సాక్షి, అమరావతి : గత కొన్నిరోజులుగా బెజవాడ దుర్గమ్మ గుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అవసరం తీరిన తర్వాత అధికారులను కించపరచడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి చీరను దొంగలించింది పాలకమండలి సభ్యురాలైతే ఈవోపై వేటు వేయడమేమిటని ప్రశ్నించారు.
దేవాదాయ శాఖలో ఆర్థికంగా లాభదాయకమైన పోస్టుగా భావించే.. దుర్గ గుడి ఈవో పోస్టుపై చాలా మంది కన్ను ఉంటుందని, అస్మదీయులకు ఈ పదవిని కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం నాటకమాడినట్లుగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే అధికారులతో హుందాగా వ్యవహరించడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు.
కాగా ఇటీవల ఓ భక్తురాలు అమ్మవారికి సారెగా సమర్పించిన 18 వేల రూపాయల ఖరీదైన చీర కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో... ఆలయ ఈవో ఎం. పద్మపై బదిలీ వేటు వేశారు. ఆమె స్థానంలో ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించారు. కాగా మాజీ ఈవో ఎం. పద్మను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment