గన్నవరం: సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ పస్ట్‌వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.
అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్‌పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం
ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్‌ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి.
ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్ ఆల్ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు.
అంతేగాకుండా గల్ఫ్‌లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్‌లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్‌ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అక్టోబర్ 31 నుంచి షార్జా–విజయవాడ విమానం
Published Mon, Aug 29 2022 5:22 AM | Last Updated on Mon, Aug 29 2022 2:29 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment