సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్ అధికార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘించేందుకే.. చంద్రబాబు మంత్రిమండలి సమావేశానికి నిర్ణయించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వైఖరిపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి సక్రమంగా లేదని ఆయన స్పష్టం చేశారు.
నిబంధనల ప్రకారం ప్రకారం ఏం చేసినా అధికారులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. కేబినెట్ సమావేశానికి సంబంధించిన అజెండా ఏమిటో.. ఎందుకు నిర్వహిస్తున్నారో ఎన్నికల సంఘానికి తెలియజేసి.. చంద్రబాబు అనుమతి తీసుకోవాలని ఐవైఆర్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తే మరో ఐదేళ్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎన్నికల ముందు వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు మరో వాదన వినిపిస్తున్నారని ఐవైఆర్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment