటం ఆఫీసు హంగామా, దర్జా ,బిళ్ళ బంట్రోతు లు ఒక కృత్రిమమైన వాతావరణాన్ని అధికారంలో ఉన్నవారి చుట్టూ కల్పిస్తాయి. వలస పాలనకు చిహ్నాలైన ఇదే విధానాలను గణతంత్ర ప్రజాస్వామ్యం అయిన తరువాత కూడా భారతదేశంలో మనం కొనసాగిస్తూనే ఉన్నాం. దీంతో రాజకీయ నాయకులు స్వతంత్ర భారతంలో ఆధునిక కాలపు మహారాజులాగా తయారైనారు. సరైన నియంత్రణ బాధ్యతాయుత విధానాలు లేకపోవడంతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, దుబారా దర్జా ఖర్చులకు అలవాటై పోయారు. అంతేకాకుండా పదవి కోల్పోయిన తర్వాత కూడా అవే సదుపాయాలను జన్మహక్కు లాగా భావించి ప్రవర్తించడం జరుగుతున్నది. పదవి కోల్పోయిన తర్వాత కూడా ఈ నాయకులు ప్రభుత్వ నివాసాలు వదలక పోవడం విద్యుత్తు, నీటి చార్జీలు కూడా కట్టకపోవడం వీరికి పరిపాటి అయిపోయింది. చివరకు కోర్టులు కలగచేసుకొని ప్రభుత్వ నివాసాల నుంచి వీరిని బయటికి పంపించి వారిచే బిల్లులు కట్టించే పరిస్థితి ఏర్పడింది. ఈ జాడ్యం రాజకీయ ప్రముఖులకే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది. తమను ప్రత్యేకంగా గుర్తించి మర్యాదలు చేయాలని భావించడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య టోల్గేట్ వద్ద ఒక మంత్రిగారి భార్య ప్రవర్తించిన విధానం ఈ అహంకార భావన ఫలితమే. ఇటువంటి దౌర్జన్యాలు అధికారులపై రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు చేయటం సాధారణం అయిపోయింది. సరైన నియంత్రణ విధానాలు ఆడిట్ విధానాలు లేకపోవటంతో రాజకీయ ప్రముఖులు నాయకులు వారి హోదాకి, స్థాయికి మించిన అనేక సదుపాయాలను, సౌకర్యాలను పొందుతున్నారు. సరైన ఆడిటింగ్ విధానాలు, నియంత్రణల ద్వారా వీరందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించేటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన సంఘటనకు వస్తే ఇది అధికారికంగా ఉన్న సదుపాయము సౌకర్యము కానే కాదు. కేవలం ఆయన అభిమానులు ఊహించుకున్న ప్రాధాన్యం లేని సౌకర్యాలు మాత్రమే. ఇతర జడ్ కేటగిరి వ్యక్తుల లాగానే ఆయనను విమానయాన సంస్థ వారు పరిగణించడం జరిగింది. ఈ అంశంపై విమానయాన భద్రత విభాగం వారు ఇచ్చిన వివరణలో ఒక అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. వారి వివరణ గవర్నర్ ముఖ్యమంత్రి స్థాయి వారికి మాత్రమే తనిఖీ లేని ప్రవేశానికి అవకాశం ఉన్నది. తనిఖీ అనేది ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేసే అంశం కాదు. మిగిలిన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసే చర్య. అందువలన దీని నుంచి ఎంత గొప్ప వారైనా మినహాయింపు ఉండటానికి అవకాశం లేదు. అందరిని భద్రత తనిఖీ తర్వాతనే ప్రవేశం ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ముందే తెలియదు కదా! వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
విజయవాడ విమానాశ్రయానికి రూ.145 కోట్లతో రన్‌వే
సాక్షి, విజయవాడ : విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా కొత్త రన్‌వే ఏర్పాటుకు రూ.145 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ జి.మధుసూదనరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విమానశ్రయ అభివృద్ధి, కొత్త విమానాలు రాకపోకలు వంటి అంశాలపై సదస్సు నిర్వహించారు. చాంబర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు పారిశ్రామిక , వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యఅతిథి మధుసూదనరావు మాట్లాడుతూ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కొత్త రన్‌వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు రూ.108 కోట్ల అంచనాతో కొనసాగుతున్నట్లు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 70 శాతం పెరిగినట్లు తెలిపారు. విమానాల రాకపోకలు సైతం 40 శాతం పెరిగినట్లు తెలిపారు. కార్గో భవన నిర్మాణాన్ని రూ.50 లక్షల అంచనాతో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు విమానాశ్రయం డెరైక్టర్ మధుసూదనరావు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ విమానాలు నడుస్తాయని, అందరికీ అందుబాటులో వుండేలా స్లాట్స్ కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ చాంబర్ అధ్యక్షుడు (ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను సంప్రదిస్తే వివాదం ఉండేది కాదు
-
శంషాబాద్ విమానాశ్రయానికి గరుడ సర్వీస్
విజయవాడ : వేకువజామునే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా శనివారం నుంచి గరుడ సర్వీసును నడపనున్నట్లు విజయవాడ డిపో మేనేజర్ నాగశేషు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేకువజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరే విమానాల్లో వెళ్లే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలో రాత్రి పది గంటలకు బయలుదేరి మియాపూర్ వెళ్లే గరుడ సర్వీసును మెహిదీపట్నం, గచ్చిబౌలి, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా మియాపూర్ వెళ్లేలా మార్పు చేశామని తెలిపారు. ఈ బస్సు వేకువజామున నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుందని వివరించారు. -
విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?
పెను తుపాను వస్తే తప్పని ఇబ్బందులు అధునాతన టెర్మినల్ భవనం అవసరం ప్రత్యేక డిజైన్ సిద్ధం చేస్తున్న అధికారులు భూములిచ్చేందుకు ఒప్పుకోని రైతులు సాక్షి, విజయవాడ : హుదూద్ సృష్టించిన పెను విలయానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా నిర్మించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసం కావడంతో... గన్నవరం విమానాశ్రయ పటిష్టతపైనా చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయమే పెనుగాలుల నుంచి తప్పించుకోలేకపోయిందని, సాధారణ గన్నవరం ఎయిర్‌పోర్టు ఏలా తట్టుకుంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజధాని ఎయిర్‌పోర్టు కాబట్టి దీనిని మరింతగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది. బ్రిటిష్ పరిపాలన సమయం నుంచే గన్నవరం విమానాశ్రయం ఉంది. అయితే 2000 సంవత్సరం వరకు కేవలం రన్వేగానే దీనిని వినియోగించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మూడు ఎయిర్‌లైన్స్ నాలుగు నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఐదేళ్ల నుంచే వాడకంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం సాధారణ నిర్మాణం గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం రన్‌వే వాడకానికి వీలుగా నిర్మించారు. భవనంపై భాగం అంతా రేకులతో నిర్మితమై ఉంది. 574 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులో 7,500 అడుగుల రన్‌వే ఉంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్, మధురై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో విఐపీల రాకపోకలు అధికమయ్యాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెం దిన వారే అధికంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నెలకు సగటున మూడుసార్లు వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సదుపాయాల లేమి... మారుతున్న అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు పెరిగాయి కాని సౌకర్యాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌లో కేవలం 70 మందికి మాత్రమే సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే 7,500 అడుగులు రన్‌వే ఉంది. అలాగే విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏరియా తక్కువే ఉంది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆలోక్ సిన్హా, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టును సందర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ రాజధానిగా ప్రకటించనున్న క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే భూసేకరణ అసలు సమస్యగా మారింది. 480 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా వాటిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 430 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతలు నుంచి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తి అయితేనే విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే గన్నవరం భూముల ధరలు కోట్లకు చేరిన క్రమంలో రైతులు భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తుపానుల ముప్పు తక్కువే - రాజ్‌కిషోర్, డెరైక్టర్ విశాఖ విమానాశ్రయం సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల కొంత నష్టం వాటిల్లిందని, అయితే గన్నవరానికి అలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిషోర్ సాక్షికి తెలిపారు. సముద్రానికి , నదికి దూరంగా జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ప్లానింగ్ విభాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెర్మినల్ డిజైన్‌కు రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు.