
సాక్షి, విజయవాడ: తాను రచించిన ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 25న జరగనుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు జరిగిన పరిణామాలపై ఈ పుస్తకంలో ప్రస్తావించానని పేర్కొన్నారు. అంతే కాకుండా సీఎం, చీఫ్ సెక్రటరీల మధ్య ఉండాల్సిన అదేవిధంగా ఉండే బాధ్యతల గురించి కూలంకషంగా వివరించానన్నారు. అనేక భూ సంబంధ అంశాలు, వాటి చర్యల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించానని తెలియజేశారు.
‘ఎవరి రాజధాని అమరావతి?’
గతంలో ‘ఎవరి రాజధాని అమరావతి?’ అంటూ రాసిన పుస్తకంలో కూడా ఐవైఆర్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపారు. ఇక ఈ పుస్తకంలో ఆయన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. ‘అమరావతి ఏ రకంగానూ ప్రజా రాజధాని కాదు. ఇది ఎక్లూజివ్ రాజధాని. తన జాతి బలమైన సమర్థన ఉండటం వల్లే చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారు. ప్యూహాలు పన్ని కుటిలనీతి ఉపయోగించారు. మాదాపూర్ హైటెక్ సిటీ రియల్ ఎస్టేట్ తరహా నమునాలా అమరావతిని ఎంపిక చేశారు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే.