న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శీతాకాల షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తన విమాన సర్వీసులను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల నుంచి వారానికి 173 విమాన సర్వీసులు నడుస్తుండగా, 250కు (45 శాతం అధికం) పెంచుతున్నట్టు తెలిపింది.
విశాఖపట్నం, విజయవాడ, గ్వాలియర్‌తో హైదరాబాద్‌కు నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసులు పెరగనున్నట్టు ప్రకటించింది. సర్వీసుల పెంపు ఈ ప్రాంతాల వారికి సౌలభ్యంగా ఉంటుందని ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ పేర్కొన్నారు. ప్రతి వారం 200 సర్వీసులతో తమ నెట్ వర్క్‌లో హైదరాబాద్ మూడో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు చెప్పారు.
హైదరాబాద్ నుంచి నేరుగా 17 దేశీయ విమానాశ్రయాలకు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు సర్వీసులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఒక్కటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి ప్రతి వారం 28 విమాన సర్వీసులను దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ శీతాకాల సీజన్‌లో ఎయిర్ ఇండియా 400 రోజువారీ విమాన సర్వీసులు నిర్వహించనున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే సీజన్‌లో 325 రోజువారీ సర్వీసులు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment