ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం–1982 స్థానంలో కొత్త చట్టం
జైలు శిక్ష, జరిమానా భారీగా పెంపు..కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు
డ్రోన్, సెమి కండక్టర్, డేటా సెంటర్ పాలసీలకు ఆమోదం
కుప్పం, పిఠాపురం అభివృద్ధికి ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలు
ఏపీసీఆర్‌డీఏ పరిధి 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెంపు
తక్కువ ధరకు మద్యం.. ఆర్డినెన్స్‌ల స్థానంలో ముసాయిదా బిల్లులు
టీడీపీ కార్యకర్తలకు ‘ఉపాధి’ బిల్లులు రూ.331 కోట్ల చెల్లింపునకు పచ్చజెండా
అవసరమైతే 12 శాతం వడ్డీతో ఇవ్వాలని చర్చ
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం –1982లో లొసుగులుండటంతో భూ కబ్జాలు పెరిగిపోతున్నందున ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చట్టం నగరీకరణ భూ కబ్జాలకే వర్తిస్తుందని.. శిక్షలు, జరిమానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరుపుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, లేదా ప్రైవేట్ భూముల ఆక్రమణలు చేసినట్లు తేలితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆక్రమణ చేసిన భూమి విలువతో పాటు నష్టపరిహారం (జరిమానా) కూడా విధిస్తారని చెప్పారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు మంత్రి మాటల్లోనే..
రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ
ఏపీ డ్రోన్ పాలసీతో పాటు సెమి కండక్టర్ పాలసీ, డేటా పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా 2024–29 డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ పాలసీ ద్వారా రూ.3 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా. డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు కేటాయింపు. డ్రోన్ స్కిల్ ఇన్‌స్టిట్యూట్, డ్రోన్ పైలెట్ శిక్షణ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు. తద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తారు.
రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షలు ప్రోత్సాహం. 2024–29 డేటా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–29 సెమి కండక్టర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమి కండక్టర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌కు 50% కేంద్రం కేపిటల్ సబ్సిడీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది.
టీడీపీ కార్యకర్తలకు ‘ఉపాధి’ నజరానా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2014–18 సంవత్సరాల మధ్య నామినేషన్‌పై పనులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.331 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, తదితర పనులు చేసిన చిన్న చిన్న కార్యకర్తలను ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లులు ఇవ్వలేదు.
చాలా మంది బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రభుత్వం ఎప్పుడైనా సరే తిరిగి విచారణ చేయొచ్చని చెప్పింది. నష్టపోయిన వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు 4.41 లక్షల పనులకు సంబంధించి రూ.331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం బకాయిలకు 12 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందనే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
మరిన్ని నిర్ణయాలు ఇలా..
⇒ జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు ఈ నెల 1వ తేదీ నుంచి వర్తించేలా 60 నుంచి 61 ఏళ్లకు పెంపు.
⇒ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల
సమగ్రాభివృద్ధికి కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీల ఏర్పాటు.
⇒ ఏపీసీఆర్‌డీఏ పరిధిని 8,352.69 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 1,069 చదరపు కిలోమీటర్లను, పల్నాడు జిల్లాలోని ఆరు మండలాల్లో 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో 62 గ్రామాలను ఏపీ సీఆర్‌డీఏ పరిధిలోకి తెచ్చారు. జాతీయ హైవేలను కలుపుతూ 189 కిలోమీటర్ల పొడవునా ఏపీ సీఆర్‌డీఏలో ఓఆర్‌ఆర్ నిర్మాణం.
⇒ పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ కేంద్రం 100 పడకలకు పెంపుతో పాటు 66 అదనపు పోస్టులు మంజూరు.
⇒ సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన నూతన మద్యం విధానం మూడు
ఆర్డినెన్స్‌ల స్థానే మూడు చట్టాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. జీఎస్‌టీ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకూ ఆమోదం.
⇒ సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల ఫీజు బకాయిలను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం.
⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టంలోని సెక్షన్–3లో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. 1990లో ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు, 2022లో ఒక రూపాయిగా ఉంది. ఈ డ్యూటీని చెల్లించకుండా న్యాయ స్థానాలకు వెళ్తున్నందున, బకాయిల వసూలుకు వీలుగా చట్టంలో సవరణలు.
⇒ ఏపీఐఐసీకి 50 ఎకరాల వరకు భూమి కేటాయింపునకు అనుమతివ్వడంతో పాటు ఏపీఐఐసీ చేసిన 311 భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment