sharja
-
అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు..!
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్ గేమ్‌లో అర్జున్ 45 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫారిల్ (అజర్బైజాన్)పై గెలిచాడు.రెండో రౌండ్ గేమ్‌లో అర్జున్ 28 ఎత్తుల్లో నికోలస్ (గ్రీస్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ తొలి గేమ్‌లో 28 ఎత్తుల్లో అభినవ్ మిశ్రా (అమెరికా) చేతిలో ఓడిపోయి... లియోన్ మెండోకా (భారత్)తో జరిగిన రెండో గేమ్‌ను 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.ఇవి చదవండి: Virat Kohli: ఒక్కసారి క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట! -
గుండెపోటుతో విమానంలో ప్రయాణికుడు మృతి
సాక్షి, గన్నవరం: షార్జా నుంచి విజయవాడ వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. విమానాశ్రయ వర్గాల సమాచారం మేరకు... ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు(85) కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బంధువుల వివాహ కార్యక్రమం నిమిత్తం సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి షార్జా నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)కు బయలు దేరారు. విమానం మరో అరగంటలో ఎయిర్‌పోర్టుకు చేరనుందనగా నూకరాజుకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. విమానంలోని సిబ్బంది ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పైలెట్ల సమాచారం మేరకు విమానం ల్యాండ్ అయిన వెంటనే నూకరాజును ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. విమానాశ్రయంలో నూకరాజును పరీక్షించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం నిడదవోలుకు తీసుకువెళ్లారు. ఈ విమానంలో మృతుడి కుమారుడు, భార్యతో పాటు మరో ఏడుగురు బంధువులు ఉన్నారు. (చదవండి: YSRCP: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
అక్టోబర్ 31 నుంచి షార్జా–విజయవాడ విమానం
గన్నవరం: సుమారు మూడున్నరేళ్ల తర్వాత విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ పస్ట్‌వేవ్ తర్వాత నుంచి ఇప్పటివరకు వందేభారత్ మిషన్‌లో భాగంగానే ఇక్కడికి సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లోని షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు డైరెక్ట్ విమాన సర్వీస్‌లు నడిపేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ముందుకొచ్చింది. షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు టికెట్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రతి సోమ, శనివారాల్లో షార్జా–విజయవాడ మధ్య ఈ సర్వీస్‌లు నడవనున్నాయి. 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 737–800 విమానం భారతీయ కాలమానం ప్రకారం షార్జాలో మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.35 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.35 గంటలకు ఇక్కడ బయలుదేరి రాత్రి 10.35 గంటలకు షార్జా చేరుకుంటుంది. ఇక్కడి నుంచి షార్జాకు ప్రారంభ టికెట్ ధరను రూ.15,069గా నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభమైతే ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరగవచ్చని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ ప్రయాణానికి ఊతం ఈ విమానాశ్రయానికి 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. 2019లో ఆరునెలల పాటు విజయవాడ–సింగపూర్ మధ్య నడిచిన వారానికి ఒక సర్వీస్ సాంకేతిక కారణాలతో రద్దయింది. తర్వాత దుబాయ్, సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిపేందుకు జరిగిన ప్రయత్నాలు కోవిడ్ పరిస్థితులతో నిలిచిపోయాయి. కేవలం వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇక్కడి నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు వారానికి ఒక సర్వీస్, షార్జా, కువైట్, మస్కట్ల నుంచి వారానికి ఐదు సర్వీస్‌లు ఇక్కడికి నడుస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై కేంద్రం నిషేధం ఎత్తేయడంతో ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో విదేశాలకు సర్వీస్‌లు నడిపేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. షార్జా–విజయవాడ మధ్య పూర్తిస్థాయి విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానుండడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వీస్ వల్ల యూఏఈలోని షార్జాతో పాటు దుబాయ్, అబుదాబి, అజ్మన్, పుజిరా, రస్ ఆల్ ఖైమా నుంచి ఇక్కడికి సులభంగా రాకపోకలు సాగించొచ్చు. అంతేగాకుండా గల్ఫ్‌లోని పలు దేశాలకు వెళ్లేందుకు షార్జా నుంచి సులభమైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. భవిష్యత్‌లో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా దుబాయ్, కువైట్ల నుంచి ఇక్కడికి పూర్తిస్థాయిలో సర్వీస్‌లు నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
-
అత్యవసర మళ్లింపు.. ఫలితం లేకపోయింది: ఇండిగో
న్యూఢిల్లీ: షార్జా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో ఎయిర్‌లైన్ విమానాన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం కరాచీకి మళ్లీంచారు. ఫైట్ 6E 1412 మంగళవారం షార్జా నుంచి లక్కోకు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్ అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం ప్లైట్‌ను కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు ఎయిర్‌పోర్టు వైద్యులు ధృవీకరించారని ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడిచింది. అయితే ప్యాసింజర్ వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
దుబాయ్‌లో నిజామాబాద్ వాసి అరెస్ట్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన తాళ్ల ప్రభాకర్ అనే వలస కూలీని షార్జా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కరోనా ప్రభావంతో ప్రభాకర్ పని చేస్తున్న కంపెనీలో వేతనాలు లేక కనీసం భోజనం సైతం లేక బయట మరో చోట పనులు చేసుకుంటున్నాడు. అయితే పాస్ పోర్టు, కంపెనీ వీసాలో సరైన వివరాలు చెప్పకుండా బయట తిరుగుతున్నాడనే అభియోగాలపై షార్జా పోలీసలు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు గల్ఫ్ వెల్ఫేర్ కల్చరల్ అధ్యక్షుడు పాట్కూరి బసంత్ రెడ్డిని కలిసి ప్రభాకర్‌ను విడిపించాలని కోరారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభాకర్‌ను విడిపించి తమ స్వగ్రామానికి చేరేలా చూడాలని బసంత్‌రెడ్డిని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. -
పరుగు పరుగున ప్లే ఆఫ్స్‌కు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించి చూపించింది. 10 రోజుల క్రితం 127 పరుగులు కూడా ఛేదించలేక చేతులెత్తేసి ముందంజ వేసే అవకాశాలు చేజార్చుకున్నట్లు కనిపించిన ఆ జట్టు... ఇప్పుడు మరొక జట్టు సహకారం లేకుండా... రన్‌రేట్ లెక్కల అవసరం రాకుండా... తమ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలో వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ముందంజ వేయాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బృందం అన్ని రంగాల్లో చెలరేగింది. టాప్‌లో దూసుకుపోయిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిలువరించిన హైదరాబాద్... ఆ తర్వాత వార్నర్, సాహాల మెరుపు బ్యాటింగ్‌తో 17 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ముంబై గెలుపుపై ఆశలు పెంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... చివరి లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. 2016 నుంచి ప్రతీ ఏటా హైదరాబాద్ టాప్–4లో నిలవడం విశేషం. షార్జా: మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్–2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాబాజ్ నదీమ్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు. శుక్రవారం జరిగే ఎలిమినేటర్‌లో బెంగళూరుతో సన్‌రైజర్స్ తలపడుతుంది. పొలార్డ్ మెరుపులు... ఛేదనలో కాకుండా తొలుత బ్యాటింగ్ చేస్తూ ముంబై ఈ సీజన్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (4) ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు డికాక్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొంత జోరు కనబర్చాడు. అయితే సందీప్ ఓవర్లో వరుసగా 4, 6, 6 కొట్టిన డికాక్, తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన సూర్యకుమార్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. సూర్యతో పాటు కృనాల్ పాండ్యా (0)ను ఒకే ఓవర్లో నదీమ్ అవుట్ చేయగా, రషీద్ బౌలింగ్‌లో సౌరభ్ తివారి (1) వెనుదిరిగాడు. అనంతరం దూకుడుగా ఆడబోయిన ఇషాన్‌ను సందీప్ వెనక్కి పంపించాడు. ఈ దశలో పొలార్డ్ బ్యాటింగ్ ముంబైని మెరుగైన స్థితికి చేర్చింది. రషీద్ బౌలింగ్‌లో ఆరు పరుగుల వద్ద ఎల్బీ అయినట్లు రివ్యూలో స్పష్టంగా కనిపిస్తున్నా... ‘అంపైర్స్ కాల్’తో బతికిపోయిన అతను చెలరేగిపోయాడు. నటరాజన్ ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన అతను, అదే బౌలర్ తర్వాతి ఓవర్లో 6, 6, 6 బాదాడు. ఈ క్రమంలో మరో రెండు సార్లు రివ్యూలు పొలార్డ్‌కు అనుకూలంగా రావడం విశేషం. చివరి ఓవర్లో మరో సిక్స్ తర్వాత హోల్డర్ అతడిని బౌల్డ్ చేశాడు. అలవోకగా... లక్ష్య ఛేదనలో వార్నర్, సాహా ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. బుమ్రా, బౌల్ట్ లేని ముంబై బౌలింగ్ బలగం వీరిద్దరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. అలవోకగా, చూడచక్కటి షాట్లతో రైజర్స్ ఓపెనర్లు చెలరేగారు. కూల్టర్‌నైల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన సాహా, ధావల్ వేసిన మరుసటి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత వార్నర్ తన వంతుగా ప్యాటిన్సన్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 56 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్ జోరు తగ్గించలేదు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ముందుగా వార్నర్ (35 బంతుల్లో), ఆ తర్వాత సాహా (34 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోగా, అదే ఓవర్లో భాగస్వామ్యం 100 పరుగులు దాటింది. ఆ తర్వాత లక్ష్యంవైపు హైదరాబాద్ మరింత వేగంగా దూసుకెళ్లింది. ముంబై బౌలర్లు పేలవ ప్రదర్శనతో ఒక్క వికెట్ తీయలేకపోయారు. ► 6- వార్నర్ తాను ఆడిన ఆరు వరుస ఐపీఎల్‌లలో (2014నుంచి) కనీసం 500కు పైగా పరుగులు సాధించాడు. కోహ్లిని (5 సార్లు) అతను అధిగమించాడు. 2018లో వార్నర్ ఐపీఎల్ ఆడలేదు. ► 2- ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇది రెండోసారి. 2016లో గుజరాత్ లయన్స్‌పై తొలిసారి ఈ ఘనత సాధించిన హైదరాబాద్ ఆ ఏడాది ఐపీఎల్ చాంపియన్‌గా నిలువడం విశేషం. ► 3- చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడటంద్వారా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయడం ముంబై ఇండియన్స్కిది (2010, 2019, 2020) మూడోసారి కావడం గమనార్హం. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) వార్నర్ (బి) సందీప్ 4; డికాక్ (బి) సందీప్ 25; సూర్యకుమార్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 36; ఇషాన్ కిషన్ (బి) సందీప్ 33; కృనాల్ (సి) విలియమ్సన్ (బి) నదీమ్ 0; సౌరభ్ తివారి (సి) సాహా (బి) రషీద్ 1; పొలార్డ్ (బి) హోల్డర్ 41; కూల్టర్‌నైల్ (సి) గార్గ్ (బి) హోల్డర్ 1; ప్యాటిన్సన్ (నాటౌట్) 4; ధావల్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–12; 2–39; 3–81; 4–81; 5–82; 6–115; 7–116; 8–145. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–34–3; హోల్డర్ 4–0–25–2; నదీమ్ 4–0–19–2; నటరాజన్ 4–0–38–0; రషీద్ 4–0–32–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (నాటౌట్) 85; సాహా (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 151. బౌలింగ్: ధావల్ కులకర్ణి 3–0–22–0; కూల్టర్‌నైల్ 4–0–27–0; ప్యాటిన్సన్ 3–0–29–0; రాహుల్ చహర్ 4–0–36–0; కృనాల్ 3.1–0–37–0. -
శాంసన్ విధ్వంసం : ఎంపీల మధ్య వార్
ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన టీ-20 మజాను అందించింది. తొలుత బౌండరీల బాదుడుతో కింగ్స్ రెచ్చిపోతే.. ఆ తరువాత తామేమీ తక్కువ కాదంటూ రాయల్స్ సిక్సర్ల మోత మోగించారు. రాజస్తాన్ రాయల్స్ అసాధారణ బ్యాంటింగ్‌తో పంజాబ్ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ఆర్ఆర్ ఆటగాళ్లతో సంజూ శాంసన్‌తో పాటు రాహుల్ తేవటియా సంచలన ఇన్నింగ్స్‌తో కింగ్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ పలువురు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌పై ఇద్దరు ఎంపీల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ మొదలైంది. (ఆ పని చేయలేకపోయాను: తెవాతియా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (కేరళ) ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. సూపర్బ్ షాట్స్‌తో ఆకట్టుకున్నావ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘శాంసన్ చాలా చక్కటి ఆటగాడు. సంజూ 14 ఏళ్ల వయసులోనే అతని ఆటచూశాను. అప్పుడే అనుకున్న ఇండియా టీంలోకి మరో ధోనీ రానుబోతున్నాడని. వరుస రెండు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లతో తనేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు’ అంటూ థరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. (ఆఖరి ఓవర్లలో... ఆరేశారు) థరూర్ కామెంట్‌పై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. శాంసన్‌ను వేరొకరిలా (ధోనీ) పొల్చాల్సిన అవసరం లేదు, అతనిలానే టీమిండియాలో గుర్తింపు పొందుతాడు అంటూ కౌంటర్ వేశాడు. సంజూని ధోనీతో పోల్చడం సరైనది కాదని ఎంపీ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీరిద్దరి సంభాషణపై సోషల్ మీడియాలో ఇరువురి అభిమానులు స్పందిస్తున్నారు. స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) దూకుడైన ఆటతీరుతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ మ్యాచ్ హాట్ టాపిక్‌గా మారింది. -
మాకు దిక్కెవరు..!
మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో భవన నిర్మాణ రంగానికి చెందిన ఏఓజీఎం కంపెనీ యజమాని కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ కంపెనీ నిర్వహణ లోపం కార్మికుల పాలిట శాపంగా మారింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్ల నుంచి షార్జాలో భవన, ఇతర నిర్మాణాల కాంట్రాక్టులను నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన 14 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఇద్దరు, చెన్నైకి చెందిన మరో కార్మికుడు పనిచేస్తున్నాడు. కార్మికులకు యజమాని ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు. ఒక్కొక్కరికి రూ.1.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికులకు కంపెనీ నిర్వాహకులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు మంజూరైనా.. కాకపోయినా కార్మికులకు మాత్రం వేతనాలను సక్రమంగా చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. అయితే, ఆ కంపెనీ యజమాని ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు తమకు రావాల్సిన వేతనాల కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. లేబర్ కోర్టుకు.. వేతన బకాయిల కోసం కార్మికులు షార్జాలోని లేబర్ కోర్టును ఆశ్రయించగా కోర్టు.. కంపెనీ యజమానికి నోటీసులు జారీచేసింది. అక్కడే ఉంటే తాను జైలుపాలు కావాల్సి వస్తుందని గ్రహించిన కంపెనీ యజమాని తన స్వస్థలమైన కేరళకు వెళ్లిపోయాడు. కార్మికులు మాత్రం క్యాంపులోనే ఉండిపోయారు. షార్జాలోని క్యాంపులో కార్మికులతో మాట్లాడుతున్నగుండెల్లి నర్సింహ విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా నిలిపివేత.. క్యాంపులో ఉంటున్న కార్మికులు దుర్భర జీవనం గడుపుతున్నారు. కంపెనీ యజమాని క్యాంపు కోసం తీసుకున్న భవనానికి అద్దె చెల్లించడానికి ఇచ్చిన చెక్కులతో పాటు గ్యాస్, విద్యుత్, నీటి బిల్లుల కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. కార్మికులను సైట్ వద్దకు తీసుకెళ్లే బస్సులకు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ నిర్వాహకులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. దీంతో క్యాంపు కొనసాగుతున్న భవనానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్, ఫిల్టర్ నీటి సరఫరా సైతం నిలిచిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే ఉంటున్నారు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేసుకుంటున్నారు. ఫిల్టర్ నీటి సరఫరా లేక పోవడంతో ఉప్పు నీటిని తాగాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కాన్సులేట్‌లో ఫిర్యాదు.. కంపెనీ యజమాని నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా నిలిచిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు నర్సింహ ఇండియా కాన్సులేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విదేశాంగ శాఖ అధికారులు కేసును నమోదు చేశారు. కార్మికులకు వేతనాలు అందకపోవడంతో వారి వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో ఎన్ఆర్ఐ సెల్ ద్వారా విమాన టిక్కెట్లు ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి టికెట్లు అందకపోతే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా టిక్కెట్లను ఇప్పించడానికి కృషిచేస్తామని జీడబ్ల్యూపీసీ అధ్యక్షుడు నర్సింహ ‘సాక్షి’కి వివరించారు. కార్మికులకు అండగా జీడబ్ల్యూపీసీ.. షార్జాలో అవస్థలు పడుతున్న కార్మికులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి(జీడబ్ల్యూపీసీ) అండగా నిలిచింది. ఆరు నెలలుగా వేతనాలు అందక.. క్యాంపులో సరైన సౌకర్యాలు లేక తిప్పలు పడుతున్న కార్మికులను గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండెల్లి నర్సింహ షార్జాలో కలుసుకున్నారు. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో కార్మికుల పాస్‌పోర్టులు అతని వద్దనే ఉండిపోయాయి. అయితే నర్సింహ.. కంపెనీ యజమానితో ఫోన్లో మాట్లాడి పాస్‌పోర్టులు కార్మికులకు వాపసు చేయాలని సూచించారు. కంపెనీ క్యాంపులో మొత్తం 17 మంది కార్మికులు ఉండిపోగా అందులో ఇద్దరికి వీసాలను రెన్యూవల్ చేయలేదు. దీనికి సంబంధించి జరిమానా చెల్లించి కార్మికులను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మిగిలిన కార్మికులకు వారి పాస్‌పోర్టులను ఇప్పించి సొంతూళ్లకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేతన బకాయిలు ఇప్పించండి మాకు ఆరు నెలల వేతనం అందాల్సి ఉంది. కంపెనీపై లేబర్ కోర్టులో కేసు వేశాం. ఎలాగైనా వేతన బకాయిలు ఇప్పించాలి. ఆరు నెలల వేతనం యజమాని వద్దనే ఉండిపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. విదే శాంగ శాఖ చొరవ తీసుకుని వేతనం ఇప్పించాలి. కంపెనీ యజమాని కేరళకు వెళ్లిపోవడంతో మమ్మల్ని పట్టించుకునే వారు లేరు.– ముత్తెన్న, ఇస్సాపల్లి, నిజామాబాద్ జిల్లా ఎంతో ఇబ్బంది పడుతున్నాం.. క్యాంపులో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నరకంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదేమో. కంపెనీ యజమాని మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. మేము మాత్రం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఎలాగైనా ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేయాలి. – లస్మన్న, గొల్లమడ, నిర్మల్ జిల్లా ఇంటికి రావడానికిడబ్బులు లేవు.. ఆరు నెలల నుంచి వేతనం ఇవ్వకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వమే దయ ఉంచి విమాన టిక్కెట్లు ఇవ్వాలి. కనీసం ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవు. మా పరిస్థితి దయనీయంగా ఉంది. – విఠల్, గొల్లమడ,నిర్మల్ జిల్లా మానవతా దృక్పథంతో ఆదుకోవాలి షార్జాలోని కంపెనీ క్యాం పులో ఉన్న మమ్మల్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కంపెనీ యజమాని ఏమీ చెప్పకుండా కేరళకు వెళ్లిపోయాడు. మేము మాత్రం అనాథల్లా కంపెనీ క్యాంపులోనే ఉండిపోయాం. మాకు దేవుడే దిక్కు. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. మమ్మల్ని ఇంటికి పంపించడానికి చర్యలు తీసుకోవాలి.– ఎల్లేష్, గుండారం, కామారెడ్డి జిల్లా ఏం చేయాలో అర్థం కావడం లేదు కొన్ని రోజుల నుంచి క్యాంపుకే పరిమితమైన మాకు ఏమిచేయాలో అర్థం కావడం లేదు. మా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. వేతనాలు లేవు. క్యాంపులో కనీస సౌకర్యాలు లేవు. రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతోంది. కంపెనీ యజమాని కేరళ నుంచి షార్జాకు వస్తాడనే నమ్మకం లేదు.– సంపంగి మహేష్, అమతాపూర్, డిచ్పల్లి మమ్మల్ని ఇంటికి చేర్పించండి షార్జా నుంచి మమ్మల్ని ఎలాగైనా ఇంటికి చేర్పించండి. మా పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. కనీసం మా పాస్‌పోర్టులు కూడా ఇవ్వలేదు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడితే పాస్‌పోర్టులు పంపిస్తానని చెబుతున్నాడు. పాస్‌పోర్టులతో పాటు టిక్కెట్లను ఇప్పిస్తేనే ఇంటికి చేరుకోగలుగుతాం.– జోగు ఊషన్న,జీజీ నడ్కుడ, నిజామాబాద్ జిల్లా -
ఆదుకునేవారేరీ..
బొమ్మెన భూమేశ్వర్, బాల్కొండ : ఉపాధి కోసం షార్జా వెళ్లిన ఆ వ్యక్తి తోటి కార్మికునితో జరిగిన ఘర్షణలో చనిపోవడంతో అతని కుటుంబం దిక్కులేనిదైంది. అతని భార్య పెద్ద దిక్కును కోల్పోయి బాధను దిగమింగుకుంటూనే కుటుంబ భారాన్ని మోసింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌కు చెందిన గోవర్దన్, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట్‌కు చెందిన ధరూరి బుచ్చన్న ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒకే గదిలో నివాసం ఉండేవారు. 2001లో నివాస గదిలో ఇద్దరి మధ్య క్షణికావేశంలో జరిగిన ఘర్షణలో గోవర్దన్ మరణించాడు. గోవర్దన్ మరణానికి బుచ్చన్నను కారకునిగా గుర్తించిన షార్జా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరుచగా అతనికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. బుచ్చన్న 18 ఏళ్ల నుంచి షార్జా జైలులోనే మగ్గిపోతున్నాడు. కడసారి చూపు కూడా దక్కలేదు.. షార్జాలో మరణించిన గోవర్దన్ మృతదేహాన్ని ఆర్థిక, సాంకేతిక కారణాలతో భారత్‌కు పంపలేదు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులు కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. గోవర్దన్‌పై ఆధారపడిన భార్య రాధ, కొడుకు నవీన్, కూతురు రవళిలు పెద్ద దిక్కును కోల్పోయారు. రాధ బీడీలు చుడుతూనే తన పిల్లలను పోషించింది. తన రెక్కల కష్టంతో కూతురును, కొడుకును చదివించి పెంచి పెద్ద చేసింది. వారి పెళ్లిళ్లను జరిపించి తన బాధ్యతను నెరవేర్చుకున్న ఆమె.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్ద మనసుతో క్షమాభిక్ష.. షార్జా జైలులో మగ్గుతున్న బుచ్చన్న కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. షరియా చట్టం ప్రకారం మృతుని కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే బుచ్చన్న షార్జా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బుచ్చన్న సోదరులు లక్ష్మణ్, లింగన్న, మేనల్లుడు రాజేష్ ఇటీవల ముప్కాల్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దల సమక్షంలో గోవర్దన్ కుటుంబ సభ్యులను కలిసి క్షమాబిక్ష కోసం ప్రాధేయపడ్డారు. పెద్దమనసు చేసుకుని బుచ్చన్నకు క్షమాబిక్ష లేఖ ఇచ్చి, శిక్ష రద్దుకు సహకరించాలని వేడుకోగా.. ఎట్టకేలకు గోవర్దన్ భార్య రాధ ఒప్పుకుంది. పరిహారం కోసం ప్రయత్నాలు.. క్షమాభిక్ష లేఖతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు జైల్లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు కొంత పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బును షార్జా న్యాయస్థానంలో జమచేయడం గానీ, బాధిత కుటుంబ సభ్యులకు నేరుగా గానీ ఇవ్వాలి. అయితే, బుచ్చన్న కుటుంబ సభ్యులకు అంత ఆర్థిక స్థోమతలేదు. విరాళాలు సేకరించి గోవర్దన్ కుటుంబానికి చెల్లించి బుచ్చన్నను విడిపించడానికి కొన్ని దళిత సంఘాలు, కొందరు ప్రవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వలసదారుల హక్కుల మండలి అధ్యక్షుడు పి.నారాయణ స్వామి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం 2011 డిసెంబర్లో షార్జా జైలును సందర్శించి బుచ్చన్నను కలిసి వచ్చారు. గోవర్దన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, బుచ్చన్నను జైలు నుంచి విడుదల చేయాలని నారాయణ స్వామి గతంలో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. -
విదేశీ పనిమనిషికి షార్జాలో ఉరిశిక్ష
షార్జా: తొమ్మిది నెలల పసిపాపను కొట్టి, ఆ పాప చావుకు కారణమైన ఇండోనేషియా దేశానికి చెందిన మహిళకు షార్జా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. షార్జాలోని ఓ ఇంట్లో పనిమనిషిగా చేరిన మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో తన యాజమాని తొమ్మిదినెలల పాపను తీవ్రంగా కొట్టింది. అమానుషంగా క్రికెట్ బ్యాట్‌తో చావాబాది, ఎత్తి నేలపై పడేసింది. దాంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు పాపను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పాప కోమాలోకి వెళ్లిందని వైద్యులు నిర్ధారించారు. పాప తల్లిదండ్రులు ఇంటి పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెకు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప రెండు వారాల అనంతరం మృతి చెందింది. షార్జా కోర్టు విచారణ జరిపి పనిమనిషిని దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. తీర్పు అనంతరం పాప తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తినిచ్చిందని, తన బిడ్డను చంపిన ఆమెకి తగిన గతే పట్టిందన్నారు. ఎన్ని చేసిన తమ పాప తిరిగి రాదని, ఇతర చిన్నారుల కోసం, వారి భద్రత కోసం దేవుడ్ని ప్రార్ధించడం తప్ప తాము ఏం చేయగలమని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. -
పోలీసులు బండి ఆపగానే...
దుబాయ్ : నడి రోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని పక్కకు తీసుకోమని పోలీసులు ఆదేశిస్తే... ఏదో తప్పు జరిగింది... ఫైన్ తప్పదని బెంబేలెత్తిపోవడం డ్రైవర్ల వంతవుతుంది. దుబాయ్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, అందుకు భిన్నంగా జరిగిన ఒక ఘటన ఒక్కసారిగా డ్రైవర్ ను ఆశ్చర్యచకితుడిని చేసింది. కేరళకు చెందిన అనిల్ కుమార్ కొన్నేళ్లుగా దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ కుమార్ కు ఎదురైన ఆ ఘటన ఏమంటే... అనిల్ కుమార్ దుబాయ్‌లో ఒక స్కూల్ బస్ డ్రైవర్. ప్రతి రోజులాగే సోమవారం కూడా యథావిధిగా పిల్లలతో బస్సులో స్కూల్‌కు బయలుదేరాడు. వెనకాల పోలీసులు ఫాలో అవుతున్నారు. బస్ స్కూల్ చేరుకున్న దశలోనే చుట్టుముట్టిన పోలీసులు బస్సు దిగాల్సిందిగా అనిల్ కుమార్‌ను ఆదేశించారు. ఏం తప్పు చేశానో అనుకుని హైరానా పడుతూనే బస్సు దిగిన అనిల్ ఎంత ఫైన్ వేస్తారోనని భయపడిపోయాడు. జరుగుతున్న సంఘటన చూడటానికి అక్కడికి జనాలు, పాఠశాల ఉద్యోగులు గుమ్మిగూడారు. ఏం జరుగుతుందో బస్ డ్రైవర్‌కి అర్థం కాలేదు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోడానికి స్కూల్ యాజమాన్యం సైతం అక్కడికి చేరుకుంది. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా... బస్సు దిగిన డ్రైవర్ ను ఒక్కసారిగా అభినందించడం ప్రారంభించారు. దుబయ్ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గడిచిన ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్కరోజూ రూల్స్ అతిక్రమించకుండా క్రమశిక్షణతో వాహనాన్ని నడిపిస్తున్నందుకు అనిల్ ను పోలీసులు అభినందించడమే కాకుండా వెయ్యి దిర్హమ్ ల నగదు ప్రోత్సాహకంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అక్కడికక్కడే సత్కరించారు. గడిచిన 6 సంత్సరాలుగా మంచి డ్రైవింగ్ గుర్తింపు తెచ్చుకున్న మరో మహిళకు, గత 40 సంవత్సరాలుగా సొంత వాహనం నడుపుకుంటూ ట్రాఫిక్ రూల్స్‌ను సక్రమంగా పాటిస్తున్న ఖలీఫా అనే వ్యక్తిని కూడా పరిచయం చేసి వారికి కూడా బహుమతి అందించి సత్కరించారు. మొత్తంగా షెల్ గోల్డ్ స్టార్ పేరుతో సురక్షిత డ్రైవింగ్ చేసిన వారిని ఈ తరహాలో నగదుతో పాటు ప్రోత్సహకాలను అందించి సత్కరించింది. -
విజిట్ వీసా పేరిట మోసం..
► షార్జాలో చిక్కుకుపోయిన బాధితులు.. ► పది రోజులుగా తిండి కూడా లేక ఇక్కట్లు ► ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆర్మూర్: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. మరో వైపు నకిలీ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి నిత్యం పదుల సంఖ్యలో నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిలీ ఏజెంట్ల కారణంగా షార్జాలోని అల్బుదినా తాసిల్లో చిక్కుకొన్న సుమారు 40 మంది యువకులు తమను కాపాడాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పలువురు నకిలీ ఏజెంట్లు సుమారు 40 మందిని విజిట్ వీసాపై షార్జాకు పంపించారు. ఫోన్ లో సాక్షితో.. అక్కడే పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలకడంతో అప్పులు చేసి ఒక్కొక్కరు రూ. 75 వేలు ఏజెంటుకు ముట్టజెప్పి షార్జాలో కష్టాలు పడుతున్నారు. కోరుట్లకు చెందిన శ్రీనివాస్, సాగర్, రాజేశ్, సత్యనారాయణ, రామకృష్ణ షార్జా నుంచి సాక్షితో ఫోన్లో మాట్లాడారు. ఏజెంట్ మోసం కారణంగా ఇక్కడ పది రోజులుగా తినడానికి కూడా తిండి దొరకక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల ద్వారా పరిచయమైన నందిపేట మండలం తల్వేదకు చెందిన సాగర్ అనే ఏజెంట్ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 75 వేలు తీసుకొని నెల రోజుల క్రితం షార్జాకు పంపిచాడని వివరించారు. తమ ఏజెంట్ సూచించిన వ్యక్తి తమను షార్జాలో రిసీవ్ చేసుకొని విజిట్ వీసాపై వచ్చిన 50 మందిని ఒకే గదిలో ఉంచారన్నారు. తిండిలేక పస్తులుంటున్నాం.. అక్కడి హోటల్స్‌లో హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూల పేరిట తమవద్ద నుంచి వెయ్యి దిర్హాంలు వసూలు చేశారన్నారు. వయస్సు నిబంధనతో తాము ఉద్యోగానికి ఎంపిక కాలేదన్నారు. అయితే స్వగ్రామంలో ఉన్న సమయంలో తమకు షార్జాలో ఉద్యోగం ఇప్పించడమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు పూర్తి ఖర్చులు, బాధ్యతలు తనవేనంటూ ఏజెంట్‌తో రాతపూర్వకంగా రాయించుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో మా విజిట్ వీసా సమయం పూర్తయిపోతుందని వాపోయారు. ఇప్పటికే ఇక్కడి పోలీసుల కంట పడకుండా భయంగా రూమ్‌లో గడుపుతున్నామన్నారు. తమను స్వగ్రామానికి తీసుకొని రావడానికి విమానం టికెట్లు పంపించాల్సిందిగా ఏజెంట్‌ను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నాడని వాపోయారు. పది రోజులుగా తిండి లేక జేబుల్లో డబ్బులు లేక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఏజెంట్ల మోసాలు తమకు తెలిసినా మంచి ఉద్యోగం దొరికితే అక్కడే పని చేసుకోవచ్చని ఆశపడ్డ మాకు నిరాశే ఎదురైందంటూ వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని తమను స్వగ్రామాలకు రప్పించేలా చూడాలని, మోసం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
షార్జాలో పాల్గొనే మహిళ జట్టుకు శిక్షణ పూర్తి
గుంటూరు స్పోర్ట్స్ : విదేశీ మహిళ క్రికెట్ జట్లు ప్రాక్టీస్ చేసేందుకు ఏసీఏ ఉమెన్స్ అకాడమీ చక్కటి వేదిక అని ఏసీఏ అకాడమీ ఉమెన్స్ వింగ్ చైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ అన్నారు. డిసెంబర్లో దుబాయిలో జరగనున్న గోల్ఫ్ కప్ క్రికెట్ టోర్నమెంట్, షార్జాలో జరగనున్న ఏషియా కప్ పోటీలలో షార్జా మహిళ క్రికెట్ జట్లు పాల్గొననుంది. అందులో భాగంగా ప్రాక్టీస్ చేసేందుకు షార్జా మహిళ జట్టు ఏసీఏ ఉమెన్స్ అకాడమికి విచ్చేసింది. ఈనెల 18 నుండి 25 తేదీ వరకు సాధనతో పాటు ఆంధ్ర మహిళ క్రికెట్ జట్టుతో ఐదు టీ–20 మ్యాచులు, రెండు 30 ఓవర్ల ఒన్డే క్రికెట్ ప్రాక్టిస్ మ్యాచ్‌లలో పాల్గొంది. గురువారం క్యాంప్ ముగింపు సందర్భంగా జేకేసీ కళాశాల ఆవరణలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమీలో షార్జా జట్టుకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్జా మహిళ జట్టు సభ్యులకు జ్ఞాపికలు అందించారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ గోల్ఫ్ కప్, ఏషియా కప్‌లో పాల్గొననున్న షార్జా జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గతంలో చైనా జాతీయ మహిళా జట్టు, థాయ్ మహిళ క్రికెట్ జట్టు, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ జట్లు అకాడమిలో సాధన చేశాయని తెలిపారు. అకాడమీ హెడ్ కోచ్ మారియా ఫాహె,కోచ్ ఎస్ శ్రీనివాసరెడ్డిలతో పాటు ఇతర సిబ్బంది షార్జా జట్టుకు పలు సూచనలు, సలహాలు అందించారని చెప్పారు. కార్యక్రమంలో షార్జా మహిళ జట్టు మేనేజర్ మన్వీ దోధీ,అసిస్టెంట్ కోచ్ సీ.కల్గుత్కర్, కెప్టెన్ హుమైరా తస్నీమ్, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ హెడ్ కోచ్ మారియా ఫాహె, కోచ్ ఎస్. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ కోచ్ డి.డేవిడ్, ట్రై నర్ కోటేశ్వరరావు, షార్జా, ఆంధ్ర మహిళ క్రికెట్ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.