![Now Your Face Boarding Pass Avalabile At Vijayawada Airport - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/27/face_1.jpg.webp?itok=p4xgDPO5)
సాక్షి, అమరావతి: విజయవాడ విమానాశ్రయంలోకి అత్యాధునిక వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలో విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని.. కియోస్క్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నెల రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ వ్యవస్థ వల్ల బోర్డింగ్ పాస్‌ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుంది. కేవలం ముఖం చూపించడం ద్వారా ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా నేరుగా విమానం ఎక్కవచ్చు. ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్, చెక్ ఇన్, బోర్డింగ్ అన్నీ కూడా కేవలం ముఖం చూపించడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మీ కదలికలను ఎప్పటికప్పుడు విమానాశ్రయ సిబ్బంది గమనిస్తుంటారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేశారు. ఇప్పుడు విజయవాడ, వారణాసి, పుణె, కోల్‌కతా విమానాశ్రయాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ నాలుగు విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను ఎన్‌ఈసీ కార్పొరేషన్ ఇండియా అందుబాటులోకి తీసుకువస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment