
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా విస్తరించిన రన్‌వే పై గురువారం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ఎయిర్‌బస్ ఎ320 ఉదయం 7.15 గంటలకు ఈ రన్‌వే పై తొలిసారిగా ల్యాండ్ అయ్యింది. అనంతరం అన్ని విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను నూతన రన్‌వే పైనే నిర్వహించారు. విస్తరణ వల్ల 3,360 మీటర్ల రన్‌వే అందుబాటులోకి వచ్చిందని.. భారీ విమానాల రాకపోకలకు అడ్డంకులు తొలిగాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల నిర్వహణకు మార్గం సుగమమైందని చెప్పారు. అలాగే విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన అధునాతన డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్నీ రేంజ్(డీవీవోఆర్) సిస్టమ్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రారంభించారు. విమాన ప్రయాణ మార్గం, స్టేషన్ నుంచి అప్రోచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గాలను సమర్థంగా నిర్వహించడానికి డీవీవోఆర్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.