
సాక్షి, విజయవాడ: దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మంగళవారం గాయత్రిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయానికి తరలివస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకలమంత్ర సిద్ధిఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.