విజిట్ వీసా పేరిట మోసం..
విజిట్ వీసా పేరిట మోసం..
Published Mon, May 22 2017 12:26 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
► షార్జాలో చిక్కుకుపోయిన బాధితులు..
► పది రోజులుగా తిండి కూడా లేక ఇక్కట్లు
► ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఆర్మూర్: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. మరో వైపు నకిలీ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి నిత్యం పదుల సంఖ్యలో నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిలీ ఏజెంట్ల కారణంగా షార్జాలోని అల్బుదినా తాసిల్‌లో చిక్కుకొన్న సుమారు 40 మంది యువకులు తమను కాపాడాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పలువురు నకిలీ ఏజెంట్లు సుమారు 40 మందిని విజిట్ వీసాపై షార్జాకు పంపించారు.
ఫోన్ లో సాక్షితో..
అక్కడే పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలకడంతో అప్పులు చేసి ఒక్కొక్కరు రూ. 75 వేలు ఏజెంటుకు ముట్టజెప్పి షార్జాలో కష్టాలు పడుతున్నారు. కోరుట్లకు చెందిన శ్రీనివాస్, సాగర్, రాజేశ్, సత్యనారాయణ, రామకృష్ణ షార్జా నుంచి సాక్షితో ఫోన్‌లో మాట్లాడారు. ఏజెంట్ మోసం కారణంగా ఇక్కడ పది రోజులుగా తినడానికి కూడా తిండి దొరకక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల ద్వారా పరిచయమైన నందిపేట మండలం తల్వేదకు చెందిన సాగర్ అనే ఏజెంట్ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 75 వేలు తీసుకొని నెల రోజుల క్రితం షార్జాకు పంపిచాడని వివరించారు. తమ ఏజెంట్ సూచించిన వ్యక్తి తమను షార్జాలో రిసీవ్ చేసుకొని విజిట్ వీసాపై వచ్చిన 50 మందిని ఒకే గదిలో ఉంచారన్నారు.
తిండిలేక పస్తులుంటున్నాం..
అక్కడి హోటల్స్‌లో హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూల పేరిట తమవద్ద నుంచి వెయ్యి దిర్హాంలు వసూలు చేశారన్నారు. వయస్సు నిబంధనతో తాము ఉద్యోగానికి ఎంపిక కాలేదన్నారు. అయితే స్వగ్రామంలో ఉన్న సమయంలో తమకు షార్జాలో ఉద్యోగం ఇప్పించడమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు పూర్తి ఖర్చులు, బాధ్యతలు తనవేనంటూ ఏజెంట్‌తో రాతపూర్వకంగా రాయించుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో మా విజిట్ వీసా సమయం పూర్తయిపోతుందని వాపోయారు. ఇప్పటికే ఇక్కడి పోలీసుల కంట పడకుండా భయంగా రూమ్‌లో గడుపుతున్నామన్నారు. తమను స్వగ్రామానికి తీసుకొని రావడానికి విమానం టికెట్లు పంపించాల్సిందిగా ఏజెంట్‌ను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నాడని వాపోయారు.
పది రోజులుగా తిండి లేక జేబుల్లో డబ్బులు లేక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఏజెంట్ల మోసాలు తమకు తెలిసినా మంచి ఉద్యోగం దొరికితే అక్కడే పని చేసుకోవచ్చని ఆశపడ్డ మాకు నిరాశే ఎదురైందంటూ వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని తమను స్వగ్రామాలకు రప్పించేలా చూడాలని, మోసం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement