Iyr Krishna Rao
-
తిరుమల లడ్డూ వివాదం.. మాజీ సీఎస్ ఐవైఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ అన్నారు.మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయంతిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని.. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమని చెప్పింది. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. భూ యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన ఈ చట్టంపై చంద్రబాబు, ఆయన గ్యాంగ్ నానాయాగీ చేస్తోంది. ఇంకా అమల్లోకే రాని చట్టంపై ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల్లో ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండంతో ఏం చేయాలో తోచక సీఎం జగన్‌పై, ఆయన ప్రభుత్వంపైన దుష్ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీచమైన ప్రచారం చేస్తూ.. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది.తాజాగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వివాదంపై ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ చట్టంపై చంద్రబాబు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా ఆయన తిప్పికొట్టారు."ఈ ప్రకటనను ఇచ్చినది టీడీపీ తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ఏపీ బీజేపీ భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ జాతీయ బీజేపీ. క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు ఏపీ బీజేపీ భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?’ అని ట్వీట్ చేశారు..కాగా శుక్రవారం నాటి ఆంధ్రజ్యోతి ప్రతికలో ‘మీ భూమి మీది కాదు’ అనే నినాదంతో ఫస్ట పేజ్‌లో భారీగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు.దీనిని కృష్ణారావు షేర్ చేస్తూ.. ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి కర్త, కర్మ కేంద్రంలోని బీజేపీదేనని తెలిపారు. కేవలం అమలు చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి ప్రకటనలో ఏపీ బీజేపీని భాగస్వామ్యం చేయడాన్ని ఆయన ప్రశ్నించారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నిద్రపోతున్నారా? అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. లేదంటే ఇంకేమైనా కారణం వుందా? అని కూడా ఆయన నిలదీయడం గమనార్హం. ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా? pic.twitter.com/rxbli0ZqFm— IYRKRao , Retd IAS (@IYRKRao) May 10, 2024 -
ఇలాంటి సమయంలో కూడా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానట్లేదు: ఎమ్మెల్యే పార్థసారధి
-
‘మురుగు’ పన్ను మరిచారా బాబూ!?
సాక్షి, అమరావతి: ‘చెత్త’ పన్ను.. ‘చెత్త’ పన్ను అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. అసలు ఆ తరహా పన్నుల విధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే. ఎందుకంటే.. గ్రామాల్లో నివసించే ప్రజలు గత 20 ఏళ్లుగా మురుగు కాల్వలు వాడుతున్నందుకు పన్ను కడుతున్నారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి పన్నునే ఆయన కొత్తగా ప్రవేశపెట్టారు. అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు 2002 మార్చి 14న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. ఏపీ గ్రామ పంచాయతీ నియమావళి పేరుతో.. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలుచేస్తున్న దాంట్లో కొంత మొత్తం అదనంగా ‘యూజర్ ఛార్జెస్ ఫర్ డ్రెయినేజీ ఫెసిలిటీ’కి వసూలుచేయడానికి అప్పట్లో ఆ నోటిఫికేషన్‌ను జారీచేశారు. మురుగు కాల్వలపై యూజర్ చార్జీల వసూలుకు అప్పటివరకు అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం పలు సవరణలు కూడా చేసింది. అంతేకాదు.. గ్రామాల్లో వీధి దీపాలు, పక్కా మురుగుపారుదల సదుపాయాలు, మంచినీటి సరఫరా వంటి వసతుల కల్పన సహా స్థానికంగా కల్పించే సౌకర్యాలపై అక్కడ నివసించే ప్రజల నుంచి యూజర్ ఛార్జీలను వసూలుచేయాలని ఆ గెజిట్ నోటిఫికేషన్లోనే పేర్కొన్నారు. ఆయా సదుపాయాలు నిర్వహించడానికి అయ్యే వ్యయాన్ని, ఆ సేవలను వినియోగించుకునే అన్ని కుటుంబాలకు విభజించి యూజర్ ఛార్జీలను లెక్కగట్టాలని అందులో వివరించారు. 2014–19 మధ్య కూడా ఇలాగే.. ఇక 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనూ చంద్రబాబు సర్కారు ప్రజల నడ్డి విరిచింది. కొత్తకొత్త పన్నులు విధిస్తూ ఆదేశాలను జారీచేసింది. ఉదా.. ► ప్రమాదాల సమయంలో ఫైర్ ఇంజన్ల ద్వారా సేవలు అందిస్తున్నందుకు గాను ప్రత్యేకంగా ఫైర్ టాక్స్ వసూలుకు 2014 డిసెంబరు 3న అప్పటి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ప్రజలు ఇంటి పన్ను రూపంలో చెల్లించే మొత్తానికి అదనంగా ఒక శాతం చొప్పున ఈ ఫైర్ టాక్స్‌ను లెక్కించి వసూలుచేయాలని ఆదేశించారు. ► అలాగే.. గ్రామాల్లో వసూలుచేసే ఇంటి పన్నులో 3 శాతం చొప్పున స్పోర్ట్స్ ఫీజు (ఆటలపై పన్ను) రూపంలో లెక్కించి, స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)కు జమచేయాలంటూ 2014 నవంబరు 18న మరో జీఓను కూడా చంద్రబాబు సర్కారు జారీచేసింది. ఇలా తన హయాంలో ఎడాపెడా పన్నులను బాదేసిన చంద్రబాబు ఇప్పుడు పన్నులను విమర్శించడంపై రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
'బహుశా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ గుజరాత్లో మాత్రం కొందరు మహిళలు డీసీఎం వాహనంలో నుంచి దిగడానికి జేసీబీని ఉపయోగించారు. ఆ సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్ రీట్వీట్ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు. Inventions become useful as people start innovating . https://t.co/f3UZfRUI0n — IYRKRao , Retd IAS (@IYRKRao) February 24, 2020 -
ఈ వార్త ఎందుకో పొసగడం లేదు: ఐవైఆర్ ట్వీట్
-
వాతావరణ మార్పుల పర్యవసానం
గ్రేటా థమ్‌బర్గ్ స్వీడన్ దేశానికి చెందిన విద్యా ర్థిని. గత సంవత్సరంగా ప్రతి శుక్రవారం పర్యా వరణ పరిరక్షణే ధ్యేయం గా నిరసనలు వ్యక్తం చేస్తూ గుర్తింపు పొందింది. సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణకు జరిగిన ప్రపంచవ్యాప్త ఉద్యమంలో న్యూయార్క్ నగరంలో పాల్గొనే ఉద్దేశంతో కేవలం సూర్యరశ్మి సహాయంతో నడిచే చిన్న పడవలో ప్రయాణం చేసి అమెరికా దేశాన్ని చేరుకున్నది. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ వాయువులు వెలువడకుండా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈ సాహసానికి ఉద్య మించింది. న్యూయార్క్ నగరానికి చేరుకొని నిర సన ఉద్యమంలో పాల్గొనడమే కాక ఐక్య రాజ్యసమితి పర్యావరణ సమావేశాల్లో కూడా పాల్గొని ప్రసంగించింది. ఆవేశపూరితంగా సాగిన ఆమె ప్రసంగాలు కొంత మంది విమర్శలకు అవ కాశం ఇచ్చినా, పర్యావరణ పరిరక్షణలో ఈ విద్యార్థిని చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఒక విధంగా పర్యావరణ పరిరక్షణ అంశంపై ప్రపంచ దృష్టిని మళ్లించటంలో ఈ చిన్నారి సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి. ఇదే సమయంలో ఐస్లాండ్ దేశంలోని శాస్త్ర వేత్తలు ఆగస్టు నెలలో వాళ్ల దేశంలో కరిగిపోయిన ఓక్స్ఓకుల్ హిమనీనదానికి (గ్లేసియర్) ఒక జ్ఞాపికను ఏర్పాటు చేశారు. ‘భవిష్యత్తుకు మా లేఖ’ అనే శీర్షికతో ఏర్పాటుచేసిన ఈ జ్ఞాపికలో తమ దేశంలో కరిగిపోయిన మొదటి హిమనదం ఓక్స్ఓకుల్ అని.. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే రెండు వందల సంవత్సరాలలో ఐస్లాండ్ దేశంలో ఉన్న అన్ని హిమనీనదాలు కరిగిపోతాయని వారు పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకుని రావడానికి స్వీడన్ దేశపు విద్యార్థిని ఒకవైపు అవిరళ కృషి జరుపుతుంటే, మరొకవైపు పర్యావరణ మార్పుల వలన వచ్చే దుష్ఫలితాలను ఐస్లాండ్ దేశంలో కరిగిపోయిన హిమనీనదం మనకు తెలియజేస్తూ ఉంది. మరొకవైపు ప్రపం చంలోనే శక్తివంతమైన దేశం, పర్యావరణ సమ స్యలకు కారణభూతమైన ప్రధాన దేశం అయిన అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ పర్యావరణం అసలు సమస్యే కాదు అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు. ఇక బ్రెజిల్ దేశంలో అధ్యక్షుడు బోల్సనారో ఆధ్వర్యంలో దట్టమైన వర్షారణ్యాల విధ్వంసం కొనసాగుతోంది. పర్యా వరణ పరిరక్షణకి కొత్త అడవులను సృష్టించే బదులు దట్టమైన కీకారణ్యాలను నాశనం చేసుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలు ప్యారిస్ నగరంలో 2015లో సమా వేశమై ఒక ప్రధానమైన అంగీకారానికి రావడం జరిగింది. భూమండలంపై ఉష్ణోగ్రత స్థాయి పారిశ్రామిక యుగానికి ముందు ఉన్న ఉష్ణో గ్రత కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ లను మించి ఉండ రాదు. ఈ ఒప్పందానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ముందు ఆమోదం తెలిపాయి. కానీ 2017లో డోనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించబడిన ప్రధాన ఒప్పందానికి ఆదిలోనే విఘాతం కలిగింది. ప్యారిస్ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం పారి శ్రామిక యుగానికి పూర్వం ఉన్న ఉష్ణోగ్రతల స్థాయి కన్నా రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా ఉష్ణోగ్రతలు కట్టడి చేయాలి అంటే కేవలం భవి ష్యత్తులో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు కట్టడి చేస్తే సరిపోదు.ఒక భార తదేశపు పరిమాణం కలిగిన ప్రదేశాన్ని అరణ్యంగా మార్చి కొత్తగా చెట్లను నాటితే గాని మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేము. దీనిని బట్టే సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోగలం. ప్రత్యామ్నాయంగా బొగ్గుపులుసు వాయువును భూమి లోపలి భాగంలో బంధించడం ద్వారా కూడా ఇదే ప్రయోజనాన్ని సాధించవచ్చు కానీ ఆ సాంకేతికత ఇంకా పూర్తిగా విజయవంతమైనది కాదు. చెట్లు నాటడం ద్వారా బొగ్గుపులుసు వాయువు పరిమాణాలను వాతావరణంలో తగ్గించడం చాలా సులభమైన మార్గం. ఉన్న అడవులనే నరికేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరిగే పనిగా తోచడం లేదు.వాతావరణ కాలుష్యానికి సింహ భాగం కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు తమ ఉద్గారాలు తగ్గించుకోటానికి ఇష్టపడనప్పుడు అభి వృద్ధి చెందుతున్న దేశాలను ఈ దిశగా త్యాగాలు చేయమని కోరటం హాస్యాస్పదమే అవుతుంది. అందు కనే పర్యావరణ పరిరక్షణకు జరిగే అన్ని ఒడం బడికలు ఒప్పందాలు కాగితాల మీదనే మిగి లిపోతున్నాయి.ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చిన దీనికి సంబంధించిన ఖర్చు ఎవరు భరిస్తారు అనేది కూడా తేలని సమస్యగానే మిగిలిపోతుంది. వాతావరణ కాలుష్యానికి కారణభూతులైన అభి వృద్ధి చెందిన దేశాలు ఈ ఖర్చులు భరించాలి అనే ది అభివృద్ధి చెందే దేశాల సహేతుకమైన వాదన. కానీ అలా భరించటానికి అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా లేవు. ఈ సమస్య ప్రభుత్వాల మధ్య ఒప్పందాల ద్వారా అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందుకనే ప్రభుత్వాలకు అతీతంగా ప్రజలే ఈ అజెండాను తమదిగా భావించి ముందుకు తీసుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా జరిగిన వాతావరణ పరి రక్షణ ర్యాలీ అన్ని దేశాలలోని ప్రజలు పాల్గొ నటంతో చాలా విజయవంతంగా ముగిసింది. ప్రకృతి పరిరక్షణ, తృప్తికరౖమైన సాధారణ జీవన విధానంకు అనుగుణంగా పారిశ్రామికీకరణతో కూ డిన ఆధునిక యుగం రాకముందు మానవ జీవన విధానం సాగేది. పర్యావరణ రక్షణకు అదే శ్రీరామరక్ష. కానీ అభివృద్ధి చెందిన దేశాలు తమ సదుపాయాలు వదులుకొని ఈ అంశంలో మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా లేని నాడు వాతావరణంలో జరిగే మార్పులు మానవాళికి పెద్ద ఎత్తున హాని కలిగించే ప్రమాదం పొంచి ఉన్నది. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అర్థవంతమైన చర్చతోనే అసలైన రాజధాని
ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. స్థల అనుకూలతను పరిగణలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం మోసపూరితంగా తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈమధ్య కృష్ణానదిలో వచ్చిన వరదల తర్వాత రాజధాని ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం సరి అయినదా కాదా అనే అంశంపై చర్చ మొదలైంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకన్నా పెద్ద వరద రాదనే నమ్మకం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావాన్ని పట్టి ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య వచ్చిన వరదలలో అధికంగా 9 లక్షల క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలారు. 2009లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవహించింది. ఇక మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రస్తు్తతం బీజేపీ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకటేష్ రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. సాధారణంగా రాయలసీమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటారు. రాజధాని స్థల ఎంపికను గురించి నా పుస్తకం ‘ఎవరి రాజధాని అమరావతి‘ లో విపులంగా చర్చించా. అందులో ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను. ‘ముందుగా అనుకూలతను అధ్యయనం చేయకుండానే సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ఏకైక ప్రాంతంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది‘. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఒక మహా నగర నిర్మాణ ప్రయత్నం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెపుతూ రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన మార్గమని సూచించింది. ఈ సిఫార్సులను పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఆనాటి పురపాలక శాఖామాత్యులు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల కమిటీ ఎటువంటి సిఫార్సులు ఇవ్వలేదు. ఈ రకంగా స్థల అనుకూలతను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. స్థల నిర్ధారణ సమయంలో ఆ ప్రాంతం భూకంపాల ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి ఇస్లామాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఎంపికకు కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగి వివిధ ప్రాంతాల మధ్య రాజీ మార్గంగా ఏకాభిప్రాయంతో ఆనాడు రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్చ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం లేకుండా వ్యూహాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని ముందు అనుకున్న విధంగా కృష్ణా నది తీర ప్రాంతంలో బాబు గారు రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. అందుకనే 52మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు రాజధాని ఎంపికలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు అని గట్టిగా భావించారు కాబట్టే అటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇదేరకమైన భావన ఉత్తరకోస్తా ప్రాంతాల్లో కూడా లేకపోలేదు. రాజధానులు వాటి నిర్మాణం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాదిం రాస్మన్ ‘క్యాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పేట్రన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీ లొకేషన్ ‘అనే పుస్తకం రాశారు. దానిలో ఆయన రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో తమకు ఉనికి ఉందని వారు భావిస్తున్నారా? రాజధాని నుంచి వచ్చే ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు లభిస్తున్నాయా? అనేవి ముఖ్యమైన అంశాలని ఈ నిష్పాక్షికత అందరినీ కలుపుకుపోవడం అన్నదే ప్రభుత్వానికి న్యాయసమ్మతం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైఅంశాలలో వేటినీ అమరావతి స్థల సమీకరణలో పాటించలేదనేది తేటతెల్లమవుతుంది. విజయవంతంగా నిర్వహించబడుతున్న రాజధానుల విషయంలో స్థల ఎంపిక విషయంలో ఎటువంటి ప్రక్రియను అనుసరించారో పరిశీలిద్దాం. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రే లియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. ఈ దేశాలలో ఏర్పడిన రాజధానులు కేవలం పరిపాలన రాజధానులుగానే ఉన్నాయి. ఆ దేశాలలో ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. రాజధానులుగా ఈ పట్టణాలు విజయవంతంగా నడవటానికి కారణం వీటి ఏర్పాటు వివిధ వర్గాలు ప్రాంతాల మధ్య సర్దుబాటు ఫలితంగా ఏర్పడటమే. ఇటువంటి విశాల విధానాన్ని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అనుసరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని పునఃపరిశీలించి అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రకంగా జరిగిపోయింది కాబట్టి ఈ అంశాన్ని తిరగతోడడం సరికాదు అనేవాళ్ళు వినిపించే వాదనలు వేరే ఉన్నాయి. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, నిర్ణయంలో మార్పు వల్ల వాళ్లకు నష్టం జరుగుతుందని ఒక వాదన. ప్రభుత్వ ధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ అంశాన్ని పునః పరిశీలించటం సరికాకపోవచ్చని రెండవ వాదన. ఈ రెండు వాదనలు ఇక్కడ పరిశీలిద్దాం. భూ సమీకరణ కేవలం స్వచ్ఛందంగానే ఇవ్వలేదని చాలా వరకు ప్రభుత్వం బలవంతం చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా భూ సమీకరణ పూర్తి చేసిందని ఆ రోజుల్లోనే ఈ అంశాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి రిజిస్టర్ అయినది ఎంత, రైతుల చేతిలోనే ఉన్న భూమి ఎంత, ప్రభుత్వ అవసరాలకు కానీ, వివిధ సంస్థలకుగాని కేటాయించిన భూములు ఎంత, పనులు మొదలు పెట్టిన భూములు ఎంత అనే వివరాలు వెల్లడిస్తే ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజధాని స్థల ఎంపికకు ముందు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఆ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. ఇక రెండో అంశం పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు ఇక్కడ ఇప్పటికే వెచ్చించడం జరిగింది కాబట్టి ఈ సమయంలో రాజధాని తరలింపు చర్చ అర్థరహితం అనేది కొందరి వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో నమూనాల పరిశీలన, నిర్ధారణ లోనే పుణ్యకాలం అంతా వెచ్చించింది. పెద్ద స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే జరిగాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయి లో ప్రభుత్వ నిధులు ఇప్పటికే వినియోగం అయినాయి. దానికి అను గుణంగా పూర్తయిన భవనాలు ఎన్ని? ఈ సమాచారం ఆధారంగా ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపే అవకాశం ఉంటుంది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆనాడు రాజధానికి స్థల సేకరణ సమయంలో ఈ అర్థవంతమైన చర్చ పూర్తిగా లోపిం చింది. అటువంటి చర్చ జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఎంతైనా ఉంది. ఈనాడు రాజధానిని మార్చాలి అనే ప్రతిపాదన తుగ్లక్ ప్రతిపాదనగా వర్ణించే వారికి నా సమాధానం ఒక్కటే. తుగ్లక్ కొన్ని శతాబ్దాలుగా దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని మార్చటానికి ప్రయత్నించాడు. ఈనాడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏకపక్షంగా రాజధాని ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని. దీనిని తుగ్లక్ చర్యతో పోల్చటం భావ్యం కాదు. పోల్చాలి అనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన చర్యతో పోల్చవచ్చు. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
వృద్ధి కేంద్రంగా క్రియాశీల బడ్జెట్
నిర్మలా సీతారామన్ గతవారం లోక్‌సభలో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ఆచరణ సాధ్యమైన క్రియాశీలక బడ్జెట్‌గానే చెప్పాలి. సంకీర్ణ పక్షాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రాజీమార్గంలో పాలన సాగించాల్సిన అవసరం లేకపోవడంతో 2019 బడ్జెట్లో సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వెసులుబాటు దొరికినట్లయింది. ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచడం అనే సాధారణ నమూనాకు భిన్నంగా స్థిర అభివృద్ధి విధానంపై కేంద్రం దృష్టి పెట్టింది. వృద్ధి రేటును పెంచుతూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం కూడా ముఖ్యం. అందుకే ప్రజాప్రయోజనాలకు పట్టం కడుతూనే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. భారతీయ జనతాపార్టీ 2019 ఎన్నికలలో ఇతర పార్టీల మీద ఆధార పడవలసిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీని సాధించింది. సంకీర్ణ ప్రభుత్వాలలో మిగిలిన పార్టీలతో కలసి వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూ రాజీ మార్గంలో పరిపాలన సాగించాల్సిన అవసరం ఈరోజు బీజేపీకి లేదు. వెనువెంటనే ఎన్నికలు కూడా ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2019 బడ్జెట్. సహజంగానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పరిస్థితులు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆచరణ సాధ్యమైన క్రియాశీలకమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లోని ప్రధానమైన అంశం ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం. ద్రవ్యలోటును కట్టడి చేయడం ప్రధాన అంశంగా పేర్కొంటూ ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో 3.3% ఉండేటట్టుగా రూపొందిం చారు. ఆర్థిక క్రమశిక్షణకు ఆర్థికరంగ స్థిరత్వానికి ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం ద్రవ్యలోటు స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతం కన్నా తక్కువ ఉండటం శ్రేయస్కరం. ఆ దిశగా అడుగులు వేస్తూనే ప్రస్తుత సంవత్సరానికి 3.3% ఉండేలాగా బడ్జెట్‌ను రూపొందించారు. గత సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో వృద్ధిరేటు మందగించింది కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ వృద్ధి రేటుకు ఊతమిచ్చేలాగా ఉండాలని అందుకోసం వ్యయం పెంచాల్సిన ఆవశ్యకతను పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని కొందరు ఆర్థికవేత్తలు ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపేలాగా బడ్జెట్ ఉండాలని ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచటం ద్వారా ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని వీరి అభిప్రాయం. ఈ సిద్ధాంతానికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయకుండా ఆర్థిక మంత్రి విజ్ఞతతో కూడిన స్థిర అభివృద్ధి విధానానికి ప్రాధాన్యమిచ్చారు. వృద్ధి రేటు ఎంత ముఖ్యమో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవటం అంతకన్నా ముఖ్యం. ఈ ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రధాన విజయాల్లో ఒకటి.. ధరలను అదుపులోకి తీసుకొని రావటం. వృద్ధి రేటు ప్రాధాన్యమిచ్చే విధానాన్ని అనుసరించి ప్రభుత్వం వ్యయాన్ని పెంచుకుంటూ పోతే ద్రవ్యోల్బణం నియంత్రణ లేకుండా పెరిగే అవకాశం ఉంది. దీనితో మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణకే ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేశారు. ద్రవ్యలోటును నియంత్రించటం ఎంత ముఖ్యమో ద్రవ్యలోటులో భాగంగా రెవెన్యూ లోటును తగ్గించుకోవడం కూడా అంతే ప్రధానమైన విషయం. ఈ బడ్జెట్లో మొత్తం ద్రవ్యలోటు 7 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయం ఖర్చుపెట్టడానికి కేటాయించిన మొత్తం 3లక్షల 38 వేల కోట్లు మాత్రమే. మిగిలిన అప్పులు రెవెన్యూ లోటు భర్తీకే సరిపోతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే రెవెన్యూ అకౌంట్లోని పన్నులు పన్నేతర రాబడి అయినా పెరగాలి లేదా రెవెన్యూ అకౌంట్లోని ఖర్చులైనా తగ్గాలి. కొన్ని శ్లాబులలో ప్రత్యక్ష పన్ను రేటు పెంచటం, పెట్రోలు పెట్రోల్ ఉత్పత్తులపై పెంపు ఈ రకంగా అధిక ఆదాయ వనరులను సేకరించటానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక రెవెన్యూ వ్యయం పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెవెన్యూ ఖర్చులో సబ్సిడీలు ఎక్కువగా ఉన్నాయి. ఆహార సబ్సిడీ కిందనే లక్షా 80 వేలకోట్ల దాకా ఖర్చు అవుతోంది. దాదాపు 80 వేల కోట్ల దాకా ఎరువుల సబ్సిడీ కింద ఖర్చు అవుతోంది. దాదాపు బడ్జెట్లో 9 శాతం వరకు ఈ రెండు అకౌంట్లలో రాయితీల కిందనే ఖర్చు అవుతోంది. లబ్ధిదారులకు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ రాయితీ చేరే విధంగా ప్రత్యక్ష ద్రవ్య బదిలీ విధానాన్ని అమలు చేయగలిగితే ఈ సబ్సిడీల వలన లబ్ధిదారులకు నిజమైన మేలు చేకూరుతుంది. ఈ సబ్సిడీలను అమలు చేసే విధానంలో ఉన్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. రాయితీ నేరుగా చిన్న సన్నకారు రైతులకు అందిస్తారు కాబట్టి ఎరువుల ధరలను మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించవచ్చు. ప్రభుత్వానికి సబ్సిడీలో కొంత మిగులు, రైతులకు ద్రవ్య రూపంలో ప్రత్యక్ష బట్వాడా జరుగుతున్నది కాబట్టి లాభం ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే బడ్జెట్లో ఎక్కువ భాగం సబ్సిడీల రూపంలోనే పోవటం వల్ల మూలధన వ్యయానికి నిధుల కొరత ఏర్పడుతున్నది. జాతీయోత్పత్తిలో అధిక వృద్ధి రేటు సాధించాలంటే మూలధన వ్యయం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం అమలు చేస్తున్న ఇంకొక పెద్ద పథకం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం. ఈ పథకం కింద రూ. 60 వేల కోట్లు కేటాయించారు. గ్రామ ప్రాంతాలలో అవసరం ఉన్న సామాజిక ఆస్తుల నిర్మాణానికి ఈ పథకం కింద ప్రాజెక్టులను చేపడుతున్నారు. అక్కడ ఉన్న ప్రాజెక్టులు పరిమితం కాబట్టి అవి పూర్తి కాగానే ఈ పథకం కింద దుర్వినియోగం, అవినీతి ఎక్కువ జరుగుతోంది. ఈ పథకం వల్లనే వ్యవసాయ కార్మికుల కొరత ఏర్పడుతున్నది అనే అభియోగం ఒకటున్నది. ఈ స్కీమును కూడా గ్రామీణ పేదలకు అదనపు ఆదాయం కల్పించే విధంగా మార్చి ప్రత్యక్ష నగదు బట్వాడా ద్వారా ఏ ఏ కుటుంబాలు ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్ అయి ఉన్నాయో వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు. అప్పుడు గ్రామీణ పేదల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలకు కూలీలు దొరకడం లేదనే సమస్య కూడా వుండదు. ఈ విధంగా సబ్సిడీల విషయంలోనూ కొన్ని అధిక వ్యయంతో కూడిన ప్రభుత్వ పథకాలను పూర్తిగా విశ్లేషించి అవినీతికి దుర్వినియోగానికి తావు లేకుండా లబ్ధిదారులకు ప్రత్యక్షంగా లబ్ధి పొందే విధంగాను, ప్రభుత్వానికి సబ్సిడీలు తగ్గే విధంగానూ క్రియాశీలకంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రభుత్వం చేసే ఈ భారీ వ్యయం వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి కొంత వెసులుబాటు వచ్చి అధిక మొత్తం మూలధన వ్యయం చేయటానికి వీలుంటుంది. వృద్ధి రేటు పెంచడానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల కన్నా ప్రైవేట్ పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రుణాలను ఇబ్బంది లేకుండా చేయటం కోసం రెండు ప్రత్యేక స్కీములను ప్రవేశపెట్టారు. ఈ రోజు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ప్రధాన సమస్యగా వాటి నిరర్ధక ఆస్తులు తయారైనాయి. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో 70 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం కోసంగా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు రంగానికి గృహ నిర్మాణానికి రుణాలు అందజేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈరోజు ద్రవ్య అందుబాటు సమస్య (లిక్విడిటీ)తో సతమతమవుతున్న ఎన్బిఎఫ్సి సంస్థలకు కూడా వనరులు లభించే విధంగా మరో స్కీమును బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కావలసిన వనరుల సమీకరణకు విదేశాలలో బాండ్లను జారీ చేయటానికి ప్రతిపాదించారు. దీనివలన దేశీయ రుణ మార్కెట్ మీద ఒత్తిడి తగ్గి తద్వారా వడ్డీ రేట్లు కూడా తగ్గి సులభంగా ప్రైవేట్ రంగానికి రుణాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కార్పొరేట్ టాక్స్ అంశంలో కూడా కంపెనీలకు వెసులుబాటు కల్పించడం ఆయా కంపెనీలు పెట్టుబడులు పెంచడానికి అవకాశం కల్పిస్తాయి. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి కొన్ని చర్యలను బడ్జెట్లో పొందుపరిచారు. మౌలికం కాని, లాభసాటి కాని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా అదనపు వనరులను సమీకరించే యత్నాన్ని ఈ బడ్జెట్లో కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మూడు ప్రధాన అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు అమెరికా విధిస్తున్న ఆంక్షల మూలంగా ఎన్నో పరిశ్రమలు చైనా దేశం నుంచి తరలివచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇవి భారతదేశంలో బహుళజాతి కంపెనీలను ఏర్పరిచే విధంగా కేంద్రీకృత దృష్టితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం ఈనాడు ఉపాధి కల్పన లేని వృద్ధి రేటు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా తయారైంది. పెద్ద ఎత్తున యాంత్రీకరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్ల ప్రయోగం వలన ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అధిక మూలధన వినియోగం, తక్కువ ఉపాధి కల్పన ప్రధానమైన ఆర్థిక నమూనాగా ప్రపంచంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది. ఈ విధానం జనాభా అధికంగా గల భారత చైనా లాంటి దేశాలకు మంచి పరిణామం కాదు. ఈ సమస్య ఎట్లా అధిగమించాలి అనే దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ ప్రధాన అంశం దేశంలో ప్రాంతీయ ఆర్థిక అసమానతలు. దక్షిణ, పశ్చిమ భారతం ఆర్థిక పురోగతిలో ముందంజలో ఉంది. తూర్పు, ఉత్తర భారతం బాగా వెనుకబడి ఉన్నది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై అధిక వ్యయం ద్వారా ప్రైవేట్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా తూర్పు ఉత్తర భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం ప్రభుత్వ వ్యయంతోను, ప్రోత్సాహాలతోనే జరిగే అంశం కాదు. ఆయా రాష్ట్రాలలో పరిపాలన సామర్ధ్యంలో, విధానాలలో మౌలికమైన మార్పు రావటం ఎంతైనా అవసరం. అప్పుడే పెట్టుబడులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com ఐవైఆర్ కృష్ణారావు -
సామరస్యమే సరైన పరిష్కారం
ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగనప్పుడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన రెండు ప్రాంతాల సమ్మతితో జరగలేదు. విభజన జరిగే నాటికి కే చంద్రశేఖరరావు అప్పుడే ఉద్యమ నేతగా ఉద్యమాన్ని నడిపి అధికార బాధ్యతలు చేపట్టారు. ఉద్యమ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యమానికి కారణభూతమైన అంశాలు వారి ఆలోచనలను ప్రభావితం చేయటం సహజమే. విభజన చట్టం లోపభూయిష్టంగా, అస్పష్టంగా ఉండటం కూడా విభజన అంశాల పరిష్కారంలో సమస్యలకు కారణమైంది. కాలక్రమేణా ఆవేశాలకు బదులు ఆలోచనలు ప్రధాన భూమిక పోషించే కొద్దీ సమస్యల పరిష్కారానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. సమస్యల పరిష్కారానికి కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్ మహనీయుడు పేర్కొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి నేడు ఇలాంటి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది . కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సుహృద్భావ వాతావరణమే ఈ సమస్యల పరిష్కారానికి సరైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగుల విభజన పూర్తయినట్లే! నేడు మిగిలి ఉన్న విభజన సమస్యల పరిష్కారాన్ని గురించి ఆలోచించే ముందు గత ఐదేళ్లలో ఈ అంశాల పరిష్కారంలో పురోగతిని సమీక్షించుకుందాం. ప్రప్రథమంగా పరిష్కారమైన అంశం అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వమే ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. చాలా త్వరగా మొదటి ఆరునెలల్లోనే అఖిల భారత సర్వీసు అధికారుల విభజన పూర్తయి రెండు రాష్ట్రాలకు వాళ్ళ కేటాయింపు అయిపోయింది. సరైన విధానాన్ని కమిటీ అనుసరించలేదని భావన కొందరు అధికారులకు ఉన్నా, వారు వారి రాష్ట్ర కేడర్లలో ఇమిడిపోయి పనిచేయడం ప్రారంభించారు. ఇక రెండో ప్రధాన అంశం ఉద్యోగుల విభజన. దీనికోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి కమలనాథన్ గారి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒకవైపు ప్రత్యేక తెలంగాణకు, మరొక వైపు సమైక్యాంధ్రాకు జరిగిన ఉద్యమాలలో ఉద్యోగస్తులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో విభజన అంశంలో నిర్ణయాలు కొన్ని వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉన్నందున ఉద్యోగస్తుల కేటాయింపు చాలా జటిలమైన సమస్యగా తయారైంది. కానీ కమలనాథన్ ఆధ్వర్యంలో కమిటీ చాలా ఓర్పుతో ఈ జటిలమైన సమస్యను పరిష్కరించింది. ఈరోజు కోర్టు సమస్యల దృష్ట్యా ఆగిపోయిన ఒకటి రెండు కేడర్లు తప్పితే మిగిలిన అన్ని కేడర్ల అధికారులను, ఇతర సిబ్బందిని రెండు రాష్ట్రాల మధ్య కేటాయించారు. ఇది ఒక క్లిష్ట సమస్యను విజయవంతంగా పరిష్కరించినట్లేనని చెప్పాలి. ఇక పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్ 9 షెడ్యూల్ 10కి చెందిన సంస్థలు. షెడ్యూల్ 10 సంస్థలన్నీ ప్రధానంగా శిక్షణ నైపుణ్య తర్ఫీదు కోసం ఏర్పాటు చేసిన సంస్థలు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ సంస్థలను పొందుపరిచేటప్పుడు చాలా పొరపాట్లు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘంలాంటి రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి చట్టబద్ధమైన మహిళా సంస్థల దాకా అన్నింటిని ఈ షెడ్యూల్లో పొందుపరచారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి ఈ సంస్థలకు సంబంధించిన విభజన ప్రధాన పాత్ర చోటుచేసుకుంది. దీనికి కారణం విభజన చట్టం చాలా లోపభూయిష్టంగా ఉండటమే. ఆస్తుల పంపకంలో ఇచ్చిపుచ్చుకోవచ్చు విభజన చట్టంలోని సెక్షన్ 75ను అనుసరించి ఇవి తమకే వర్తిస్తాయి కాబట్టి తెలంగాణ ఆరవ భాగంలోని ప్రకరణలకు అనుగుణంగా ఈ సంస్థలు తమవేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాదించింది. చివరకు ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఈ సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, దానిలో కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థల మూలనిధిని రెండు రాష్ట్రాల మధ్య జనాభా ప్రాతిపదికపై కేటాయిస్తూ ఆస్తులు ఈ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి అని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా లేవంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఈ అంశాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవచ్చు. ఈ సంస్థలను కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌కు నిధుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం గానీ, తెలంగాణ గానీ సమకూరిస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకొని ఆ నిధులతో ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. దీనికి అనుగుణంగా ఎక్కడి సంస్థలు ఆ రాష్ట్రంలోనే ఉండిపోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన నిధులు ఏపీకి వస్తాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇదే ఉత్తమమైన మార్గం. ఇక రెండవ ప్రధాన అంశం షెడ్యూల్ 9 సంస్థల విభజన. ఇవి అన్నీ వాణిజ్యపరమైన సంస్థలు. ఈ సంస్థల విభజనకు విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ షీలా భిడే నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 90 సంస్థల్లో 40 సంస్థలకు ఆ కమిటీ తన సిఫార్సులను అందజేసింది. మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగిన అధికారిణి షీలా భిడే. ఆ కమిటీ సిఫార్సులను రెండు రాష్ట్రాలు ఆమోదించి ఈ అంశాన్ని కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఈ వాణిజ్యపరమైన సంస్థల ప్రధాన కార్యాలయాలు విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాల మధ్య విభజితమవుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాకు వచ్చే ఆస్తులను తెలంగాణ రాష్ట్రం మార్కెట్ ధరకు తీసుకుంటే ఉత్తమం. ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అంగీకారయోగ్యం కాకపోతే పరస్పర అవగాహనతో కొన్ని భవనాలను తెలంగాణ, కొన్ని భవనాలను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన భవనాలను మార్కెట్ ధరకు అమ్ముకుని ఆ వచ్చిన నిధులతో ఈ సంస్థలను స్వరాష్ట్రంలోనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లభిస్తుంది. పరస్పర అవగాహన తప్పనిసరి ఇక చట్టంలోని లోపం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి వాయిదా వేసిన పన్నులు, వారి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున ఇక్కడే చెల్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రానికి చట్టంలోని ఈ లోపాన్ని సవరించవలసిందిగా అభ్యర్థించింది. చట్టసవరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది కనుక తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛందంగా ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయటం మంచి సంకేతాలను పంపిస్తుంది. ఇది వివాదాలకు తావు లేని అంశం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ బాకీలను తెలంగాణ చెల్లిం చాలని, లేదు.. ఆంధ్రప్రదేశే మాకు చెల్లించాలని ఒక వివాదం నడుస్తూ ఉన్నది. సామరస్యపూర్వక వాతావరణంలో ఈ అంశాన్ని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు. నాకు తెలిసి నేను ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ అంశంపై జరిగిన చర్చలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా పద్ధతుల్లో చెల్లించటానికి సమయం అడిగింది కానీ ఈ బాకీలు సరికావని ఏనాడు పేర్కొనలేదు. చాలా జటిలమైన సమస్య వెంటనే పరిష్కారం అవడానికి అవకాశం లేని సమస్య నదీ జలాల పంపిణీ. ఇది కేవలం తెలంగాణ–ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. నదీ పరీవాహక ప్రాంతానికి చెందిన అన్ని రాష్ట్రాలకు చెందిన అంశం. రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఎన్ని వివాదాలు ఉన్నాయో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య కూడా అన్ని వివాదాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కేవలం నిపుణులతో కూడిన కమిటీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించవలసి ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించటానికి కొంత సమయం పట్టవచ్చు. రెండు రాష్ట్రాలలో ఈ విభజన అంశాల పరిష్కారానికి ఏర్పడిన కమిటీలోని అధికారులకు సర్వీసులో సమర్థులైన, నిష్పాక్షికతకు పేరొందిన ఆఫీసర్లుగా మన్నన ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాల పరిష్కారాన్ని వీరికి వదిలేసి వారి సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తే త్వరితగతిలో అందరికీ ఆమోదయోగ్యంగా పరస్పర అవగాహనతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఎవరి తనిఖీలైనా భద్రత కోసమే!
కొద్ది రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణం చేసేటప్పుడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా దానిని విస్మరించి విమానయాన శాఖ వారు సాధారణ ప్రయాణికుడిలాగా తనిఖీలు నిర్వహించారని ఇది ఉద్దేశపూర్వకంగా ఆయనను కించపరచడానికి చేసిన చర్యగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావించి నిరసనలు తెలపడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి విమాన శాఖ రక్షణ విభాగం ఈ అంశంలో వివ రణ ఇస్తూ కేవలం గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి నేరుగా విమాన ప్రవేశం ఉంటుందని జడ్ ప్లస్ విభాగానికి చెందిన ప్రయాణికులను కూడా సాధారణ ప్రయాణికుల గానే పరిగణించి తనిఖీలు నిర్వ హిస్తారని తెలియజేయడం జరిగింది. ఈ మొత్తం ఉదంతానికి మూలం రాజకీయ నాయకులు వారి అభిమానులు ఊహించుకున్న లేని ప్రాధాన్యత. మర్యాదలు ప్రత్యేక సదుపాయాలు పదవికి సంబంధించినవే కాని వ్యక్తికి సంబంధించినవి కావు అనే ప్రధానమైనటువంటి అంశం మరిచిపో బట్టే చాలామంది నాయకులు పదవీచ్యుతులు అయిన పిదప కొత్త వాతావరణానికి అలవాటు పడటంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. చక్కని పరిపాలన సంçస్కృతులు ఉన్న ఐరోపా దేశాలలో పదవిలో ఉన్నప్పుడే ప్రధాన మంత్రులు ఇతర ఉన్నత స్థాయి నాయకులు మెట్రో లాంటి ప్రజా రవాణా సౌకర్యాలు ఉపయోగించుకోవటం, సైకిల్‌పై పార్కులు లాంటి బహిరంగ స్థలాల్లో వచ్చి మిగిలిన వారితో కలిసి మెలిసి ఉండటం జరుగుతుంది. కానీ భారతదేశం లాంటి దేశాలలో వలస పాలన వారసత్వంగా పాలకులకు పాలితులకు మధ్య మొదటినుంచి దూరం ఉంటూనే ఉన్నది. అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలలో సివిల్ లైన్స్ ప్రాంతాల్లో ఉండటం ఆఫీసు హంగామా, దర్జా ,బిళ్ళ బంట్రోతు లు ఒక కృత్రిమమైన వాతావరణాన్ని అధికారంలో ఉన్నవారి చుట్టూ కల్పిస్తాయి. వలస పాలనకు చిహ్నాలైన ఇదే విధానాలను గణతంత్ర ప్రజాస్వామ్యం అయిన తరువాత కూడా భారతదేశంలో మనం కొనసాగిస్తూనే ఉన్నాం. దీంతో రాజకీయ నాయకులు స్వతంత్ర భారతంలో ఆధునిక కాలపు మహారాజులాగా తయారైనారు. సరైన నియంత్రణ బాధ్యతాయుత విధానాలు లేకపోవడంతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, దుబారా దర్జా ఖర్చులకు అలవాటై పోయారు. అంతేకాకుండా పదవి కోల్పోయిన తర్వాత కూడా అవే సదుపాయాలను జన్మహక్కు లాగా భావించి ప్రవర్తించడం జరుగుతున్నది. పదవి కోల్పోయిన తర్వాత కూడా ఈ నాయకులు ప్రభుత్వ నివాసాలు వదలక పోవడం విద్యుత్తు, నీటి చార్జీలు కూడా కట్టకపోవడం వీరికి పరిపాటి అయిపోయింది. చివరకు కోర్టులు కలగచేసుకొని ప్రభుత్వ నివాసాల నుంచి వీరిని బయటికి పంపించి వారిచే బిల్లులు కట్టించే పరిస్థితి ఏర్పడింది. ఈ జాడ్యం రాజకీయ ప్రముఖులకే కాక వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించింది. తమను ప్రత్యేకంగా గుర్తించి మర్యాదలు చేయాలని భావించడం పరిపాటి అయిపోయింది. ఈమధ్య టోల్గేట్ వద్ద ఒక మంత్రిగారి భార్య ప్రవర్తించిన విధానం ఈ అహంకార భావన ఫలితమే. ఇటువంటి దౌర్జన్యాలు అధికారులపై రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు చేయటం సాధారణం అయిపోయింది. సరైన నియంత్రణ విధానాలు ఆడిట్ విధానాలు లేకపోవటంతో రాజకీయ ప్రముఖులు నాయకులు వారి హోదాకి, స్థాయికి మించిన అనేక సదుపాయాలను, సౌకర్యాలను పొందుతున్నారు. సరైన ఆడిటింగ్ విధానాలు, నియంత్రణల ద్వారా వీరందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించేటట్లు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగిన సంఘటనకు వస్తే ఇది అధికారికంగా ఉన్న సదుపాయము సౌకర్యము కానే కాదు. కేవలం ఆయన అభిమానులు ఊహించుకున్న ప్రాధాన్యం లేని సౌకర్యాలు మాత్రమే. ఇతర జడ్ కేటగిరి వ్యక్తుల లాగానే ఆయనను విమానయాన సంస్థ వారు పరిగణించడం జరిగింది. ఈ అంశంపై విమానయాన భద్రత విభాగం వారు ఇచ్చిన వివరణలో ఒక అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. వారి వివరణ గవర్నర్ ముఖ్యమంత్రి స్థాయి వారికి మాత్రమే తనిఖీ లేని ప్రవేశానికి అవకాశం ఉన్నది. తనిఖీ అనేది ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చేసే అంశం కాదు. మిగిలిన ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసే చర్య. అందువలన దీని నుంచి ఎంత గొప్ప వారైనా మినహాయింపు ఉండటానికి అవకాశం లేదు. అందరిని భద్రత తనిఖీ తర్వాతనే ప్రవేశం ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టాలి. ఎవరికీ ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ముందే తెలియదు కదా! వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
-
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు..!
సాక్షి, గుంటూరు: ‘నా తర్వాత ఉపద్రవం’ అని ఫ్రాన్స్ దేశంలో లూయీ ప్రభువు చెప్పినట్టు గత ఐదేళ్ల చంద్రబాబు పాలన ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో ఐవైఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు. ఇటీవల రెండు టీడీపీ అనుకూల పత్రికల్లో ‘అప్పుల అంచులో ఆంధ్రప్రదేశ్’ అనే కథనాలు వచ్చాయని, అది నిజం కాదని రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయం భారీగా చూపారని, రూ.10వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారని, వాస్తవానికి అంత మొత్తంలో కేంద్రం నిధులు వచ్చే పరిస్థితులు లేవన్నారు. ఎప్పుడైతే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందో అప్పుడే పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను సైతం తగ్గించారన్నారు. రూ.30 వేల కోట్ల వరకూ అప్పులు చేస్తామని బడ్జెట్లో చూపారని, అంత మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా అప్పులు ఇస్తారా అన్నది అనుమానమేనన్నారు. అప్పు చేయడం తప్పు కాదని, కానీ ఆ అప్పు దేనికోసం చేస్తున్నామనేది ముఖ్యమని ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రభుత్వ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.సి.రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.5 శాతం అభివృద్ధి రేటు ఉందంటున్నారని, అందుకు సరిపడా పన్ను వసూళ్లు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మాత్రం పెరగడం లేదన్నారు. దీనికి తోడు గత రెండేళ్లలో అప్పులు గణనీయంగా పెరిగాయన్నారు. 3 లక్షల కోట్లకు చేరిన రుణభారం 2014లో రాష్ట్ర విభజన సమయంలో రూ.85వేల కోట్లుగా ఉన్న రుణ భారం గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.3.05లక్షల కోట్లకు చేరిందని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ రుణానికి తోడు ప్రభుత్వ ఏజెన్సీలు, కార్పొరేషన్లు రూ.లక్ష కోట్లు అప్పుగా పొందడానికి సైతం ప్రభుత్వం గ్యారంటీగా ఉందన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.30వేల కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు కార్పొరేషన్లు, సంస్థలకు పీడీ అకౌంట్ ఉండేదని, ఆ అకౌంట్ ఆధారంగా ఆయా కార్పొరేషన్లు, సంస్థ అవసరాలు తీర్చుకోడానికి డబ్బును ఉపయోగించుకునేవారని, ఆ పీడీ అకౌంట్లలో డబ్బు లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. భారత్‌లోకెల్లా అత్యధికంగా దుబారా వ్యయం జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరొందిందన్నారు. కాంగ్రెస్‌ను తిట్టడానికి నవనిర్మాణ దీక్షలు, బీజేపీని తిట్టడానికి «ధర్మపోరాట దీక్షలు అని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఒక ఇల్లు, ఒక క్యాంప్ ఆఫీస్ ఉంటుందని కానీ, చంద్రబాబుకు మాత్రం నాలుగు క్యాంప్ ఆఫీస్‌లు ఉన్నాయన్నారు. సమాజానికి, ప్రజలకు, అభివృద్ధికి ఉపయోగపడని వాటి కోసం ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు డీఎల్ సుబ్రహ్మణ్యం, బాలభారతి సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీకి కొమ్ముకాసిన మీడియా సంస్థలు రాష్ట్రాన్ని, సమాజాన్ని, ప్రజలను చైతన్యపరిచి అభివృద్ధి వైపు నడపడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, అయితే కొన్ని మీడియా సంస్థలు టీడీపీకి కొమ్ము కాస్తూ ప్రజలకు వాస్తవాలను చూపించడం లేదని ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయబాబు విమర్శించారు. అమరావతిలో తాత్కాలిక సచివాలయం, నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని బొక్కేశారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో 25 మంది వెళ్తారని, స్పెషల్ ఫ్లైట్లు, స్టార్ హోటళ్లలో జల్సాలు చేసి డబ్బు వృథా చేశారన్నారు. నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అమరావతి, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో అంచనాలను అంతకంతకూ పెంచుతూ టీడీపీ నాయకులు కమీషన్లు బొక్కేశారని దుయ్యబట్టారు. ఉన్న ప్రాజెక్టులను పునరుద్ధరించి, మౌలిక వసతుల కల్పనకు టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి ఉంటే రాష్ట్రం గత ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. -
కేబినెట్ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు!
-
కేబినెట్ భేటీ.. చంద్రబాబు వైఖరి సరికాదు!
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్ అధికార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి.. చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తే మరో ఐదేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు మరో వాదన వినిపిస్తున్నారని ఐవైఆర్ మండిపడ్డారు. -
పర్యవేక్షణ లోపమే ‘ఇంటర్’ వైఫల్యం
పరీక్షా ఫలితాల వెల్లడి కోసం ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత, దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్ బోర్డుపై ఉన్నాయి. ఈ బాధ్యతలను తెలంగాణ ఇంటర్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది నిజం. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు.. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. అలాంటి పర్యవేక్షణ, నిర్ధారణ లోపమే పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యానికి కారణం. భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయమవుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరొక విభాగానికి మారే అవకాశం లేని మన విద్యా విధానంలో ఇంటర్మీడియట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్లయ్యేది, ఇంజనీర్లయ్యేది, ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలతోపాటు తామూ శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష. ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ, జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారంగా రాజీనామాలు చేయడానికి సమాయత్తపడటం సీఎంలు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ నేడు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు. ఇలాగే 1997లో ఒకసారి ఇంటర్ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్ బోర్డు తీవ్రమైన తప్పులు చేసింది. నాటి సీఎం ఇంటర్ బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని భావించినా, నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు. అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్మాల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు నేడు మళ్లీ తన పరిమితులను చాటుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. తమ ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ.. మరొకరి అసమర్థతకూ, నిర్లక్ష్యానికీ పిల్లలు బలైపోయారు. తెలం గాణలో ఇటీవలి ఎన్నికలలో పూర్తిగా నైతిక స్థైర్యం దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధంగా పనికి వచ్చింది. ప్రభుత్వం పక్షం నుంచి వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న విధి విధానాలే నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ విద్యాపరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగానీ అధ్యక్షులుగా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో లాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్ బోర్డుకు రీజనల్ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలను రాష్ట్రమంతటికీ కేంద్రీకృత విధానంలో ఇంటర్ బోర్డు ద్వారా వెల్లడిస్తున్నారు. గతంలో సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి ఫలితాలను క్రోడీకరించి ఎలక్ట్రానిక్ విధానంలో వెల్లడించసాగారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఏపీలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్ బోర్డుకు అందజేయడం జరిగేది. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించే జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సీసీఎల్‌గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్ షీట్ పరీక్ష ద్వారా విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచినప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జేఎన్టీయూ నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. అటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయ సహకారాలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయంగా జేఎన్టీయూ వారి సేవలను వినియోగించుకోకుండా, అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని తెలం గాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంలో తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్నప్పటికీ, వాటిని బోర్డు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితికి దారితీసింది. నేడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన గ్లోబరీనా సంస్థపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఇంటర్మీడియట్ బోర్డును అధికారులను తప్పుపట్టారు. ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశి తంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుపై ఉంది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహిం చారు. అక్కడ నేడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించగలిగారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలోను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలోనూ, దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్నా, విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నా, ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో, ఫలితాలు వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తే బాగుంటుంది. కొసమెరుపు: మొదట్లోనే చెప్పినట్లు, లోపాలకు నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రహసనప్రాయంగా మారిపోవడానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా చేరక ముందు జరిగిన సంఘటన. 1986లో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమాతో లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ‘ఆమోదించండి’ అని తన ఆమోదముద్రను తెలియజేశారు. సీఎం ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీ నామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించినప్పటికీ.. అంతర్గతంగా ఖిన్నుడైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యులతో మీరు ఆ రోజు సరైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయిఉండేది కాదని వాపోయారట. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
సీఎం ఆరోపణల పర్వంలోకి వెళ్లడం దురదృష్టకరం
-
స్వీయ తప్పిదమే పతన కారణమా?
పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో 1990 దశకంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయటం మొదలు పెట్టగానే అంతవరకు ప్రభుత్వ ఏకస్వామ్య విధానాల వలన రక్షణ పొందిన చాలా రంగాల్లో ప్రైవేట్ రంగ ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విమానయాన రంగాన్ని కూడా సరళీకరించారు. దానిలో భాగంగా ఆనాడు మోడీ లుఫ్ట్, దమానియా, ఎన్ఈపీసీ, జెట్ ఎయిర్వేస్ లాంటి విమానయాన సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మూడు నాలుగేళ్లలోనే వాటిలో చాలా సంస్థలు మూతపడినా, జెట్ ఎయిర్‌లైన్స్ మాత్రం అప్పటి నుంచి తన కార్యక్రమాలను సాగిస్తూ, నష్టాల దృష్ట్యా ఒక వారం క్రితం తన విమాన సర్వీసులను నిలిపివేసింది. జెట్ ఎయిర్వేస్కు రుణాలు మంజూరు చేసిన సంస్థలు ఉదారంగా కొంత ఆర్థిక సహాయం ఈ సమయంలో అందించి ఉంటే విమాన సంస్థ మూసేయాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదని, పనిచేసే ఉద్యోగులకు ఆసరాగా ఉండేదని, విమానయానంలో ధరలు పెరగకుండా చూడటానికి కూడా తోడ్పడేదని కొందరి వాదన. ఈ వాదన సరికాదు. ఈ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఒకరోజు, కొద్ది కాలంలో వచ్చే అంశం కాదు. సంస్థకు ఆర్థిక సమస్యలు చాలాకాలం నుంచే ప్రారంభమై ఉంటాయి. తొలి దశలో రుణాలు మంజూరు చేసిన సంస్థలు సరైన పాత్ర పోషించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. జెట్ ఎయిర్వేస్ను కాపాడుకునే అవకాశాలు అప్పుడు మెండుగా ఉండేవి. పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు రుణ సహాయం చేయడం వల్ల సంస్థ కొన్నాళ్ళు ఆక్సిజన్‌పై బతకడానికి సహాయపడుతుందేమో కానీ సంస్థ పరిస్థితిలో ఎటువంటి మౌలికమైన మార్పు తీసుకొని రావు. ఈనాడు ఇచ్చే సహాయం బూడిదలో పోసిన పన్నీరు గానే మిగిలిపోతుంది. బ్యాంకులు ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా భావన. జెట్ విమానయాన సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధానంగా రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో నిర్వహించిన పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్‌లో చాలామంది ఆశ్రిత పక్షపాతం పెట్టుబడిగా ఎదిగిన పెట్టుబడిదారులు ఉన్నారు. రాజకీయ నేతలను, అధికారులను సంతృప్తి పరచడం ద్వారా వారి సహాయ సహకారాలతో వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యక్తులు వీరందరూ. వీరు సరళీకృత ఆర్థిక విధానంలో వచ్చే పోటీ పరిస్థితిని తట్టుకుని నిలబడే సామర్థ్యం శక్తి ఉన్న వ్యక్తులు కారు. ఆ కోవకు చెందిన వ్యక్తి జెట్ ఎయిర్వేస్ అధినేత. ఇండిగో స్పైస్ జెట్ లాంటి ఆర్భాటం లేని విమానయాన సంస్థల పోటీని ఈయన తట్టుకోలేకపోయారు. ఎక్కువ ధర వెచ్చించి కొన్న సహారా విమాన సంస్థ ఎయిర్ దక్కన్ కింగ్ ఫిషర్ సంస్థకు ఏరకంగా గుది బండ అయిందో జెట్ ఎయిర్వేస్కీ అట్లాగే అయింది. వీటన్నిటికీ మించి టికెట్ల అమ్మకం కోసంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఏజెంట్లకు చెల్లించిన రుసుము సంస్థ ఖర్చులలో 12 శాతం ఉంది. ఇండిగో లాంటి సంస్థలకు ఇది రెండు శాతం మాత్రమే. 2017– 18లో రూ.2,826 కోట్లు ఈ పద్దు కింద ఏజెంట్లకు చెల్లించడమైంది. గత నాలుగేళ్లలో ఈ పద్దు కింద కమీషన్‌గా చెల్లించిన మొత్తం రూ. 10 వేల కోట్లు. ఈరోజు ఈ సంస్థ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ మొత్తం కన్నా ఇది ఎక్కువ. జెట్ ఎయిర్వేస్ సంస్థ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి కంపెనీని ప్రమోట్ చేసిన నరేష్ గోయల్ మాత్రమే కాక మిగిలిన షేర్ హోల్డర్స్ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రధానమైన అంశాన్ని విస్మరించటానికి కారణాలు చెప్పవలసిన బాధ్యత ఆడిటర్లకు, సంస్థలో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లకు ఉన్నది. సంస్థ వనరులను కొందరు బినామీలకు బదిలీ చేయటానికి యాజమాన్యం ప్రమోటర్స్ ప్రయత్నం చేశారా అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సరళీకృత ఆర్థిక విధానాలలో పనిచేసే ప్రైవేట్ సంస్థలు అన్నీ విజయవంతం కాకపోవచ్చు. పోటీ విధానంలో సమర్థ సంస్థలే దీర్ఘకాలంలో మనగలగటం జరుగుతుంది. అసమర్థ సంస్థలు మార్కెట్ ఆటుపోటులను ఎదుర్కోలేక మూతపడటం సహజమే. కానీ సంస్థ మూతపడటానికి కారణం ప్రమోటర్లు, యాజమాన్యం చేసిన అవినీతికర కార్యక్రమాలు అయితే ఆ ప్రమోటర్లు యాజమాన్యం దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే నిజమైతే వారిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థ విషయంలో మాత్రం సంస్థ మూత పడటానికి మార్కెట్ ప్రేరేపిత కారణాలకన్నా నిర్వహణ లోపాలు అనైతిక విధానాలు ప్రధాన కారణాలని అనిపిస్తున్నాయి. ప్రభుత్వం తప్పకుండా ఈ అంశాలపై దృష్టి సారించి నిజాలు వెలుగులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు -
ఉన్నతాధికారులపై నిందలు హానికరం
తనకు అనుకూలంగా పనిచేస్తేనే సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం.. లేకపోతే అసమర్థులుగా, అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం ఏపీ సీఎం చంద్రబాబుకు పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్నవిధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం తన అనుకూల మాధ్యమాలకు అలవాటు అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నించడం ఆయనకూ, అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో బాబు చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన సీఎం వ్యక్తిగత స్థాయిని తుడిచిపెట్టేశాయి. నేను సర్వీసులో చేరిన కొత్తలో శిక్షణ పొందుతూ ఉన్నప్పుడు ఎమ్మార్ పాయ్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్న ఆ రోజుల్లో నాటి సీఎం చెన్నారెడ్డి వారిని విస్మరించి వారి కన్నా సర్వీసులో జూనియర్ని చీఫ్ సెక్రటరీగా చేశారు. అపారమైన పరిపాలన అనుభవం నిజాయతీ, మంచితనం కలిగిన వ్యక్తి. పరిపాలన శిక్షణ సంస్థకు డైరెక్టర్‌గా పనిచేస్తూ మాకందరికీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. తన అనుభవాలను మాతో పంచుకుంటూ ఉండేవారు. వారు సర్వీస్‌లో చేరిన కొత్తలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఏ విధంగా ఉండేవి అనేది వివరిస్తూ, బెజవాడ గోపాలరెడ్డి లాంటి సీఎంలు తమవంటి కలెక్టర్లతో ఎంత మర్యాద పూర్వకంగా ప్రవర్తించేవారో చెప్తూ ఉండేవారు. మేము సర్వీసులో చేరేనాటికి ఈ ప్రమాణాలు చాలా తగ్గినప్పటికీ అధికారులకు, ప్రభుత్వ సర్వీసులకు చాలా విలువ ఉండేది. నేను విజయవాడ సబ్ కలెక్టర్‌గా పని చేసే రోజుల్లో చనుమోలు వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. అధికారులకు గౌరవం ఇవ్వటంలో, రాజకీయ సత్ప్రవర్తనలో ఆయనకు ఆయనే సాటి. ఆ కాలంలో ఎవరికో ఒకరికి సిమెంటు కేటాయించాలని సిఫార్సు చేశారు. అయితే ఆ వ్యక్తి అంతకుముందు నాతో ఎట్లా ప్రవర్తించిందీ వివరించి నిర్మొహమాటంగా ఇచ్చేది లేదని చెప్పాను. ఆ వ్యక్తికి ఏ స్థాయిలో అక్షింతలు పడ్డాయి అంటే రెండవ రోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. ఆనాటికే దిగజారుడుగా మాట్లాడే చాలా మంది మంత్రివర్యులు ఉన్నా, చనుమోలు వెంకటరావు లాంటి మర్యాదస్తులేన రాజకీయ నాయకులు చాలా మందే ఉండేవారు. కాలక్రమేణా ఇది తగ్గుతూ వచ్చి ఈనాడు అధికారులు అంటే చులకన భావం రాజకీయ నాయకులలో జాస్తి అయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ఒక ప్రధాన కారణం అధికారులలో అవినీతి పెరగటం. అవినీతిపరుడైన అధికారిని ఏ విధంగా తమ లాభం కోసం ఉపయోగించుకోవాలని రాజకీయ నాయకులు చూస్తారే కానీ అతనిని గౌరవంగా చూసే అవకాశం తక్కువ. అవినీతిపరుడైన అధికారికి రాజకీయ నాయకుడికి వ్యవస్థలో ఆత్మీయమైన అవినాభావ సంబంధంఉంటుంది. అవినీతిపరులైన అధికారుల సంఖ్య పెరగటంతో నీతిపరులైన అధికారుల అవసరం వ్యవస్థకు లేకుండా పోయింది. పరిపాలనా యంత్రాంగంలో నిలబడాలంటే అటువంటి అధికారులు కూడా కొంత సర్దుకొని పోవలసిన అవసరం ఏర్పడింది. చట్టాలు గుడ్డిగా ఉండటంతో అవినీతిపరులైన అధికారులు చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతున్నారు. విలువలకు ప్రాధాన్యమిస్తూ తప్పని పరిస్థితుల్లో ఫైళ్ల పైన కేవలం రూల్స్ పాటించకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారులు దోషులుగా నిలబడుతున్నారు.. బలైపోతున్నారు. ఇక అధికారులు చులకన కావడానికి మరొకప్రధాన కారణం.. విలువ లేని వ్యక్తులు రాజకీయాలలో ఉన్నత స్థానాల్లోకి రావటం. అడ్డదారిలో డబ్బులు చేసుకొని డబ్బుతోనే అన్నీ సాధించవచ్చు అనుకునే ఈ చౌకబారు రాజకీయ నాయకులకు ఉచ్చ నీచాలు తెలియటం లేదు. నడమంత్రపు సిరి లాగా నడమంత్రపు అధికారం చేతిలోకి రాగానే కొందరు రాజకీయ నాయకులకు కళ్ళు నెత్తికి ఎక్కటం సహజం. ఈ మధ్య ఒక మంత్రివర్యులు ఒక విశ్రాంత అధికారిని ఉద్దేశించి ఉద్యోగంలో ఉన్నప్పుడు గాడిదలు కాచారా అనటం ఇందుకు నిదర్శనం. ఈ రెండు ప్రధాన కారణాల దృష్ట్యా ఈనాడు అధికారులు రాజకీయ నాయకుల దృష్టిలో చులకన అయిపోతున్నారు. మూడవ కారణం.. భారత రాజ్యాంగంలో అధికార వ్యవస్థను రాజకీయ ప్రమేయం లేని తటస్థ వ్యవస్థగా పొందుపరిచారనే ప్రధాన అంశాన్ని మర్చిపోయి కొందరు అధికారులు ఒక పార్టీకో, పార్టీ నాయకులకో కొమ్ముకాయడం. దీనివలన అధికార వ్యవస్థ నిలువుగా చీలి రాజ్యాంగంలో పొందుపరచిన తటస్థ వ్యవస్థకు బదులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న టఞౌజీlటటyట్ట్ఛఝ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. రాజకీయ నాయకత్వం మార్పు జరగ్గానే అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయి కొత్తవారు పదవిలోకి రావటం దీనికి నిదర్శనం. అటువంటి సమయంలో తటస్థ అధికార విధానానికి అర్థం లేకుండా పోతుంది. మన దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని టఞౌజీlటటyట్ట్ఛఝను ప్రవేశ పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ నాటకాలకు అవసరం లేకుండా గెలుపొందిన పార్టీకి అనుకూలంగా వారి సలహాదారులు వస్తారు. సలహా ఇస్తారు. వారితోపాటే నిష్క్రమిస్తారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకులు, అధికారుల సంబంధ బాంధవ్యాల్లో వచ్చిన కాలక్రమేణా మార్పు. ఈ సాధారణ అంశాలకు సంబంధం లేకుండా గత వారంలో అధికారులను చులకన చేసి ఏపీ సీఎం రెండు సందర్భాలలో మాట్లాడారు, ప్రవర్తించారు. ఎన్నికల నిర్వహణ తేదీ కన్నా ఒక రోజు ముందు ముఖ్యమంత్రి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా అసాధారణమైన విషయం. ఇటువంటి విషయాలకు సీఎంలు సాధారణంగా ఒక సీనియర్ నాయకుడిని పంపించడం పరిపాటి. అంతేకాకుండా ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఒక సాధారణమైన నాయకుడు కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా కీర్తిని గడించిన నాయకుడు. మమతా బెనర్జీలాంటి నాయకులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ధర్నా చేయడం ముఖ్యమంత్రిగా ధర్నాకు దిగటం ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ చంద్రబాబులాంటి లబ్ధప్రతిష్టులు ఈ రకంగా చేయటం వారి స్థాయికి తగదు. ఇంతేకాక ప్రధాన ఎన్నికల అధికారిని దోషిగా చూపెడుతూ ‘మీ కార్యాలయమే మూసుకోవచ్చు కదా’ అన్న ధోరణిలో మాట్లాడారు. ప్రధాన ఎన్నికల అధికారి సీఎం హోదాను గౌరవించి చాలా సభ్యతతో, పద్ధతిగా ప్రతిస్పందించారు. సీఎం హోదాను, గౌరవాన్ని కాపాడారు. గట్టిగా సమాధానం చెప్పి సహేతుకంగా వాదనలు వినిపించి ఉంటే ముఖ్యమంత్రి గారి హోదాకు భంగం కలిగి ఉండేది. దురదృష్టం ఏమిటంటే ఆయన నమ్రతను, సభ్యతను బలహీనతగా చిత్రీకరిస్తూ ఏదో తప్పు చేశాడు కాబట్టి సీఎంకి సమాధానం చెప్పలేదు అంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని కొనసాగించి ఎన్నికలలో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం. ఇక ఎన్నికలు అయిన రెండవ రోజు సీఎం ఏకంగా ప్రధాన కార్యదర్శినే లక్ష్యంగా చేసుకుని తన విమర్శలు సంధించారు. ఎన్నికల సంఘం పనితీరు ప్రశ్నిస్తూ ఈవీఎంల విషయం ప్రస్తావన చేస్తూ ప్రధానకార్యదర్శి అంశం కూడా లేవనెత్తారు. తాను నియమించిన ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేత్‌ని తొలగించి మరొకరిని ముఖ్య కార్యదర్శిగా ఎన్నికల సంఘం ఎట్లా నియమిస్తుంది అని ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత జగన్‌తో పాటు సహ నిందితుడు అనీ, అటువంటివారిని ప్రధాన కార్యదర్శి ఎట్లా చేస్తారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా చంద్రబాబు మర్చిపోయిన విషయం ప్రధాన కార్యదర్శి మార్పుకు ఎవరైనా కారణం అయితే అది తానుమాత్రమే. ఎన్నికల షెడ్యూలు విడుదల తరువాత అధికార యంత్రాంగం అంతా ఎన్నికల సంఘం అధీనంలోకి వస్తుందని తెలిసి కూడా ఎన్నికల సంఘం ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి బేఖాతర్ చేసే విధంగా సీఎం నిర్దేశించారు. వారి ఆంతరంగిక అధికార వర్గం ఈ విషయంలో సరైన విధి విధానాలను సీఎంకు వివరించ కుండా ఆయన అభిప్రాయానికే వత్తాసు పలికారు. ఇటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రధాన కార్యదర్శి సరైన నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. అందువల్లనే ప్రధాన కార్యదర్శి మార్పు జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించుకుని అన్ని విధాల అర్హుడైన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. కేసులన్నీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సీనియారిటీ ప్రకారం అర్హతల ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని విధాల అర్హులుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అర్థరహిత అనవసర అభాండాలు వేయడం ఆయన స్థాయికి తగని పని. మనకు అనుకూలంగా పనిచేస్తేనే నిష్పాక్షిక సమర్థులైన అధికారులుగా చిత్రీకరించడం లేకపోతే అసమర్థులుగా అవినీతిపరులుగా ముద్ర వెయ్యడం సీఎంచంద్రబాబుకి పరిపాటి అయిపోయింది. తానా అంటే తందానా అన్న విధంగా ఆయన చెప్పే ఈ అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేయటం ఆయన అనుకూల మాధ్యమాలకు పరిపాటి అయిపోయింది. తన తప్పిదాలకు, వైఫల్యాలకు అధికారులను బాధ్యులుగా చేస్తూ ముఖ్యమంత్రి ప్రవర్తించడం, అదే నిజంగా ప్రజలను నమ్మించడానికి యత్నిచడం ఆయనకు, ఆయన అనుకూల మాధ్యమాలకు చాలాకాలం నుంచి వెన్నతో పెట్టిన విద్య. గత వారంలో ప్రధాన కార్యదర్శి విషయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ప్రధాన ఎన్నికల అధికారి విషయంలో అనుసరించిన వైఖరి గత 30 ఏళ్లుగా చాలా కష్టపడి జాతీయంగా, అంతర్జాతీయంగా సంపాదించిన వారి వ్యక్తిగత స్థాయిని ఒక్క పెట్టుతో తుడిచి వేశాయి. దీనికి కారణం ఆయన నిజమైన వ్యవహారశైలి.. తను కష్టపడి ప్రపంచానికి ప్రదర్శించిన కృత్రిమ వ్యవహార శైలి కన్నా పూర్తిగా భిన్నంగా ఉండటమా? లేక ఎన్నికలలో పరాజయ సంకేతాలు రావటంతో ఏర్పడిన నిరాశ నిçస్పృహలా? వేచి చూడాలి. వ్యాసకర్త : ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ మెయిల్ : iyrk45@ gmail. com -
బాబు ఇదా అనుభవం?
-
పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలాంటీది: ఐవైఆర్
-
‘పోలవరం ఓ కామధేనువు.. క్యాపిటల్ ఓ కల్పవృక్షం’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఏటీఎమ్ లాంటిదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. పోలవరం డ్యామ్ పూర్తి కాకుండానే మే నెలలో నీళ్లు ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. చంద్రబాబుకు పోలవరం ఒక కామధేనువు, క్యాపిటల్ సిటీ కల్పవృక్షం లాంటివని ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాన మీడియా సంస్థలన్నీ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇష్టానుసారంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు ఒక సామాజిక వర్గానికి ఇవ్వడం.. నాలుగేళ్లు గడిచిన తరువాత పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పనిచేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి 2019 ఎన్నికల్లో డబ్బులతో ఎలాగైనా గెలవాలని విచ్చలవిడిగా అవినీతి పెంచారని మండిపడ్డారు. -
అయిదేళ్లు సాగినదంతా దోపిడీనే
ఏ పని చేసినా దానివల్ల నాకేమిటి? రాజకీయంగా, ఆర్థికంగా నాకేమొస్తుంది? అనే స్వార్థ కోణంలోనే చంద్రబాబు నిత్యం ఆలోచిస్తారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే అభిలాష ఆయనకు ఏ కోశానా లేదు. కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందాలనే స్వార్థంతోనే కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు ఇటీవల వివిధ కులాలు, వర్గాలకు 31 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను కుంభకోణాలమయంగా మార్చేశారు. ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం.. అందినకాడికి దోచేయడం చందంగానే ఈ ఐదేళ్లూ ప్రభుత్వం నడిచింది. ప్రభుత్వ భూములే కాకుండా దేవుళ్ల మాన్యాలు కూడా కొట్టేసేలా సాగిన కుట్రలకు లెక్కే లేదు. ప్రయివేటు విద్య, వైద్య రంగాలను నెత్తిన పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రులను, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు. బాబు అవినీతి, అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదాయం లేదని బీద అరుపులు అరుస్తూనే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ, దీక్షలు, విహారయాత్రల పేరుతో లెక్కలకందనంత దుబారా చేశారు. అనుకూల మీడియాను వినియోగించుకుని చేయనిది చేసినట్లు, లేనిది ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంలో గోబెల్స్‌ను చంద్రబాబు ఎప్పుడో మించిపోయారు. సాక్షి, అమరావతి : ‘ఎక్కడైనా తప్పులు బయటపడితే విచారణ జరిపించి దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉంటుంది. అయితే, ఇందుకు పూర్తి విరుద్ధంగా కుంభకోణాల్లో వాస్తవాలు బయటకు పొక్కకుండా చంద్రబాబు పాతరేశారు. విశాఖపట్నం భూ కుంభకోణం, అమరావతి ల్యాండ్ స్కాం, విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులు ఇందుకు నిలువెత్తు నిదర్శనాలు. లోతుగా దర్యాప్తు జరిపిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయనే ఉద్దేశంతో వీటన్నింటినీ తూతూమంత్రం విచారణలతో ‘మమ’ అనిపించేశారు. ఒకరిద్దరు చిన్నవారిపై చర్యలు తీసుకోవడం ద్వారా విచారణ జరిపించినట్లు అనుకూల మీడియాలో పెద్దఎత్తున వార్తలు రాయించుకున్నారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వ నిజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రిటైర్డు) ఐవైఆర్ కృష్ణారావు. అంతేకాదు... బాబు జమానాలోని పక్షపాతాన్ని, పచ్చి నిజాలను పూసగుచ్చినట్లు కుండబద్ధలు కొట్టారు. ‘ఆయన ఎంతసేపూ తమ వర్గం, తమ కాంట్రాక్టర్లు, తమ రియల్ ఎస్టేట్ వ్యక్తుల మేలు కోసమే పాటుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో గతంలో సఖ్యతగా ఉన్నది కూడా రాష్ట్రానికేదో మేలు చేయాలని కాదు. వాళ్ల అనుకూలురుకు కేంద్రంలో కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, కావాల్సిన పనుల కోసమే. నాలుగేళ్లు వాళ్ల దృష్టి దానిపైనే ఉంది. అలాకాకుండా రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలపై దృష్టిపెట్టి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడి ఉండేదని’ ఐవైఆర్ విశ్లేషించారు. ఈ అయిదేళ్ల టీడీపీ పాలనలో ఏం జరిగింది? రాష్ట్రం పురోగమనంలో ఉందా? తిరోగమనంలో ఉందా? అందుకు కారణాలేమిటి? రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలి? తదితర అంశాలపై ఐవైఆర్ అభిప్రాయాలివి.. ప్రభుత్వ డేటాను వాడుకోవడం పెద్ద తప్పు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎంత దరిద్రంగా సాగుతుందో చెప్పడానికి ఐటీ గ్రిడ్ వ్యవహారమే నిదర్శనం. సహజంగా పాలనలో సీఎం సమావేశానికి కూడా అన్ని విభాగాల వారు రారు. కానీ, ఎవరో అనామకుడు ఒక ప్రతిపాదన తెచ్చిస్తే దానిని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ విభాగాలన్నిటితో సమావేశం పెట్టారు. కమిటీ ఏర్పాటు చేసి వారిచేత పని చేయించారు. పోనీ, ఆ ప్రతిపాదన పెట్టింది ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్‌లాంటి పెద్ద సంస్థలు కాదు. రోడ్డున పోయే దానయ్య ప్రతిపాదనకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి మొత్తం ప్రభుత్వ డేటాను వాడుకుని పార్టీ పరంగా లబ్ధి పొందాలని చూడటం చాలా పెద్ద తప్పు. ఇది చాలా దూరం వెళ్తుందని నేను భావిస్తున్నా. దోపిడీ కోసం ఇసుకను సాధనంగా వాడుకున్నారు. బాబు పాలన గురించి చెప్పాలంటే ‘ఇసుక పాలసీ’ చూస్తే చాలు. ఇసుకను ఎలా డీల్ చేయాలో ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయినా ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతారనేది అతి ముఖ్యమైన ప్రశ్న. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం సాఫీగా జరిగిపోతున్న దానిని... వారి దోపిడీ కోసం చెడగొట్టారు. తాము వెనకుండి దండుకునేందుకు మొదట ‘డ్వాక్రా సంఘాలకు ఇసుక సరఫరా బాధ్యతలు’ అప్పగించినట్లు తెరపైకి తెచ్చారు. వాస్తవంగా అక్కడ డ్వాక్రా లేదు. మహిళలు లేరు. ఆ ముసుగులో తెలుగుదేశం నాయకులు వెనకుండి అనుచర, బంధుగణంతో అడ్డగోలుగా ఇసుక తవ్వించి అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. మొత్తం గందరగోళం చేశారు. ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. వీరి నిర్వాకానికి ఒక దశలో నిర్మాణ రంగానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు.. బియ్యం ఉడికాయా? లేదో చెప్పాలంటే ఒకటి రెండు మెతుకులు పట్టుకుని చూస్తే చాలంటారు. బాబు పాలనలో ఈ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలాంటివే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ అంతా ఒక పెద్ద స్కామ్. ప్రతిచోటా ఇష్టమొచ్చినట్లు అంచనాలు పెంచేయడం, సబ్ కాంట్రాక్టులు ఇచ్చేయడం, దోచేయడం. అయిదేళ్లుగా సాగుతున్నది ఇదే. ఈ నేపథ్యంలో పజలు బాగా ఆలోచించుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్లు ఎన్నికల కోసమే.. ఈయన (చంద్రబాబు) మళ్లీ గెలిస్తే కాపు కార్పొరేషన్ ఉండదు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండదు. ఎన్నికల ముందుపెట్టిన మొత్తం కార్పొరేషన్లలో ఏ ఒక్కటీ ఉండదు. ఇవన్నీ ఎన్నికల అవసరం కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థలు మాత్రమేనని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి. వీటితో తమకేదో జరుగుతుంది, ఒరుగుతుంది, అయిపోయింది అనుకుంటే చాలా పొరపాటు. మళ్లీ గెలిస్తే అన్నింటినీ తీసేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు తొమ్మిదేళ్ల పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకున్న వారెవరికైనా ఈ విషయం బోధ పడుతుంది. జంధ్యాల సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘నాకేంది?’ అనే తరహాలో చంద్రబాబు ఆలోచనంతా సాగుతుంటుంది. ప్రతి సమస్యకు, ప్రతి విధానానికి, ప్రతి అంశానికి నాకేంటి? పొలిటికల్‌గా నాకేంటి? అనే ఆయన ఆలోచిస్తుంటారు. ప్రజలకు మేలు చేస్తే ఆటోమేటిగ్గా రాజకీయంగా అనుకూల ఫలితాలు ఉంటాయనే విశాల దృక్పథం ఏనాడూ లేదు. ఆలయాలు, «ధార్మిక సంస్థలంటే ఆయనకు ఏమాత్రం పవిత్రతగాని, భక్తి గాని ఉన్నట్లు లేదు. ఈనాం చట్టాన్ని ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు మార్చి అతి పెద్ద కుంభకోణం చేయబోతున్నారు. దేవుడి మాన్యాలు కొట్టేయడానికి పెద్ద పన్నాగం పన్నారు. దీనిని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న గ్రామంలో రూ.5 వేలు తీసుకునే అర్చకుడికి సాయం చేయడానికి ఈయనకు మనసు రాదు. అందులోనూ నాకేంటి? అని ఆలోచించే రకం. ప్రభుత్వ విద్యను నాశనం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ విద్యను నెత్తిమీద పెట్టుకుని ప్రభుత్వ విద్యను, కార్పొరేట్ ఆస్పత్రులను భుజాన మోస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను భ్రష్టు పట్టించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే పేదలు భయపడేంతగా పరిస్థితిని దిగజార్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత రాష్ట ఆదాయం, పన్నుల్లో వాటా పెరిగాయి. అయినా దానిని విద్య, వైద్యంపై ఖర్చు పెట్టలేదు. కప్పిపుచ్చుకోవడానికి కొత్త సాకులు.. ఇటీవలి గుంటూరు, విశాఖపట్నం సభలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమీ మోసం చేయలేదని ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఇంకో సాకు కోసం చూసుకుంటున్నారు. కేసీఆర్‌ను తీసుకెళ్లి అక్కడపెట్టి, రాష్ట్రం మీద ఏదో కుట్ర జరుగుతోందని చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు. కచ్చితంగా ఇందులో విఫలమవుతారు. ఎందుకంటే చంద్రబాబు ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. ఆయన పార్టీ ప్రయోజనాలే రాష్ట్ర ప్రయోజనాలు కావు. రాష్ట్రం ఆయన కంటే, ఆయన పార్టీ కంటే చాలా పెద్దది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అనుకూల మీడియా ద్వారా పదికి వందసార్లు చెప్పి, వాళ్లు వందకు వెయ్యిసార్లు చెబితే ప్రజలు మోసపోతారనే భ్రమల్లో ఉన్నారు. అది ఎన్నటికీ జరగదు. బోగాపురాన్ని అడ్డుకున్నారు పని లేనప్పుడు, పని చేయనప్పుడు, వాస్తవంగా ప్రగతి సాధించలేనప్పుడు వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టుతుంటారు. బోగాపురం ఎయిర్‌పోర్టు టెండరు రద్దు చంద్రబాబు అవినీతి విధానానికి పరాకాష్ట. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండరు వచ్చింది. దానితో త్వరగా ఒప్పందం కుదుర్చుకుని పనులకు అనుమతించి ఉంటే చక్కటి అద్భుతమైన విమానాశ్రయం రూపుదిద్దుకుని ఉండేది. అయితే, కమీషన్ల కోసం, కావాల్సిన వారికి కాంట్రాక్టును కట్టబెట్టడం కోసం బాబు ఈ టెండరును రద్దు చేశారు. ఈ ప్రభుత్వం ఎలా, ఎందుకు నడుస్తోందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ఒక్క ఓడ రేవునైనా నిర్మించారా? వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చంద్రబాబు వెయ్యిసార్లు పైగా చెప్పి ఉంటారు. ఇక్కడ మంచిగా ఓడరేవులు కట్టుకోవచ్చని చెబుతుంటారు. అయిదేళ్లలో కట్టిన ఓడరేవు ఒక్కటి చూపించమనండి. నిజంగా ఆ ఉద్దేశం ఉంటే ఈ సమయం ఎక్కువే కదా? మచిలీపట్నం ఓడరేవును అప్పటికే నవయుగ వారికి ఇచ్చారు. తలచుకుంటే భావనపాడు పూర్తి చేసి ఉండవచ్చు. కేంద్రం కోరినట్లు దుగరాజుపట్నంకు ప్రత్యామ్నాయంగా రామాయపట్నంను చూపించి ఉంటే అదీ వచ్చి ఉండేది. మూడు ఓడ రేవులు వచ్చే అవకాశం ఉన్నా ఒక్కటీ కట్టకుండా... ‘ఐదేళ్లుగా రోజూ మాకు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని’ చెప్పుకుంటూ ఉంటే లాభం ఏముంటుంది? రియల్ ఎస్టేట్‌తో దండుకోవడమే లక్షం.. ఈనాం భూములుగానీ, ప్రభుత్వ భూములు గానీ, దేవుని భూములుగానీయండి ఏవైనా భూముల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దండుకోవడమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగానే సదావర్తి భూములపై కన్నేశారు. అదృష్టవశాత్తు కోర్టుల జోక్యంతో సదావర్తి భూములు వారి పాలుకాకుండా కొంతవరకు ఆగాయి. కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చెడు జరిగితే ఇతరులపై నెట్టేస్తారు.. మంచి జరిగితే అంతా తన ప్రతిభ అని ప్రచారం చేసుకోవడం, ఏదైనా నిర్ణయం వివాదాస్పదమైతే అధికారులపై నెట్టేయడం ఆయనకు ఆది నుంచి అలవాటే. ఇది ఆయన విధానం కూడా. గతంలో చంద్రబాబు అదనంగా మద్యం దుకాణాలకు అనుమతివ్వాలని నిర్ణయించడం పెద్ద వివాదమైంది. మర్నాడు ఇది ఎవరు, ఎందుకు చేశారు? అని సీఎం ఆరా తీసి కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. తర్వాత ఆ కమిషనర్‌ను తప్పించి పోస్టింగ్ ఇవ్వకుండా ఎక్కడో సర్దుబాటు చేశారు. నిజానికి ఈ నిర్ణయం తీసుకున్నది చంద్రబాబే. మీడియాను అడ్డుపెట్టుకుని.. కాగితాల పైన కంపెనీలు సృష్టించి టీడీపీ నాయకులు అన్ని ప్రధాన ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములను కబ్జా చేసేశారు. విశాఖపట్నంలో, అమరావతిలో ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. విశాఖపట్నంలో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను కూడా వెనక్కు తీసుకుని ఆక్రమణదారులకు కట్టబెట్టే దుష్ట పన్నాగం సాగింది. ఏదైనా కుంభకోణం కొద్దిగా బయటకు పొక్కితే విచారణ జరిపించి దోషులను శిక్షించే పరిస్థితి లేదు. కాల్‌మనీ రాకెట్‌ను ఇలాగే తొక్కిపెట్టేశారు. విశాఖ భూముల కుంభకోణాన్ని, అమరావతి రియల్ ఎస్టేట్ కుంభకోణాన్ని పక్కకు పెట్టేశారు. అనుకూల మీడియా ఉన్నది కాబట్టి వ్యతిరేక వార్తలు రాకుండా, పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి రాకుండా ఎక్కడికక్కడ మూసేశారు. ఎదుటివారి విశ్వసనీయతను దెబ్బతీస్తూ కాలయాపన చేశారే గాని ఒక మంచి పారదర్శక పాలన ఇవ్వాలని ఏ రోజూ ప్రయత్నం చేయలేదు. అంతా తనవారికోసమే ఎంతసేపటికి తను, తన వర్గం, తనవాళ్లు... అనే చంద్రబాబు ఆలోచిస్తారు. వారి మేలు కోసం పనిచేయడం తప్పితే బాబు చేస్తున్నదేమీ లేదు. చేయాలన్న అభిలాష కూడా లేదు. చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ. వినేవారుంటే చెప్పిందే చెబుతుంటారు. చేసే పనులకు చెప్పే మాటలకు ఏమాత్రం పోలిక, పొంతన ఉండదు. బాండ్లదంతా డాంబికమే.. అమరావతి కోసమంటూ బాండ్లుజారీ చేసి రుణం తీసుకున్నారు.దానికి ఎక్కడా లేనంత అధిక వడ్డీ చెల్లిస్తున్నారు. బాండ్లను మార్కెట్లో అమ్ముకుంటే లాభ పడేది కొన్నవారే. సర్కారుకు ఏమీ రాదు. దానికి సీఎం ముంబై వెళ్లి మార్కెట్లో గంట కొట్టి అదో పెద్ద అద్భుతంలా రాష్ట్రమంతా ప్రచారం చేసుకున్నారు. అక్కడ ఏమీ లేదు. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. అభివృద్ధిని చేజేతులా పాడు చేశారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని చక్కటి ప్రణాళికతో అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని చేజేతులా నాశనం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బును సరిగా వినియోగించుకోలేదు. అనవసరంగా నిందలు, అభాండాలు వేసి వారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నారు. తను చేసిన పనులను చెప్పుకొని ఎన్నికలకు పోతే నెగ్గలేమని గుర్తించారు. అందుకని ఏదో ఒక నెపం కోసం వెదుకుతున్నారు. మొన్నటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి లబ్ధి పొందాలని చూశారు. దానిని ప్రజలు తెలుసుకున్నారు. కల్పిత వృద్ధి చూపారు చంద్రబాబు చెబుతున్న అభివృద్ధి అంతా బూటకమే. ఇందుకు రాష్ట్రంలో తక్కువగా ఉన్న మానవాభివృద్ధి సూచికలే నిదర్శనాలు. శిశు మరణాల రేటు (ఐఎంఆర్), మాతా మరణాల రేటు (ఎంఎంఆర్) జీవిత కాలం (లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ)లను మానవాభివృద్ధి సూచికలకు ప్రామాణికాలుగా తీసుకుంటారు. వీటన్నింటా మనం వెనుకబడే ఉన్నాం. సీఎం చెబుతున్నట్లు నిజంగా జరిగి ఉంటే ఆ ప్రగతి మానవాభివృద్ధి సూచికల్లో ప్రతిబింబించాలి కదా? కానీ, రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి గతం కంటే గణనీయంగా తగ్గింది. బాబు మార్కు గొప్ప అభివృద్ధి ఇదేనేమో.! జాతీయ ఉత్పత్తి అంకెలను ఎంతంటే అంత పెంచేసి, దొంగ లెక్కలు చూపించి 10 నుంచి 15 శాతం వృద్ధి ఉందని చెబుతున్నారు. జాతీయ ఉత్పత్తి పెరిగితే పన్ను రాబడి నిష్పత్తి కూడా అదే స్థాయిలో ఉండాలి కదా? మరి ఎందుకు లేదు? ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయం పెరిగితే ల్లలను బాగా చూసుకుంటారు. అందువల్ల వారి మరణాలు తగ్గాలి. ప్రసవానంతర మరణాలు తగ్గాలి. మరి ఆ సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు. ఊరికే జాతీయ అభివృద్ధి పెరిగింది... పెరిగింది... అంటే అంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. బాబు సమస్య రెండు రాష్ట్రాల సమస్యా? ప్రతిసారి తన సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించి ప్రయోజనం పొందాలని ఎత్తుగడలు వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. అక్రమార్కులపై ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేస్తే తన వర్గీయులను కేంద్రం వేధిస్తోందంటారు. తనపై దాడికి వస్తే ప్రజలు రక్షణగా నిలవాలంటారు. దానిని కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా చెప్పుకొంటారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తే ఆంధ్ర – తెలంగాణ సమస్యగా చెబుతారు. ప్రభుత్వ సమాచారం లీకైన ఐటీ గ్రిడ్ గురించి మాట్లాడినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యంటారు. అసలు పదేళ్ల హక్కు ఉన్న హైదరాబాద్‌ను ఏపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం లేదు. అయితే, తనకు సమస్య (ఓటుకు కోటి కేసు) వచ్చినందున హఠాత్తుగా విజయవాడలో వాలారు. ప్రజాస్వామ్యానికి మనకు తెలిసిన నిర్వచనం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అనేది. చంద్రబాబు దానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. కొంతమంది డబ్బులు వసూలు చేస్తారు. కొంత మంది దానిని ఖర్చుపెడతారు. ఇదే డెమోక్రసీ అన్నది బాబు మాట. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. పట్టపగ్గాల్లేని దుబారా లోటు బడ్జెట్, డబ్బులు లేవని గొంతు చించుకుని అరుస్తున్నవారు ఎవరైనా పాలనలో కచ్చితమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. కానీ, రాష్ట్రంలో పై నుంచి కింద వరకు అటువంటి విధానం కనిపించడం లేదు. పైపెచ్చు అప్పు చేసి పప్పు కూడు చందంగా విపరీతమైన దుబారా సాగుతోంది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. పోలవరం, రాజధాని విహార యాత్రలు సర్కారు మితిమీరిన దుబారాకు నిదర్శనాలు. పోలవరంలో గాని, రాజధానిలో గాని నిజమైన ప్రగతి ఉంటే ఎవరినీ తీసుకెళ్లి చూపించాల్సిన అవసరం ఉండదు. అభివృద్ధి జరిగితే వారు ఎలాగైనా తెలుసుకుంటారు. సాగర్ నిర్మాణమే ఇందుకు నిదర్శనం. ఇక్కడ పోలవరంలో గాని, అమరావతిలో గాని జనం వెళ్లి చూడాల్సిన స్థాయిలో జరుగనందునే విచ్చలవిడిగా సర్కారు సొమ్ము ఖర్చు చేస్తూ విహార యాత్రకు తీసుకెళ్తున్నారు. చూపెట్టేందుకు ఏముందక్కడ?పోలవరంలో కొంత పెడుతున్నందున కొంత పని జరుగుతుంటుంది. ఎవరైనా వెళ్లి చూసి రావచ్చు. సర్కారు తీసుకెళ్లడం ఏమిటి? ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం? ధర్మ పోరాట దీక్షలంటూ ఆందోళన చేస్తున్నారు. ఏది ధర్మం? ఎవరిమీద పోరాటం? ధర్మం మనవైపు ఉంటే కదా పోరాటం చేయడానికి?ఇచ్చినవన్నీ ఇవ్వలేదని చెబుతున్నారు. తప్పుడు లెక్కలు చూపించి కేంద్రాన్ని ప్రజల ముందు దోషిలా నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. దాని నుంచి ఏమీ రాదని తెలుసు. అయినా అంతంత డబ్బు ఖర్చు పెట్టడమన్నది చాలా అవాంఛనీయం. -
మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం!
సాక్షి, అమరావతి: ‘మంగళగిరి ప్రజలకు ఇది మంచి అవకాశం. ప్రజలు ఆలోచించి.. మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అర్హతలేని రాజకీయ వారసులను ఓడించాలి’ అని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు పిలుపునిచ్చారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావుతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. మంగళగిరిని ‘మందలగిరి’గా మార్చేస్తారేమో! ‘మంగళగిరికి ఈ ఎన్నికల్లో చాలా ప్రాధాన్యముంది. అధికార బలంతో, ధనబలంతో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలవాలనుకుంటున్నారు. స్థానికేతరుడైన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీచేస్తున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. భూ వ్యాపారం చేసుకోడానికి, వేలకోట్ల నల్లధనం దాచుకోడానికే ఆయన ఇక్కడికి వచ్చారు. అవినీతి సొమ్మంతా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. మంగళగిరిపై లోకేష్‌కు ఎలాంటి ప్రేమలేదు. అభివృద్ధి పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు’ అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. మంగళగిరి పేరును మందలగిరిగా పేరు మార్చే పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. నారా లోకేష్ అమాయకుడేమీ కాదని, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలన్నింటికీ ఆయన సూత్రధారి అని మండిపడ్డారు. లోకేష్ అంటే లోకాన్ని దోచేటోడని, ఈ నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇట్లో జరిగిన ఐటీ సోదాలను టీడీపీ నేతలు అడ్డుకున్న తీరు అమానుషమని మండిపడ్డారు. అడ్డకున్న వారిపై కేసులు నమోదుచేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఉగ్రవాదులుగా టీడీపీ నేతలు మారారని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ దళారులకు అప్పజెప్పి టీడీపీ రాజకీయం చేస్తోందని, టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ వెంటనే రాజీనామా చెయ్యాలని అన్నారు. అన్య మతుస్తుల తరఫున ప్రచారం చేసే వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించడం వెనక చంద్రబాబు ఉద్దేశం ఏమిటన్ని ప్రశ్నించారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, ఆ పార్టీకి ప్రస్తుత ఎన్నికల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాదని జీవీఎల్ పేర్కొన్నారు. -
‘ఎలాంటి హోదా ఇస్తారో రాహుల్ చెప్పాలి’
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు కానీ ఎలాంటి హోదా ఇస్తారో చెప్పడంలేదని బీజేపీ నాయకుడు, రాష్ట్ర మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెపుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ ఛీప్ మాయావతి పరిశ్రమలకు రాయితీలు ఉన్న ప్రత్యేక హోదా ఇస్తారా రాయితీలు లేని హోదా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు రాయితీలు లేని ప్రత్యేక హోదా ఇస్తే దాని కంటే ప్యాకేజీ బెటరన్నారు. చంద్రబాబు హోదాపై మాట్లాడి ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మేనిఫేస్టో విడుదల చేయని చంద్రబాబు ఓట్లు ఎలా అడుతారని ప్రశ్నించారు. పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వల్పకాలిక ప్రలోభాలకు ప్రజలు లొంగొద్దని కోరారు. కులాలు వారిగా ఏర్పాటు చేసిన కొర్పొరేషన్లను భవిష్యత్తులో ఉంచుతారనే నమ్మకం లేదన్నారు. ఏపీ ఎన్నికల తర్వాత చంద్రబాబు దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు.. అలా చేస్తే బీజేపీకి 50 సీట్లు ఎక్కువే వస్తాయన్నాని ఎద్దేవా చేశారు.