దళారీల ఇసుక బుకింగ్‌ | Chandrababu Govt Sand Prices increased and sold in black market | Sakshi
Sakshi News home page

దళారీల ఇసుక బుకింగ్‌

Published Thu, Oct 24 2024 5:06 AM | Last Updated on Thu, Oct 24 2024 5:06 AM

Chandrababu Govt Sand Prices increased and sold in black market

ధరలు పెంచి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు

ఇక ఇసుకపై సీనరేజ్, జీఎస్‌టీ రద్దు

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రులు

సొంత అవసరాలకు నేరుగా రీచ్‌కు వెళ్లి ఉచితంగా తీసుకోవచ్చు

అక్రమ రవాణా, విక్రయాలు జరిపితే పీడీ యాక్ట్‌ కేసులు

దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

అర్హత గల గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి వర్తింపు

శారదా పీఠానికి భూ కేటాయింపులు రద్దు

టెండర్లపై జ్యుడీషియల్‌ ప్రివ్యూ చట్టం రద్దు

ఆలయాల పాలకమండలిలో సభ్యుల సంఖ్య 17కు పెంపు

సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో భారీగా ఇసుక బుకింగ్‌ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. 

మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. 

తక్కువ రేటుకు ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని బ్లాక్‌ మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్‌లోడ్‌ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్‌టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 

స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్‌ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.

రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందే
పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్‌జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్‌లు, 25 స్టాక్‌ పాయింట్లు, 17 మాన్యువల్‌ రీచ్‌లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. 

సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్‌లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో చేసుకోలేకపోతే రీచ్‌ దగ్గరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.

ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్‌తో విక్రయం
విశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్‌లు లేనందున  చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్‌ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్‌తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్‌్కగా కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్‌కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం
దీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. అర్హత గల గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్‌ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్‌ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్‌ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. 

వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్‌ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్‌ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్‌ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.

జ్యుడీషియల్‌ ప్రివ్యూ చట్టం రద్దు
రూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని  మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్‌ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు  ఒక్కొక్కరు చొప్పున అవకాశం. 

⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.

⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయం. 

⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్‌ ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం–1956, డాక్టర్‌ ఎన్టీఆర్‌ వర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. 

⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు. 

⇒ మంగళగిరిలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. 

⇒ వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం.                                                                                                                                                               
⇒ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.


ఆ దళారులు మీవాళ్లే కదా?
⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా
⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం
⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు
⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్‌ మార్కెట్‌ ఆరోపణల పాట

అధికారంలోకి రాగానే స్టాక్‌ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్‌ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. 

కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. 

ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్‌ మార్కెట్‌ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement