టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.
నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.
ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!
రూ.2,058.50 కోట్ల డీల్
పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment