బోర్డింగ్ పాస్ లేకుండానే విమానంలో ప్రయాణించిన అనామకురాలు
అన్ని సెక్యూరిటీ చెక్‌లను ఎలా దాటగలిగిందని అధికారుల విస్మయం
సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన డెల్టా ఎయిర్‌లైన్స్
న్యూయార్క్/పారిస్: అమెరికా. నిఘా నేత్రాలమయం. అక్కడ మన లాంటి భారతీయులు రోడ్లపై తిరుగుతున్నా అనుమానమొస్తే పోలీసులు మొత్తం ఆరాతీస్తారు. సంబంధిత గుర్తింపు కార్డులు చూపిస్తేనే వదిలేస్తారు. లేదంటే పోలీస్‌స్టేషన్‌కు పోవాల్సిందే. మరి అలాంటిది అంతర్జాతీయ విమానాశ్రయంలో నేరుగా విమానం ఎక్కనిస్తారా?. అస్సలు కుదరదు.
పాస్‌పోర్ట్, వీసా, ఐడీ కార్డులు, లగేజీ తనిఖీలు, నిషేధిత వస్తువుల లేకుండా చూసుకోవడం.. వంటివన్నీ పూర్తిచేసుకుంటేనే బోర్డింగ్ పాస్ చేతికొస్తుంది. విమానంలోకి అడుగుపెట్టగలం. అలాంటిది ఒక మధ్యవయస్కురాలు ఇవేం లేకుండా నేరుగా విమానం ఎక్కేసింది. అదేదో మారుమూల విమానాశ్రయంలో అంతరాష్ట్ర విమానమో ఆమె ఎక్కలేదు. నేరుగా అంతర్జాతీయ విమానమే ఎక్కింది. న్యూయార్క్ నగరం నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు చేరుకుంది.
దీంతో అత్యంత కట్టుదిట్ట భద్రత అని చెప్పుకునే అమెరికా ఎయిర్‌పోర్ట్‌లోనూ డొల్ల వ్యవస్థ ఉందని ఆమె పరోక్షంగా నిరూపించింది. ఎక్కడా ఎవరికీ చిక్కుకుండా పారిస్‌లో దిగి ఎయిర్‌పోర్ట్ బయటకు వెళ్దామని ఆశించి భంగపడింది. ఫ్రాన్స్‌లో విమానం ల్యాండ్ అయ్యాక దొరికిపోయింది.
అమెరికా ఎయిర్‌పోర్ట్ వ్యవస్థ పరువుతీసిన ఈ మహిళ గురించే ఇప్పుడు ఎయిర్‌లైన్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం వల్లే ఆమె ఖండాంతయానం చేయగలిగిందని కొందరు ఆరోపిస్తున్నారు. అమెరికా ఎయిర్‌పోర్ట్ అథారిటీ వర్గాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాయి. తప్పు ఎక్కడ జరిగిందని కూపీలాగుతున్నాయి. ఈమె ఊరు పేరు ఇతరత్రా వివరాలను అధికారులు బయటపెట్టలేదు.
ఏం జరిగింది? ఎలా జరిగింది?
ట్రాన్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి న వివరాల ప్రకారం గత మంగళవారం న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. 55–60 ఏళ్ల మహిళ టికెట్, ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. అక్కడ రెండు చోట్ల ఐడెంటిటీని చెక్ చేసే గుర్తింపు కేంద్రాలను ఒడుపుగా దాటేసింది. తర్వాత అనుమానాస్పద వస్తువులను తనిఖీచేసే సెక్యూరిటీ చెక్‌పాయింట్లనూ దాటింది. తర్వాత బోర్డింగ్ పాస్ జారీచేసే చోటు నుంచి తెలివిగా ఆవలి వైపునకు వచ్చేసింది.
రన్‌వే మీద నిలిచి ఉన్న విమానం దాకా ప్రయాణికులను తీసుకెళ్లే బస్సును ఎక్కేసింది. తర్వాత విమానం తలుపు దగ్గర ఎయిర్‌హోస్టెస్ స్వాగత పలకరింపులు, పరిచయాలను పూర్తిచేసుకుని లోపలికి ప్రవేశించింది. నిండుగా ఉన్న విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండదుకాబట్టి బాత్‌రూమ్‌లోకి వెళ్లి దాక్కుంది. అంతా సవ్యంగా ఉండటంతో విమానం గాల్లోకి ఎగిరింది. ఫ్రాన్స్‌లోని ఛార్లెస్ డి గాలే ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ పాయింట్ వద్ద విమానం ఆగిన తర్వాత విమానంలోనే ఈమెను అధికారులు గుర్తించారు.
అదే విమానంలో ప్రయాణిస్తున్న న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాబ్ జాక్సన్ ఇంకొన్ని వివరాలను వెల్లడించారు. విమానంలో సీట్లో కూర్చోకుండా ఒక బాత్రూమ్ నుంచి ఇంకో బాత్రూమ్‌లోకి మారుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఈమె వాలకం చూసి విమానసిబ్బందికి అనుమానమొచ్చింది. ఈమెను ఆపి ప్రశ్నించేలోపు ఇంకో బాత్రూమ్‌లో దూరి గడియపెట్టుకుంది. దీంతో ఫ్రాన్స్‌లో దిగాక పైలట్ వెంటనే ఫ్రాన్స్ ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చాడు. ఏ ఉగ్రవాది నక్కాడో అని ప్రయాణికులు భయపడతారనే ఉద్దేశ్యంతో వాళ్లకు ఏమీ చెప్పలేదు. ‘‘అందరూ మీమీ సీట్లలో ప్రశాంతంగా కూర్చోండి. మన విమానంలో అదనపు అతిథి ఉన్నారు. పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు’’అని ప్యాసింజర్లను ప్రశాంతపరిచాడు. చివరకు పోలీసులు వచ్చి ఈమెను అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు.
అమెరికా గ్రీన్‌కార్డ్..
విమానంలో చొరబడిన ఈమెకు అమెరికా గ్రీన్‌కార్డ్ ఉందని, రష్యా పాస్‌పోర్ట్ ఉందని మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికాలో ఉండే ఉద్దేశంలేక కావాలనే ఫ్రాన్స్ శరణుకోరు తూ శరణారి్థగా ఇక్కడికి అక్రమంగా వచ్చిం దని మరో కథనం వెలువడింది. ఆమె మానసిక స్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదు. అనుమతిలేకుండా విమానం ఎక్కి సేవల దుర్వినియోగం, దేశం దాటి రావడం, ఇతరత్రా సెక్షన్ల కింద కేసులు మోపి ఫ్రాన్స్ జైళ్లో పడేయొచ్చు.
లేదంటే అమెరికాకే తిరిగి పంపొచ్చు. అప్పుడు అమెరికా చట్టాల ప్రకారం శిక్ష పడే వీలుంది. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించడంతో తమ వైపు సెక్యూరిటీ చెక్ విషయంలో ఏం లోపాలు జరిగాయో తెల్సుకునేందుకు విమానయాన సంస్థ ఈమెను ప్రశ్నించే వీలుంది. అమెరికాకు తిరిగొస్తే జేకేఎఫ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆమెను విచారించే అవకాశముంది. గత మంగళవారం థ్యాంక్స్‌గివింగ్ హాలిడే రోజు అమెరికా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. అమెరికాలో ఆ ఒక్కరోజే 27 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. ఆ రద్దీని ఈమె తనకు అనువుగా మలుచుకుని ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment