ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర | Direct Flight Facility From Vijayawada Airport For Hajj | Sakshi
Sakshi News home page

ఇకపై ఏపీ నుంచి నేరుగా హజ్ యాత్ర

Published Tue, May 23 2023 8:44 PM | Last Updated on Tue, May 23 2023 8:46 PM

Direct Flight Facility From Vijayawada Airport For Hajj - Sakshi

సాక్షి, విజయవాడ: మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మొదటి ప్లోర్‌లోని సీసీఎల్ఏ కాన్ఫరెన్స్ హాల్‌లో మైనార్టీ శాఖ సెక్రటరీ ఎ.ఎం.డి. ఇంతియాజ్, హజ్ కమిటీ ఛైర్మన్ బి.ఎస్. గౌస్ లాజమ్ ఆధ్వర్యంలో జరిగిన హజ్ కమిటీ సమన్వయ సమావేశంలో మంత్రి అంజాద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలిసారిగా గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుండి 1,813 మంది యాత్రికులను నేరుగా పవిత్ర హజ్ యాత్రకు పంపడం జరుగుతుందన్నారు. 7 జూన్, 2023 నుండి 19 జూన్, 2023 వరకు కొనసాగనున్న హజ్ యాత్రలో భాగంగా ప్రతి రోజూ 155 మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా ఎంబార్కేషన్ పాయింట్ వచ్చాక వివిధ ఎయిర్ లైన్స్ ఏపీ నుండి యాత్రికులను హజ్‌కు తీసుకెళ్లి మళ్లీ హజ్ నుంచి ఏపీకి తీసుకువచ్చే విధంగా ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు.

హైదరాబాద్, బెంగుళూరు ఎంబార్కేషన్ నుండి వెళ్లే ప్రతి ఒక్క యాత్రికుడి మీద రూ.80,000 అదనంగా భారం పడుతున్న పరిస్థితుల్లో సీఎం జగన్‌ ఆదేశాలకనుగుణంగా  ఢిల్లీ వెళ్లి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సింథియా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించి హజ్ యాత్ర టికెట్ ధరను తగ్గించాలని కోరామన్నారు. తగ్గించలేని పరిస్థితుల్లో తమ రాష్ట్రం నుండి హజ్ కు వెళ్లే యాత్రికులను హైదరాబాద్, బెంగుళూరు నుండి వెళ్లే విధంగా అనుమతించాలని కోరామన్నారు.

ఈ విషయమై పరిశీలిస్తామని కేంద్ర మంత్రులు చెప్పినట్లు అంజాద్ బాషా వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ప్రతి ఏటా యాత్రికుడిపై విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చుకు అదనంగా  ఒక్కొక్కరికి రూ. 80,000ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కి మైనార్టీ సంక్షేమ శాఖ, హజ్ యాత్రికుల తరపున అంజాద్ బాషా కృతజ్ఞతలు తెలిపారు.

హజ్ యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరు వద్ద గల మదరసాలో వసతి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాత్రికుల లగేజ్ను మదరసాలోనే స్కానింగ్ చేసి అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టుకు తరలించేలా ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ఏర్పాట్లు చేశారన్నారు. అదే విధంగా ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4 ఏసీ బస్సుల ద్వారా యాత్రికులను మదరసా నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు పంపించే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

హజ్ యాత్రికుల సౌకర్యార్థం 24 గంటలు పనిచేసేలా మదరసా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు. హజ్‌కు వెళ్లే యాత్రికులు వసతి కేంద్రం వద్దకు 24 గంటల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వివిధ శాఖల అధికారులంతా సమన్వయంతో పని చేయాలని అంజాద్ బాషా కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ ఇంతియాజ్ మాట్లాడుతూ 7 జూన్, 203 నుండి 19 జూన్, 2023 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి హజ్‌కు బయలుదేరే యాత్రికుల యాత్ర సవ్యంగా సాగాలని ఆకాంక్షించారు. 
చదవండి: కాంగ్రెస్‌.. మోదీ.. మధ్యలో కేటీఆర్‌ అదిరిపోయే ఎంట్రీ

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, హజ్ కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎం.నవాబ్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యులు ఇసాక్,  మైనార్టీ శాఖ సలహాదారు ఎస్.ఎం. జియావుద్దీన్, ఏపీ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవాబ్ ఖాదర్ సాబ్, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, ఆర్డీవోలు, ఎయిర్ లైన్స్ అధికారులు, గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ, కస్టమ్స్, బ్యాంకర్లు, ఆర్టీసీ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ అండ్ బీ, బీఎస్ఎన్ఎల్, ఫైర్ సర్వీసు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement