త్వరలోనే బెంగలూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా ఉపయోగపడనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 2019 ప్రధమార్థంలో బెంగలూరు ఎయిర్‌పోర్ట్‌లో దీనిని ప్రవేశపెడతారు. ఈ విధానాన్ని ముందుగా జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణీకులు వినియోగించుకుంటారు. పాసింజర్లు విమానప్రయాణాల్లో భాగంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలిసారిగా ఇక్కడ ఉపయోగించనున్నారు. అమల్లోకి వచ్చాక విమానయానంలో ఇదో మైలురాయి కానుంది. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్‌లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగలూరు నిలవనుంది.
ఈ మేరకు పేపర్‌లెస్ బయోమెట్రిక్ సెల్ఫ్–బోర్డింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే కాంట్రాక్ట్‌పై బుధవారం పోర్చుగల్‌లోని లిస్బన్‌లో బెంగలూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘విజన్‌బాక్స్ సంస్థ సొంతంగా రూపొందించిన బయోమెట్రిక్ టెక్నాలజీకి ఉపయోగించి ఫ్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానప్రయాణం కోసం క్యూలైన్‌లలో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది దోహదపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వెల్లడించారు.
దేశీయ విమానయానం కోసం ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు కాగితాన్ని వినియోగించకూడదన్న లక్ష్యంలో భాగంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. బోర్డింగ్‌పాస్‌లు, పాస్‌పోర్టులు, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం లేకుండా ఇది దోహదపడుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment