పోలీసులు పని చేయకపోవడం వల్లే మాట్లాడానన్న పవన్
నెలరోజుల్లో గాడిలో పెడతానని చెప్పిన సీఎం చంద్రబాబు
అసలు విషయం వదిలేసి సోషల్ మీడియాపై చర్చ
సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. చివరలో చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రులతో రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై పోలీసులు సరిగా స్పందించడం లేదని, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పినట్లు లీకులిచ్చారు.
కొందరు అధికారుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు చెప్పినట్లు సమాచారం. కొన్ని జిల్లాల ఎస్పీలు తమ ఫోన్లు తీయడం లేదని ఒకరిద్దరు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని, కింది స్థాయి అధికారులపై నెపం మోపి తప్పించుకుంటున్నారని చెప్పగా, చంద్రబాబు స్పందిస్తూ నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పినట్లు సమాచారం. రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను దేనికీ ఉపయోగించకుండా మ్యూజియంగా మార్చి అందరికీ చూపిద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.
పవన్ వ్యాఖ్యలపై టాపిక్ డైవర్ట్
పవన్ వ్యాఖ్యలపై మంత్రివర్గంలో చర్చ అంతా జరిగిన నష్టాన్ని కవర్ చేసుకునే క్రమంలోనే సాగినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఆడబిడ్డలను రేప్ చేస్తుంటే సరైన చర్యలు తీసుకోవడం లేదన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా టాపిక్‌ను డైవర్ట్ చేసి.. మంత్రివర్గంలో చర్చించడం గమనార్హం. ఆ విషయాలపై కాకుండా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా గురించి పవన్ వ్యాఖ్యలు చేసినట్లు చర్చలు జరిపినట్లు తెలిసింది.
హోం మంత్రిని, డీజీపీని పవన్ నిలదీసిన ప్రస్తావన సమావేశంలో రాకపోవడం విశేషం. పవన్ వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతల డొల్లతనం బయట పడడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోయింది. దాన్ని కవర్ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలన్న దానిపై పవన్ మాట్లాడినట్లు డైవర్ట్ చేసి దానిపై చర్చ జరిగేలా చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment