Boarding pass
-
అన్ని తనిఖీలు దాటుకుని ఎంచక్కా పారిస్‌కు
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు. పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది. దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది. అమెరికా ఎయిర్పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది. రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్రూమ్లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. అమెరికా గ్రీన్‌కార్డ్.. విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు. లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు. -
విమానంలో స్మోకింగ్.. పాత బోర్డింగ్ పాస్‌లో ఆప్షన్
విమాన ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఒకప్పుడు విమానంలో స్మోకింగ్ అనేది.. డ్రింక్ చేసినంత ఈజీగా ఉండేదని, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోల ద్వారా తెలుస్తోంది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను గమనించినట్లయితే.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు స్మోకింగ్ లేదా నాన్ స్మోకింగ్ క్యాబిన్ ఎంచుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో విమానంలో స్మోకింగ్ కూడా చేసుకోవచ్చా? అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.బోర్డింగ్ పాస్‌లను గమనిస్తే.. లండన్ హీత్రూ నుంచి మొరాకోలోని కాసాబ్లాంకాకు వెళ్తున్న విమానంలో "నాన్-స్మోకింగ్ క్యాబిన్" అని ఉండటం చూడవచ్చు. ఒకప్పుడు విమానాల్లో కూడా స్మోకింగ్ చేసుకోవచ్చనే విషయం ఈ ఫోటోలు చూసేవరకు చాలామందికి తెలియకపోవచ్చు.ఈ టికెట్స్ ఎప్పటివనే విషయం వెల్లడికాలేదు. కానీ ఇవి 1955 - 2009 మధ్య టికెట్స్ అయి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ టికెట్స్ మీద కనిపించే AFSL అనేది 'ఎయిర్ ఫ్రాన్స్ సర్వీసెస్ లిమిటెడ్' అని ఒకరు పేర్కొన్నారు. ఇవి 1996లో ప్రారంభమై 2009లో రద్దు చేశారు. ప్రస్తుతం విమానాల్లో స్మోకింగ్ నిషేదించారు. -
ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో..
సాక్షి, అమరావతి: విజయవాడ విమానాశ్రయంలోకి అత్యాధునిక వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ డీజీ యాత్ర పేరుతో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను త్వరలో విజయవాడలో ప్రారంభించబోతున్నట్లు ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని.. కియోస్క్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నెల రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. ఈ వ్యవస్థ వల్ల బోర్డింగ్ పాస్‌ల కోసం క్యూలలో నిల్చునే బాధ తప్పుతుంది. కేవలం ముఖం చూపించడం ద్వారా ఎలాంటి కాగితాలు అవసరం లేకుండా నేరుగా విమానం ఎక్కవచ్చు. ప్రవేశ ద్వారం, సెక్యూరిటీ చెక్, సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్, చెక్ ఇన్, బోర్డింగ్ అన్నీ కూడా కేవలం ముఖం చూపించడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా మీ కదలికలను ఎప్పటికప్పుడు విమానాశ్రయ సిబ్బంది గమనిస్తుంటారు. పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల్లో ఇప్పటికే ఈ విధానం అమలు చేశారు. ఇప్పుడు విజయవాడ, వారణాసి, పుణె, కోల్‌కతా విమానాశ్రయాల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ నాలుగు విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను ఎన్ఈసీ కార్పొరేషన్ ఇండియా అందుబాటులోకి తీసుకువస్తోంది. -
ముఖమే బోర్డింగ్ పాస్!
త్వరలోనే బెంగళూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా మారనుంది. దేశ చరిత్రలో తొలిసారిగా 2019 ప్రథమార్ధంలో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఈ ‘ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ని ప్రారంభించనున్నారు. ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వాడుకోనున్నారు. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగళూరు నిలవనుంది. ఈ సాంకేతికత అమలు ఒప్పందంపై పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘ఎయిర్‌పోర్ట్‌లో క్యూలైన్లో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది సాయపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు పేపర్‌రహిత విధానం అమలే లక్ష్యంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ వెల్లడించింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌పాస్, పాస్‌పోర్టు, వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం ఉండదు. -
ఫేసే బోర్డింగ్ పాస్...!
త్వరలోనే బెంగలూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా ఉపయోగపడనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 2019 ప్రధమార్థంలో బెంగలూరు ఎయిర్‌పోర్ట్‌లో దీనిని ప్రవేశపెడతారు. ఈ విధానాన్ని ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణీకులు వినియోగించుకుంటారు. పాసింజర్లు విమానప్రయాణాల్లో భాగంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలిసారిగా ఇక్కడ ఉపయోగించనున్నారు. అమల్లోకి వచ్చాక విమానయానంలో ఇదో మైలురాయి కానుంది. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగలూరు నిలవనుంది. ఈ మేరకు పేపర్‌లెస్ బయోమెట్రిక్ సెల్ఫ్–బోర్డింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే కాంట్రాక్ట్‌పై బుధవారం పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగలూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘విజన్‌బాక్స్ సంస్థ సొంతంగా రూపొందించిన బయోమెట్రిక్ టెక్నాలజీకి ఉపయోగించి ఫ్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానప్రయాణం కోసం క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది దోహదపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వెల్లడించారు. దేశీయ విమానయానం కోసం ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు కాగితాన్ని వినియోగించకూడదన్న లక్ష్యంలో భాగంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. బోర్డింగ్‌పాస్‌లు, పాస్‌పోర్టులు, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం లేకుండా ఇది దోహదపడుతుందని పేర్కొంది. -
విమాన సేవలు దారుణం
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో చెక్–ఇన్ కౌంటర్ల వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందనీ, సిబ్బంది తక్కువ ఉండడంతో బోర్డింగ్ పాస్ జారీ బాగా ఆలస్యమవుతోందని, దీంతో ప్రయాణికులు చాలా సార్లు విమానం మిస్‌అవుతున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం (స్టాండింగ్ కమిటీ) నివేదించింది. ఈ నివేదికను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇండిగో వంటి చౌకధరల విమానయాన సంస్థల చెక్–ఇన్ కౌంటర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందని రవాణా, పర్యాటకం, సంస్కృతి విభాగాల స్థాయీ సంఘం తెలిపింది. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులను చెక్–ఇన్ క్యూలో అధిక సమయం నిల్చోబెట్టి, వారు టికెట్ బుక్ చేసుకున్న విమానమెక్కే అవకాశం లేకుండా చేసి, ఆ తర్వాతి విమానంలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించేలా అక్రమాలకు పాల్పడుతున్నాయని నివేదించింది. విమానాశ్రయాల్లో ఆయా సంస్థలకు తగినన్ని చెక్–ఇన్ కౌంటర్లు ఉండేలా ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలనీ, రద్దీ సమయాల్లో చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బందిని పెంచాలని సూచించింది. బోర్డింగ్ పాస్ పొందడానికి ప్రయాణికులు 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిని కిందపడేసి కొట్టడాన్ని కమిటీ ఆక్షేపించింది. ఇది సంస్థాగతమైన సమస్య అనీ, ప్రయాణికుల పట్ల ఆ సంస్థ ఉద్యోగులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించింది. కొన్నిసార్లు విమానసంస్థలు టికెట్ రేట్లను 10 రెట్లు పెంచేసి అడ్డగోలు దోపిడీకి దిగుతున్నాయనీ, ఈ విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. టికెట్ రద్దు చార్జీలు కూడా బేస్ ఫేర్‌లో 50 శాతానికి మించకుండా నియంత్రణ విధించాలని కమిటీ సూచించింది. -
బోర్డింగ్ పాస్‌కు బై..బై..!
► ఇప్పటికే హైదరాబాద్ విమానాశ్రయంలో అమలు ► త్వరలో మరిన్ని విమానాశ్రయాలకు విస్తరణ ► సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్ పాస్‌ల స్థానంలో బయోమెట్రిక్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్ చెక్–ఇన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని, వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెపుతున్నాయి. ఇటీవలే దేశంలోని 17 ఎయిర్‌పోర్ట్‌ల్లో హ్యాండ్‌బ్యాగేజ్ ట్యాగ్ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలోని 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నామని, ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని విమానయాన భద్రతా ఏజెన్సీ అయిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాము రెండు ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో మొదటిది విమానాశ్ర యాల్లో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సొల్యూషన్ వ్యవస్థను ప్రవేశపెట్టడమని, ప్రస్తుతం ఉన్న భద్రతా సంస్థలన్నింటినీ అనుసంధానించడం.. బయోమెట్రిక్, వీడియో ఎనలిస్టిస్ సిస్టమ్ మొదలైనవి వినియోగించడం ఇందులో భాగమన్నారు. బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తి పలకడం దీనిలో భాగమేనని, ఇటీవలే ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించామని, ప్రస్తుతం అక్కడ ప్రయాణికులకు ఎక్స్‌ప్రెస్ చెక్–ఇన్ విధానం అందుబాటులోకి వచ్చిం దని తెలిపారు. బోర్డింగ్ పాస్ విధానానికి స్వస్తిపలకడం అనేది టెక్నాలజీ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో హైదరాబాద్ విమానాశ్రయం ఒక్కటే పూర్తిగా బయోమెట్రిక్ విధానాన్ని కలిగి ఉందని, దేశంలోని మిగిలిన ఎయిర్పోర్టుల్లోనూ దీనిని అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవ వనరులను హేతుబద్ధీకరించడం తమ రెండో ప్రాజెక్టు అని సింగ్ చెప్పారు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీలోనే కాక ఎయిరోస్పేస్ స్టేషన్లు, న్యూక్లియర్ పవర్ప్లాంట్లు మొదలైన వాటిలో దీనిని అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన విధానం ప్రకారం.. దేశీయ విమానయాన ప్రయాణికులు టెర్మినల్ బిల్డింగ్‌కు వెలుపల ఉండే సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల నుంచి బోర్డింగ్ పాస్ ప్రింటవుట్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత చెక్ ఇన్ ఏరియాలోకి వెళ్లకుండా నేరుగా ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్ లేన్‌లోకి చేరుకోవచ్చు. అక్కడి నుంచి బోర్డింగ్ ఏరియాకు వెళతారు. -
ఎయిర్‌పోర్టులో జేసీ దివాకర్‌రెడ్డి వీరంగం
విశాఖపట్నం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గురువారం ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో వీరంగం సృష్టించారు. బోర్డింగ్ పాస్ ఇవ్వలేదన్న కోపంతో దౌర్జన్యానికి దిగారు. ఇండిగో విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఈ ఉదయం ఆయన విమానాశ్రయానికి వచ్చారు. బోర్డింగ్ పాస్ జారీ సమయం ముగియడంతో సిబ్బంది కౌంటర్‌ను ముసేశారు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని సిబ్బందితో ఆయన వాదనకు దిగారు. సమయం ముగిసిందని ఇవ్వడం కుదరదని చెప్పడంతో దివాకర్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. బోర్డింగ్ పాస్ ప్రింటర్‌ను విసిరేసి వీరంగం సృష్టించారు. జేసీ చర్యతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆయనపై ఉన్నతాధికారులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం తమ మేనేజర్‌పై దాడి చేసిన శివసేన రవీంద్ర గైక్వాడ్‌ను విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు విమాన సంస్థలు కూడా ఆయనపై నిషేధం అమలు చేశాయి. దిగివచ్చిన గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆయనపై నిషేధం తొలగించారు. ఎయిర్‌పోర్టులో దౌర్జన్యం చేసిన దివాకర్‌రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
ఎయిరిండియా సిబ్బందిపై జేసీ ఫైర్
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా సిబ్బందిపై అనంతపురం ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిరిండియా రీజినల్‌కు చెందిన మధ్యాహ్నం 1.20 గంటల సర్వీస్‌కు టికెట్ బుక్ చేసుకున్నారు. విజయవాడ నుంచి అనుచరులతో కలిసి రోడ్డు మార్గం ద్వారా అర్ధగంట ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బోర్డింగ్ పాస్ కోసం వెళ్లగా అప్పటికే విమానం నిండిపోయిందని, సీట్లు ఖాళీ లేవని ఎయిరిండియా సిబ్బంది సమాధానమిచ్చారు. టికెట్ కన్ఫర్మేషన్ అయినట్లుగా ఫోన్‌కు మెసేజ్ పంపి ఇప్పడు సీటు లేదని చెప్పడం ఏంటని వాదనకు దిగారు. దీంతో విమానంలో 72 సీటింగ్ మాత్రమే ఉన్నాయని.. 84 మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని... సిబ్బంది తెలిపారు. దీంతో అదనంగా ఉన్న 12 టికెట్లకు బోర్డింగ్ ఇవ్వ లేదని వివరించారు. టికెట్లు నిరాకరించిన వారిలో ఎంపీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కూడా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి వీఐపీ లాంజ్‌లో కూర్చునేందుకు కూడా నిరాకరించారు. ఎయిరిండియా తీరుపై స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న ఎయిర్‌పోర్టు డెరైక్టర్ మధుసూదనరావు ఎయిరిండియా ప్రతినిధులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరికి విమానంలోని ఫ్లయిట్ ఇంజినీరు సీటును ఎంపీకి కేటాయించడంతో ఆయన హైదరాబాద్ వెళ్లగలిగారు. -
శ్రీవారికీ బోర్డింగ్ పాస్!
- విమానంలో ప్రయాణించిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి - ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవమూర్తులను పెట్టెలో పెట్టేందుకు శాస్త్రం అడ్డురావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు - అమెరికాలో టీటీడీ కల్యాణోత్సవాల సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన ఘటన తిరుమల వెంకన్నకు అమెరికన్ విమాన సంస్థ బోర్డింగ్ పాసా? ఆశ్చర్యం కలుగుతోంది కదూ..! అవును.. సాక్షాత్తు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీవారు ఈనెల 11వ తేదీన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి డల్లాస్‌కు ఆ దేశ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. అదేమిటో తెలుసుకుందాం.. సాక్షి, తిరుమల: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి సైతం బోర్డింగ్ పాస్ తీసుకుని విమానంలో ప్రయాణించారు. ఈనెల 1 నుంచి అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ, స్థానిక సంస్థలతో కలసి శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్వో నాగేంద్రకుమార్, అర్చకులు, అధికారులు తరలివెళ్లారు. ఇందుకోసం టీటీడీ ఆగమోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి విగ్రహాలను కూడా వెంట తరలించింది. అక్కడ తొలుత వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ప్రాణప్రతిష్ఠ, ఇతర వైదిక పూజలు నిర్వహించారు. తర్వాత అవే విగ్రహాలతో శ్రీనివాస కల్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పటి నుంచి విగ్రహాలను ఆగమబద్ధంగానే ఒకచోట నుంచి మరోచోటికి తరలిస్తూ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. ఉత్సవాలు లేని రోజుల్లో కూడా మూడు పూట్లా నిత్య పూజలు ఆరాధనలు కొనసాగించారు. అయితే, ఈ నెల 10వ తేదీన వాషింగ్టన్ డీసీలో కల్యాణోత్సవం ముగించుకుని 11వ తేదీన డల్లాస్‌కు ఉత్సవమూర్తులు బయల్దేరారు. ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గంలో తరలించేందుకు సమయం సరిపోలేదు. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విగ్రహాలను తరలించాలని ఇటు టీటీడీ, అటు స్థానిక నిర్వాహకులు సంయుక్తంగా సంకల్పించారు. ప్రాణప్రతిష్ఠతో పూజలు చేసిన విగ్రహమూర్తులను పెట్టెలో పెట్టి మూత వేయడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగమశాస్త్రం అంగీకరించదు. భారం ఆ వెంకన్నపైనే వేయడంతో సాక్షాత్తు ఆ స్వామే దారి చూపించినట్టైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులకు కేటాయించే మూడు సీట్లలోనే విగ్ర హమూర్తులను తరలించేందుకు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు సీట్ల కోసం అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ద్వారా బోర్డింగ్ పాసులు తీసుకున్నారు. అనుకున్న విధంగానే ఉత్సవమూర్తులను విమానంలో తరలించి, డల్లాస్‌లో శ్రీవారి కల్యాణోత్సవాలను విజయవంతంగా ముగించారు. ఆసక్తికరమైన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ నిర్ణయించిన సమయాల్లోనే కల్యాణోత్సవాలను నిర్వహించడంలో టీటీడీ, స్థానిక నిర్వాహకులు నిమగ్నమయ్యారు.