ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు.
ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్‌లైన్‌లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్‌ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది.
అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్‌లైన్‌లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment