
ఎయిర్‌పోర్టు (గన్నవరం): గన్నవరం విమానాశ్రయానికి అక్టోబరులో కొత్తగా విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖకి ఏకంగా రెండు విమాన సర్వీస్‌లతో పాటు హైదరాబాద్‌కు అదనంగా రెండు సర్వీస్‌లను ఎయిర్‌లైన్స్ సంస్థలు నడపనున్నాయి. రెండు నెలలుగా వైజాగ్‌కు విమాన సర్వీస్‌లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో స్పైస్‌జెట్, ఎయిరిండియా అనుబంధ సంస్థ అలయెన్స్ ఎయిర్ ముందుకువచ్చాయి.
అలయెన్స్ ఎయిర్ అక్టోబర్ ఒకటి నుంచి హైదరాబాద్ నుంచి వయా విజయవాడ మీదుగా వైజాగ్‌కు సర్వీస్‌లు నడపనుంది. 70 సీట్ల సామర్థ్యం కలిగిన విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి 7.30కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 25 నిమిషాల విరామం తరువాత 7.55 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 8.55కు వైజాగ్‌కు చేరుకుని, తిరిగి అక్కడి నుంచి 9.20కు బయలుదేరి పది గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. 45 నిమిషాల విరామం తర్వాత రాత్రి 10.45కు ఇక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
స్పైస్ జెట్ వైజాగ్ సర్వీస్..
స్పైస్‌జెట్ సంస్థ అక్టోబర్ 27 నుంచి విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సర్వీస్‌లను ప్రారంభించనుంది. 78 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానం వైజాగ్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9.50 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.50కు వైజాగ్‌కు చేరుకుంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్‌కు ఇండిగో నాలుగో సర్వీస్..
ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇండిగో విమాన సంస్థ అక్టోబరు 27 నుంచి హైదరాబాద్– విజయవాడ మధ్య అదనంగా మరో విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రోజుకు మూడు విమాన సర్వీస్‌లను ఆ సంస్థ విజయవంతంగా నడుపుతోంది. నాలుగో సర్వీస్ కింద అక్టోబరు 27 నుంచి 74 సీట్ల సామర్థ్యం కలిగిన ఏటీఆర్ విమానం హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.35కు బయలుదేరి 7.35కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. తిరిగి రాత్రి 7.55కు ఇక్కడి నుంచి బయలుదేరి 21.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. ఇటీవల రద్దయిన న్యూఢిల్లీ సర్వీస్‌ను కూడా పునరుద్ధరించే దిశగా ఇండిగో సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment