విజయవాడ విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్
టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ అసహనం
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సదరు కాంట్రాక్ట్ సంస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు హెచ్చరించారు. విమానాశ్రయంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డును శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్ ఆవరణలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి మొక్కలు నాటారు.
అనంతరం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. కోవిడ్ పరిస్థితులు, వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. టెర్మినల్ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా 52 శాతం పనులనే పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 జూన్ 30 నాటికి టెర్మినల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై అవసరమైతే ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అనకాపల్లి ఎంపీ రమేష్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, సివిల్ విభాగం జనరల్ మేనేజర్ రామాచారి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇండిగో–ఢిల్లీ సర్వీస్ ప్రారంభం
తొలుత న్యూఢిల్లీ–విజయవాడ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నడపనున్న విమాన సర్వీస్ ప్రారంభ వేడుకలను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment