సాక్షి, విజయవాడ: విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలంగా మారిన విషయం తెలిసిందే. బెంజి సర్కిల్ వద్ద గల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న(శనివారం) ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు.
బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 306 సెక్షన్ల కింద కేసులను నమోదు చేసినట్టు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిని, అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని సెక్షన్ల కింద కేసులను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. విచారణలో భాగంగా వినోద్ జైన్ ఇంటిని ఇప్పటికే సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. గత 2 నెలలుగా బాలికను.. వినోద్‌జైన్ లైంగికంగా వేధించాడని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఈ క్రమంలో బాలిక ఎవరికీ చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించిందని అన్నారు.
నిందితుడు వినోద్‌జైన్.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేసేవాడో బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఏసీపీ తెలిపారు. బాలిక.. లిఫ్ట్‌లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బాలికను వేధించేవాడని సూసైడ్ నోట్లో రాసింది. కాగా, రెండు పేజీల్లో బాలిక తన బాధను తెలియజేసిందని ఏసీపీ హనుమంతరావు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.
చదవండి: బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ
Comments
Please login to add a commentAdd a comment