
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా ఊపందుకుంటోంది. సాధారణంగా ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలకు సగటున 90 వేల మంది ప్రయాణికులు వచ్చి వెళ్తుంటారు. కానీ, కోవిడ్ నేపథ్యంలో మార్చి మూడో వారం నుంచి విమాన సర్వీసులపై ఆంక్షలు విధించడంతో ఆ ప్రభావం ఈ విమానాశ్రయంపైనా పడింది. నెలకు సగటున 1,900 స్వదేశీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించే ఈ ఎయిర్‌పోర్టుకు ఏప్రిల్‌లో కేవలం 27 విమాన సర్వీసులే నడిచాయి. అంతేకాదు.. ఆ నెలలో తొమ్మిది మంది మాత్రమే బయలుదేరి వెళ్లగా, 31 మంది వచ్చారు.
మే నెలలో విమాన సర్వీసుల సంఖ్య 191 కాగా, 4,848 మంది రాకపోకలు సాగించారు. అలా క్రమంగా ప్రతి నెలా పెరుగుతూ సెప్టెంబర్ నాటికి 902 విమాన సర్వీసుల్లో 37,613 మందికి చేరింది. ఇలా దాదాపు సగం విమాన సర్వీసులు పునరుద్ధరణ అయ్యాయి. రాకపోకలు సాగించే వారి సంఖ్య 40 వేలకు చేరువవుతోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు లండన్, సింగపూర్, పారిస్, దుబాయ్, దోహా, కువైట్, మస్కట్, షార్జా, అబుదాబి, బహరైన్, రస్‌అల్‌ఖైమా, జెడ్డా, రియాద్ తదితర దేశాలు, ప్రాంతాల నుంచి విమాన సర్వీసులు నడిపారు. ఇలా విజయవాడ విమానాశ్రయానికి మే 20 తేదీ నుంచి ఈనెల 8 వరకు 170 విమానాల్లో 24,054 మంది వచ్చారు.
కోవిడ్ భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యం
విమానాశ్రయంలో కోవిడ్‌పై భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. విమాన ప్రయాణికులెవరూ భయాందోళన చెందవద్దు. విమాన ప్రయాణం సురక్షితం. ఇప్పటికే 40% ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలోనే నూరు శాతానికి పెరిగే అవకాశం ఉంది.
– మధుసూదనరావు, డైరెక్టర్, విజయవాడ ఎయిర్‌పోర్ట్
Comments
Please login to add a commentAdd a comment