అభినందన పత్రంతో ఖలీఫా
దుబాయ్ : నడి రోడ్డుపై వాహనాన్ని అడ్డుకుని పక్కకు తీసుకోమని పోలీసులు ఆదేశిస్తే... ఏదో తప్పు జరిగింది... ఫైన్ తప్పదని బెంబేలెత్తిపోవడం డ్రైవర్ల వంతవుతుంది. దుబాయ్ లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అయితే, అందుకు భిన్నంగా జరిగిన ఒక ఘటన ఒక్కసారిగా డ్రైవర్ ను ఆశ్చర్యచకితుడిని చేసింది. కేరళకు చెందిన అనిల్ కుమార్ కొన్నేళ్లుగా దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్ లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణ కలిగిన డ్రైవర్ గా పేరుతెచ్చుకున్న అనిల్ కుమార్ కు ఎదురైన ఆ ఘటన ఏమంటే...
అనిల్ కుమార్ దుబాయ్‌లో ఒక స్కూల్ బస్ డ్రైవర్. ప్రతి రోజులాగే సోమవారం కూడా యథావిధిగా పిల్లలతో బస్సులో స్కూల్‌కు బయలుదేరాడు. వెనకాల పోలీసులు ఫాలో అవుతున్నారు. బస్ స్కూల్ చేరుకున్న దశలోనే చుట్టుముట్టిన పోలీసులు బస్సు దిగాల్సిందిగా అనిల్ కుమార్‌ను ఆదేశించారు. ఏం తప్పు చేశానో అనుకుని హైరానా పడుతూనే బస్సు దిగిన అనిల్ ఎంత ఫైన్ వేస్తారోనని భయపడిపోయాడు. జరుగుతున్న సంఘటన చూడటానికి అక్కడికి జనాలు, పాఠశాల ఉద్యోగులు గుమ్మిగూడారు. ఏం జరుగుతుందో బస్ డ్రైవర్‌కి అర్థం కాలేదు. సమాచారం అందిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోడానికి స్కూల్ యాజమాన్యం సైతం అక్కడికి చేరుకుంది.
అయితే, అందరి అంచనాలకు భిన్నంగా... బస్సు దిగిన డ్రైవర్ ను ఒక్కసారిగా అభినందించడం ప్రారంభించారు. దుబయ్ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గడిచిన ఆరు సంవత్సరాలుగా ఏ ఒక్కరోజూ రూల్స్ అతిక్రమించకుండా క్రమశిక్షణతో వాహనాన్ని నడిపిస్తున్నందుకు అనిల్ ను పోలీసులు అభినందించడమే కాకుండా వెయ్యి దిర్హమ్ ల నగదు ప్రోత్సాహకంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇచ్చి అక్కడికక్కడే సత్కరించారు. గడిచిన 6 సంత్సరాలుగా మంచి డ్రైవింగ్ గుర్తింపు తెచ్చుకున్న మరో మహిళకు, గత 40 సంవత్సరాలుగా సొంత వాహనం నడుపుకుంటూ ట్రాఫిక్ రూల్స్‌ను సక్రమంగా పాటిస్తున్న ఖలీఫా అనే వ్యక్తిని కూడా పరిచయం చేసి వారికి కూడా బహుమతి అందించి సత్కరించారు. మొత్తంగా షెల్ గోల్డ్ స్టార్ పేరుతో సురక్షిత డ్రైవింగ్ చేసిన వారిని ఈ తరహాలో నగదుతో పాటు ప్రోత్సహకాలను అందించి సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment