K. Parthasarathy
-
భూ కబ్జాలపై కఠిన శిక్షలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం –1982లో లొసుగులుండటంతో భూ కబ్జాలు పెరిగిపోతున్నందున ప్రస్తుత చట్టాన్ని రద్దు చేసి, కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత చట్టం నగరీకరణ భూ కబ్జాలకే వర్తిస్తుందని.. శిక్షలు, జరిమానాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటవుతుందని, కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణ జరుపుతారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ, లేదా ప్రైవేట్ భూముల ఆక్రమణలు చేసినట్లు తేలితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆక్రమణ చేసిన భూమి విలువతో పాటు నష్టపరిహారం (జరిమానా) కూడా విధిస్తారని చెప్పారు. కేబినెట్ మరిన్ని నిర్ణయాలు మంత్రి మాటల్లోనే.. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా డ్రోన్ పాలసీ ఏపీ డ్రోన్ పాలసీతో పాటు సెమి కండక్టర్ పాలసీ, డేటా పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,000 కోట్లు పెట్టుబడి లక్ష్యంగా 2024–29 డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డ్రోన్ పాలసీ ద్వారా రూ.3 వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా. డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీకి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు కేటాయింపు. డ్రోన్ స్కిల్ ఇన్స్టిట్యూట్, డ్రోన్ పైలెట్ శిక్షణ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. తద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాల ఏర్పాటు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు. డ్రోన్ రంగంలో పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షలు ప్రోత్సాహం. 2024–29 డేటా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–29 సెమి కండక్టర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమి కండక్టర్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్‌కు 50% కేంద్రం కేపిటల్ సబ్సిడీ ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 30% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ కార్యకర్తలకు ‘ఉపాధి’ నజరానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. 2014–18 సంవత్సరాల మధ్య నామినేషన్‌పై పనులు చేసిన టీడీపీ కార్యకర్తలకు రూ.331 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, తదితర పనులు చేసిన చిన్న చిన్న కార్యకర్తలను ఆర్ధికంగా ఇబ్బందికి గురి చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పేరుతో బిల్లులు ఇవ్వలేదు. చాలా మంది బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రభుత్వం ఎప్పుడైనా సరే తిరిగి విచారణ చేయొచ్చని చెప్పింది. నష్టపోయిన వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చని కూడా తెలిపింది. ఈ మేరకు 4.41 లక్షల పనులకు సంబంధించి రూ.331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టం ప్రకారం బకాయిలకు 12 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందనే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ⇒ జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు ఈ నెల 1వ తేదీ నుంచి వర్తించేలా 60 నుంచి 61 ఏళ్లకు పెంపు. ⇒ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల సమగ్రాభివృద్ధికి కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు. ⇒ ఏపీసీఆర్డీఏ పరిధిని 8,352.69 చదరపు కిలో మీటర్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం. సత్తెనపల్లి మున్సిపాలిటీలోని 1,069 చదరపు కిలోమీటర్లను, పల్నాడు జిల్లాలోని ఆరు మండలాల్లో 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాల్లో 62 గ్రామాలను ఏపీ సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. జాతీయ హైవేలను కలుపుతూ 189 కిలోమీటర్ల పొడవునా ఏపీ సీఆర్డీఏలో ఓఆర్ఆర్ నిర్మాణం. ⇒ పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ కేంద్రం 100 పడకలకు పెంపుతో పాటు 66 అదనపు పోస్టులు మంజూరు. ⇒ సరసమైన ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన నూతన మద్యం విధానం మూడు ఆర్డినెన్స్‌ల స్థానే మూడు చట్టాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. జీఎస్టీ చట్ట సవరణ ముసాయిదా బిల్లుకూ ఆమోదం. ⇒ సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల ఫీజు బకాయిలను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం. ⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టంలోని సెక్షన్–3లో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. 1990లో ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆరు పైసలు, 2022లో ఒక రూపాయిగా ఉంది. ఈ డ్యూటీని చెల్లించకుండా న్యాయ స్థానాలకు వెళ్తున్నందున, బకాయిల వసూలుకు వీలుగా చట్టంలో సవరణలు. ⇒ ఏపీఐఐసీకి 50 ఎకరాల వరకు భూమి కేటాయింపునకు అనుమతివ్వడంతో పాటు ఏపీఐఐసీ చేసిన 311 భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం. -
సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: సీపీఎస్ రద్దు కోరుతూ సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వాయిదా పడింది. సెప్టెంబర్ 1న తలపెట్టిన ఛలో విజయవాడ, మిలియన్ మార్చ్ సభ వాయిదా పడ్డాయి. పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ విజయవాడ రావద్దని ఆయన కోరారు. ఆ రోజు స్థానిక కార్యాలయాల్లోనే నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. గత ఏడేళ్లుగా శాంతియుతంగానే సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. పోలీసుల అనుమతితోనే ఇప్పటివరకు వాటిని చేపట్టామన్నారు. అలాగే.. ఛలో విజయవాడ, మిలియన్ మార్చ్ పేరుతో నిర్వహించబోయే సభ, ర్యాలీకి కూడా పోలీసుల అనుమతి కోరామని తెలిపారు. కానీ, పోలీసులు ఏ నిర్ణయం చెప్పలేదన్నారు. మరోవైపు.. తమకు సంబంధంలేని ‘సీఎం ఆఫీసు ముట్టడి’ కార్యక్రమం పేరుతో ఏపీసీపీఎస్ఈఏ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను అడ్డుకున్నారని, కేసులు పెట్టారని తెలిపారు. నోటీసులు, బైండోవర్లు, ముందస్తు అరెస్టులతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారని పార్థసారథి పేర్కొన్నారు. దీంతో.. ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11కి వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చంద్రబాబు అప్పుల అప్పారావు
విజయవాడ సిటీ: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా దోచుకున్న సొమ్మును తిరిగి దొడ్డిదారిన ఇన్వెస్టర్ల రూపంలో అప్పుగా ఇచ్చి, దీర్ఘకాలం వడ్డీరూపంలో పొందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. ఆయన మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు రాష్ట రాజధానిని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాడని మండిపడ్డారు. స్వలాభం కోసం రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తాకట్టు పెట్టాడని విమర్శించారు. అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నాడని దుయ్యబట్టారు. విభజన చట్టం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం జరిగితే ముడుపులు రావని రూ.వేల కోట్లు దోచుకోవడానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. రాజధాని పేరుతో రూ.2,000 కోట్ల విలువైన బాండ్లను ప్రభుత్వం ఏ విధంగా జారీ చేసిందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10.32 వడ్డీకి రూ.2,000 కోట్లు సేకరించిందన్నారు. అది కూడా కేవలం తొమ్మిది మంది ఇన్వెస్టర్ల నుంచి గంటలోనే సేకరించిందంటే ఇదంతా చంద్రబాబు దోచుకున్న సొమ్మేనని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిన్న చిన్న మదుపరులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వేల మంది ఉన్నారని, వారి నుంచి రూ.10.32 శాతం వడ్డీకి అప్పులు తీసుకుంటే వారందరికీ మేలు జరిగేది కాదా? అని నిలదీశారు. బాండ్ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చేందుకు బ్రోకర్లను పెట్టుకొని వారికి రూ.17 కోట్లు అప్పనంగా చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 6,000 కోట్లు నొక్కేయడానికి కుట్ర ‘‘10.32 శాతం కంటే తక్కవ వడ్డీకి ప్రతిపక్షం అప్పులు ఇప్పించగలదా అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులకు సిగ్గుంటే.. చేతగాని దద్దమ్మలనే నిర్ణయానికి వస్తే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పదవుల నుంచి దిగిపోతే, 10.32 శాతం కంటే తక్కువకు రుణాలను సేకరించే దమ్ము ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉంది. చంద్రబాబును ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. అందుకే పాలన చివరి కాలంలో అందినకాడికి దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారు. నాలుగేళ్లు నిద్రపోయి రాజధానికి రూ.5,000 కోట్లు కూడా ఖర్చు చేసి శాశ్వత భవనం నిర్మించలేని ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ఆఖరి సంవత్సరంలో దాదాపు రూ.60,000 కోట్ల టెండర్లు పిలుస్తోంది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా టెండర్లు పిలిచి గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్టర్లకు 15 శాతం అడ్వాన్స్‌లు చెల్లించి, వారి నుంచి 10 శాతం ముడుపులు నొక్కేస్తున్నారు. రూ.60,000 కోట్లలో రూ.6,000 కోట్లు జేబుల్లో వేసుకోవడానికి చంద్రబాబు కుట్ర పన్నారు’’ అని కొలుసు పార్థసారథి ఆరోపించారు. -
ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది
సాక్షి, విజయవాడ సిటీ: బీసీలంటే సీఎం చంద్రబాబుకు ఎంత అలుసో మరోసారి తేటతెల్లమైందని.. ఆయన నిజస్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. బీసీలు, దళితులు హైకోర్టు జడ్జీలుగా పనికిరారంటూ చంద్రబాబు తప్పుడు నివేదికలు పంపారంటూ జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆధారాలతో సహా చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనే విషయాన్ని వైఎస్సార్సీపీ ఎప్పట్నుంచో చెబుతోందన్నారు. చంద్రబాబులో కులతత్వం ఏ స్థాయికి చేరుకుందో జస్టిస్ ఈశ్వరయ్య డాక్యుమెంట్లతో సహా నిరూపించారన్నారు. బీసీ వర్గానికి చెందిన జడ్జీలపై తప్పుడు ఆరోపణలు చేసి.. వారికి చెందాల్సిన అవకాశాలను చంద్రబాబు ఏ వి«ధంగా కాలరాశారో ఈశ్వరయ్య సవిరంగా వివరించారని చెప్పారు. బీసీలైన అమర్నాథ్గౌడ్, అభినవకుమార్తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులపై తప్పుడు నివేదికలు ఎందుకు పంపారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జడ్జీల నియామకాల్లో చంద్రబాబు పోషించిన పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీల్లో ఎవరినైనా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా గానీ, డిపార్ట్మెంట్ హెడ్లుగా గానీ నియమించావా? అని చంద్రబాబును ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్‌లోని ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబు గారి క్లాస్ అని.. అందులో లోకేశ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, ఎల్లో మీడియా మాత్రమే ఉంటాయన్నారు. కాగా, ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలతో సమావేశమైతే దానిపై ఎల్లో మీడియా దుష్పచారం చేసిందని పార్థసారథి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ వార్తలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా పోరాటం చేస్తామని పార్థసారథి తెలిపారు. ఇది ఏరకమైన జర్నలిజమని ఆయన ప్రశ్నించారు. -
‘బాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రహసనంగా మార్చేశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీలో చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలన్నారు. పోలవరంకు కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. పోలవరం విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు పాపాలను ప్రజలు భరించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలకు ఏపీ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వరా? రైతులకు నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను, ఉద్యోగులను, నష్టపోయిన రైతులను కలవాలంటే ఎందుకు ప్రభుత్వం భయపడుతోందని ఆయన నిలదీశారు. కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని పార్థసారధి ఘాటుగా విమర్శించారు. -
‘బాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలి’
-
టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి
విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో దొంగలను పట్టుకునే దమ్ము టీడీపీ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి వ్యాఖ్యానించారు. మహిళలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మల్లాది విష్ణుతో పాటు వందలాది మంది ఆయన అనుచరులు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం పార్థసారధి మాట్లాడుతూ.. ‘నేడు చాలా సంతోషకరమైన రోజు. దివంగత నేత వైఎస్ఆర్ గారి ప్రియ శిష్యుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరిక పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుంది. పార్టీ బలోపేతానికి మల్లాది విష్ణు కృషి చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్లీనరీతో టీడీపీ పతనం ప్రారంభమైంది. టీడీపీ అరాచక పాలనకు ఎప్పుడు సమాధి కడదామా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఐపీఎస్ అధికారిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసినా, మహిళలపై దాడులు చేసినా పట్టించుకోని టీడీపీది చేతకాని ప్రభుత్వమని’ విమర్శించారు. టీడీపీ అరాచక పాలన గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ‘మా పెన్షన్ తీసుకుంటున్నారు, మా రోడ్లపై నడుస్తున్నారు.. మాకు ఓట్లేయకపోతే కష్టాలు తప్పవంటూ’ ప్రజలపై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడే బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ ఎంత చేశారో, ఎంత మందికి పెన్షన్లు తీసివేశారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. డెంగ్యూ జ్వరాలతో ప్రజలు చనిపోతున్నా, కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం.. అభివృద్ధి పేరు చెప్పుకుని రియల్ ఎస్టేట్ కు భూములు కట్టబెట్టడం నిజం కాదా అని ఈ సందర్భంగా పార్థసారధి ప్రశ్నించారు. -
అందుకే చెల్లింపులు జరపడం లేదు: పార్థసారధి
విజయవాడ: ఏపీ ప్రభుత్వం కేవలం రూ. 170 కోట్లు తెలంగాణకు చెల్లిస్తే, కృష్ణాడెల్టాకు సాగునీటి సమస్య తప్పించే పులిచింతల ఉపయోగంలోకి వచ్చేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి తెలిపారు. పక్క రాష్ట్రానికి చెల్లింపులు జరిపితే, అందులో తమకు ముడుపులు రావనే ఉద్దేశంతోనే చెల్లింపులు జరపడం లేదని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముడుపుల కోసమే పట్టిసీమ చేపట్టారని, పట్టిసీమతో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయిన తరువాతే కృష్ణా డెల్టా రైతులకు నీళ్లు వచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వీలున్న పులిచింతలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మూడేళ్లుగా దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని వివమర్శించారు. -
పుష్కరాలనూ రాజకీయం చేస్తున్నారు : కె.పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పేరుతో ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన ఇంటి కార్యక్రమాల్లా చేస్తూ చంద్రబాబు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పంపడం బాబు రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎవరిని పడితే వాళ్లను పిలవచ్చా? అని నిలదీశారు. ప్రోటోకాల్ చంద్రబాబు ఇంటి వ్యవహారంలా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇది తప్పన్నారు. ఇన్విటేషన్ ఇచ్చినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాలేదని చెప్పి చంద్రబాబు దీన్నికూడా రాజకీయం చేస్తారని మండిపడ్డారు. సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం.. ఆఖరికి పుష్కరాలను కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పండుగలు, పుష్కరాలు ప్రతిసారీ వస్తాయి. సంప్రదాయానికనుగుణంగా చేసుకుంటాం. చంద్రబాబు పిలిచినా, పిలవకపోయినా పుష్కరాల్లో స్నానాలు చేస్తాం. కానీ అదేదో సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం’’ అని విమర్శించారు. -
'వైఎస్ జగన్ చలించిపోయారు'
-
'వైఎస్ జగన్ చలించిపోయారు'
హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు జడ్జితో విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఎందుకు ఆదేశించలేదని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైఎస్సార్ సీపీ నేతలు కె. పార్థసారధి, వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాల్ మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి మాఫియాకు కొమ్ముకాసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాల్ మనీ వ్యవహారం గురించి తెలియగానే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారని, తీవ్ర మనస్తాపం చెందారని చెప్పారు. రాజకీయాల కోసం ఇంతకు దిగజారతారా అని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాల్ మనీ బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు వైఎస్ జగన్ రాసిన బహిరంగ లేఖను పార్థసారధి, వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
‘హోదా’పై పోరాడుతోంది జగన్ మాత్రమే
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బదులిచ్చిన వైఎస్సార్సీపీ * మా అధ్యక్షుడు ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులను కలిశారు * ప్రత్యేకహోదాకోసం మంగళగిరిలో నిరసనదీక్ష చేశారు * మా పోరాటాలవల్లనే కొందరికైనా న్యాయం దక్కింది * ప్రత్యేకహోదా, పోలవరంపై మీరేం చేశారు? సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం చూస్తే... ఆయనకు రాజకీయం తెలియకపోయుండాలి లేదా దురుద్దేశమైనా ఉండాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తోందని రాహుల్ చేసిన విమర్శలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఎవరూ పట్టించుకోలేదు. ఏడాది కాలంలో ఒక్క అడుగు ముందుకు పడకున్నా మౌనముద్ర దాల్చారు. రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పోరాడింది మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ఇప్పటికి రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. మూడు నాలుగుసార్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాధ్సింగ్ను, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీనీ కలిసి విన్నవించారు. మంగళగిరిలో నిరసన దీక్ష చేపట్టారు. కేంద్రంలో మిత్రపక్షమే అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా ఎం దుకు సాధించలేకపోతున్నారని ముఖ్యమంత్రిని అనేకసార్లు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వెంటనే కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను వైదొలగాలని డిమాండ్ చేశారు’’ అని వివరించారు. ప్రత్యేక హోదాపై పార్లమెం ట్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏం పోరాటం చేసిందని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకసారైనా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. చంద్రబాబు వైఫల్యాలపై మాట్లాడరేం? ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడకుండా వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద ని పార్థసారధి తప్పుపట్టారు. ‘‘బీజేపీ పెద్దల అవినీతి అంశాలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలు మాత్రం రాహుల్‌కు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో కూరుకుపోయిన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడలేదు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీ తి కంపుకొడుతున్నా రాహుల్ కు కనబడలేదు.బాబు కారణంగానే పుష్కరాల్లో 30 మంది చనిపోయారని జాతీయ మీడియా కోడైకూసినా, 22 మంది తమిళులను బూటకపు ఎన్కౌంటర్లో చంపినా రాహుల్‌గానీ, సోనియాగానీ పార్లమెంట్లో ప్రస్తావనే తేలేదు’’ అని దుయ్యబట్టారు.దీన్ని బట్టి ఎన్నికల ముందు టీడీపీతో ఉన్న అక్రమ సంబంధాన్ని రాహుల్ ఇంకా కొనసాగిస్తున్నారని అర్థమవుతోందని విమర్శించారు. జగన్ పోరాటంతోనే కొందరికైనా న్యాయం ‘‘జగన్మోహన్రెడ్డి తణుకులో రైతు దీక్ష చే పడితేగానీ ప్రభుత్వం తొలిదశ రుణమాఫీ డబ్బు విడుదల చేయలేదు. ఆయన అల్టిమేటం జారీ చేస్తేగానీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించలేదు. మంగళగిరిలో దీక్ష చేపడితేగానీ డ్వాక్రా మహిళలకు కనీసం రూ. మూడు వేలైనా సాయం దక్కలేదు’’ అని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోవడంవల్ల ఇలాంటివన్నీ రాహుల్‌కు తెలిసి ఉండకపోవచ్చని పార్థసారధి విమర్శించారు. అనంతపురం జిల్లాలో వందమంది రైతులు చనిపోతే జగన్ మూడోవిడత భరోసాయాత్ర నిర్వహిస్తుంటే... రాహుల్ 14 నెలల తర్వాత నిద్రలేచారన్నారు. రాహుల్ పరామర్శ యాత్ర ఒక వంక మాత్రమేనన్నారు. సొంత సీఎం, మంత్రులు, నేతలందరూ విభజన వద్దని వారించినా వినని వారికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ఒక్కసీటు కూడ గెలవని కాంగ్రెస్, 67 సీట్లు గెలిచిన తమకు పోటీ పార్టీగా అస్సలు భావించడం లేదన్నారు. -
పట్టిసీమతో పోలవరానికి పాతర
వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ఆందోళన హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయటంతో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పలు అనుమానాలు అలుముకున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, సొంత పార్టీకి చెందిన రైతు నేతలు వ్యతిరేకిస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చేయకుండా పట్టిసీమపై అప్రజాస్వామికంగా ముందుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. అందరూ వద్దంటున్నా హడావుడిగా ముందుకే వెళుతున్నారంటే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి ముడుపులు స్వీకరించేందుకేనని ఆరోపించారు. తక్షణమే అన్ని పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి పోలవరంపై సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలియలేదా బాబూ? రాజధాని ప్రాంతం ఎంపిక, పట్టిసీమ నిర్మాణం తదితర అంశాల్లో ప్రతిపక్షాల మాటను సీఎం చంద్రబాబు లెక్క చేయకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. రాజధాని కట్టవద్దంటున్నారని, రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోపు పట్టిసీమ నిర్మించడమనేది అసలు సాధ్యమేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఓవైపు పోలవరం నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్న బాబు మరోవైపు కనీసం మూడేళ్లయినా పట్టే పట్టిసీమ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. -
పచ్చని పొలాలే కావాలా?
రాజధాని భూ సేకరణ తీరుపై వైఎస్సార్సీపీ నేత పార్థసారథి ధ్వజం * 80 శాతం మంది అంగీకరిస్తేనే భూ సేకరణ జరపాలి * లేదంటే వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుంది సాక్షి, హైదరాబాద్: పంటలు అంతగా పండని నాసిరకం భూములు అందుబాటులో ఉన్నా ఏడాది పొడవునా పచ్చని పంటలతో కళకళలాడే పొలాలనే రాజధాని నిర్మాణం కోసం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పొలాలను రైతుల నుంచి లాక్కుంటే వాటిపై ఆధారపడిన వేలాది మంది కూలీలు, కౌలు రైతులు, మత్య్సకారులు, కల్లు గీత కార్మికుల జీవనోపాధి ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల రైతులు తమ భూములు పోతాయేమోనని తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉన్నారని, తమకు అన్నం కూడా సహిం చడం లేదని, రాత్రిపూట నిద్ర కూడా కరవైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు తమవద్ద వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలని వివరించారు. భూములు లాక్కోవడానికి చట్టం తెస్తారా? 2014 నుంచి అమలులోకి వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం 80 శాతం మంది రైతులు సమ్మతిస్తే గాని ప్రభుత్వం భూసేకరణ చేయడానికి వీల్లేదని, దానినే ఇక్కడ అమలు చేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు. భూసేకరణకు ప్రస్తుతమున్న చట్టాన్నే అమలు చేస్తారా లేక తమ భూములను లాక్కోవడానికి చంద్రబాబు మళ్లీ ఏదైనా కొత్త చట్టం తెస్తారా! అని రైతులు హడలి పోతున్నారని ఆయన అన్నారు. ‘రైతులు అత్యాశకు పోతున్నారు.. అవసరమైతే భూసేకరణ చట్టాన్ని ప్రయోగించైనా భూములను తీసుకోవాల్సి వస్తుంది’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే బెదిరించడం రైతులను భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన అన్నారు. రైతులకు నచ్చజెప్పి వారిని సంతృప్తిపర్చే విధంగా ప్యాకేజీలు ఇచ్చి భూసేకరణ చేయాలే తప్ప వారి హక్కులను, ప్రయోజనాలను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే వైసీపీ వారికి అండగా నిలబడి పోరాడుతుందని పార్థసారథి హెచ్చరించారు. -
రైతులను బెదిరిస్తే ఊరుకోం
వైఎస్సార్సీపీ హెచ్చరిక ... రాజధాని నిర్మాణంపై సీఎం మాటలు గర్హనీయం హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల రైతులను సీఎం చంద్రబాబు బెదిరిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దని, అత్యాశకు పోతే అనర్థాలేనని చంద్రబాబు శుక్రవారం చేసిన ప్రకటన తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్ కావాలా లేక భూసేకరణ కావాలా? రైతులే నిర్ణయించుకోండి. భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తాం... లేదంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తాం...’ అని బాబు బెదిరించడం గర్హనీయమన్నారు. ఆయన మాట తీరు చూస్తూంటే ఏమాత్రం మారలేదనేది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అదేదో పోటా చట్టం మాదిరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం రైతులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని రైతులు తమ భూములకు మార్కెట్ విలువ కావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? అదే చంద్రబాబు వందిమాగధులు, ఆయన వర్గీయులు, తాబేదారులు ఎక్కువ ధరకు భూములను అమ్మకానికి పెడితే అత్యాశ కాదా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక చక్కటి రాజధాని కావాలనేది వైఎస్సార్సీపీ అభిమతమని, దాని నిర్మాణానికి తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని, అయితే రైతులను ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. వాస్తవానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 35 నుంచి 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, ముందుగా దానిని రాజధాని అవసరాల కోసం తీసుకుని ఆ తరువాత రైతుల భూముల గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. టీడీపీ నేతల ప్రకటనలు, భూసేకరణ కోసం వేసిన కమిటీ తీరును చూసినపుడు అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం మంచి రాజధాని నిర్మించడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తన వాళ్లందరికీ పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చడమేనన్నది వెల్లడవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఓట్లేయని లక్షలాది మంది పింఛన్లను ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా తొలగించారని తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో జన్మభూమి సభలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోతారంటూ ఆమె చేతిలో ఓటమిపాలైన వర్ల రామయ్య మాట్లాడ్డం అభ్యంతరకరమన్నారు. -
రీషెడ్యూలును అడ్డుకుంటున్నట్లు పదిరోజుల్లో నిరూపించండి
ఏపీ మంత్రులకు వైఎస్సార్సీపీ నేత పార్థసారథి సవాల్ నిరూపించకుంటే పదవి నుంచి తప్పుకోవాలి ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించండి రుణమాఫీ కోరినందుకు జగన్ బొమ్మలు తగులబెడతారా! వ్యవసాయ రుణాల రీషెడ్యూలును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు పది రోజుల్లో ఆ విషయాన్ని నిరూపించాలని, లేకుంటే ఆరోపణలు చేస్తున్న మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని పార్టీ సీనియర్ నేత కె.పార్థసారథి సవాలు విసిరారు. ఆదివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రిజర్వు బ్యాంకుకు జగన్మోహన్రెడ్డి తప్పుడు సమాచారం పంపుతున్నారని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, నిజంగా వారికి దమ్మూ, ధైర్యం ఉంటే వాటిపై వారికి ఇష్టం వచ్చిన ఏజెన్సీలతో విచారణ జరిపించి పది రోజుల్లోగా నిరూపించాలన్నారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలు, చేసిన సంతకాలు నిలబెట్టుకోలేక ఇపుడు జగన్‌పై నెపం వేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఏపీ మంత్రులతో మరిన్ని అబద్ధాలను చెప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతుల రుణమాఫీపై ప్రతిపక్షనాయకుడుగా జగన్ ప్రశ్నిస్తుంటే.. అధికారపక్షం ఎదురుదాడికి దిగుతోందన్నారు. సమావేశంలోని మరిన్ని విషయాలు ఆయన మాటల్లో.. ► కేంద్రంలో ఉన్నది టీడీపీ భాగస్వామ్యంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వమే, జాతీయ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసేవే కనుక నిజంగా జగన్ కలెక్టర్ నివేదికల పేరిట సమాచారం పంపి ఉంటే నిరూపించాలి. ► రైతులకు పెట్టుబడులు కావాల్సిన ప్రస్తుత తరుణంలో పాత రుణాలు చెల్లిస్తే గానీ బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వబోమంటున్నాయి. ఇదే విషయాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా తాము ప్రస్తావిస్తే మాపై అభాండాలు వేస్తారా? ► రుణమాఫీకి జగన్ అడ్డుపడుతున్నారని అనంతపురం జిల్లాలో చంద్ర దండు పేరుతో కొందరు బొమ్మలు ఎందుకు తగులబెడుతున్నారు. రుణమాఫీ చేయాలని జగన్ చెప్పడం తప్పా? ► అప్పులు కట్టొద్దని ఎన్నికల్లో టీడీపీ చేసిన ప్రచారం ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు చెల్లించలేదు. ఆరోజు ఇచ్చిన అబద్ధపు హామీ ఫలితంగానే ఈరోజు రైతులు రుణాలు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. రుణమాఫీ అని ఎన్నికల్లో చెప్పి ఇపుడు రీషెడ్యూలు గురించి మాట్లాడ్డం వింతగా ఉంది. ► రీషెడ్యూలు చేస్తే రైతుల బంగారం, డాక్యుమెంట్లు వారి చేతికి వెనక్కి వస్తాయా? వాస్తవానికి రీషెడ్యూలు మూడేళ్లు ఉంటుంది. ఏడాదికి 12 శాతం చొప్పున 36 శాతం వడ్డీ ఆ రుణంపై పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తానంటున్న లక్షన్నర రూపాయల రుణంపై ఏడాదికి రూ. 18 వేలు వడ్డీ అవుతుంది. అది మూడేళ్లకు రూ. 54 వేలవుతుంది. ఈ వడ్డీ ఎవరు కడతారు, ప్రభుత్వమా? రైతులా? తన పోరాటం వల్లే గతంలో యూపీఏ రుణాలు మాఫీ చేసిందని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ అదే నిజమైతే ఇపుడు ఏన్డీఏ ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదు. ► నారుమళ్లు వేసుకోవడానికే నీరు ఇవ్వలేని స్థితిలో ఉన్న చంద్రబాబు ఇక వ్యవసాయాన్ని పండుగ చేస్తాననడం హాస్యాస్పదమే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా డెల్టాకు జూన్, జూలై మాసాల్లోనే సాగునీరు ఇచ్చే వారని, ఇపుడు ఆగస్టు పదోతేదీ వస్తున్నా సాగునీరు వదిలే దిక్కు లేకుండా పోయింది. ► సాగునీటి మంత్రిగా ఈ విషయమై సిగ్గుపడాల్సింది పోయి ఆషాఢభూతిలాగా ఆరోపణలు చేస్తున్నారు. రుణ మాఫీ సంగతి తేల్చండి అధికారంలోకి వచ్చాక మీరు చేయాల్సిన పని చేయకుండా తమ పార్టీపై విమర్శలు చేయడమేంటని పార్థసారథి బాబును ప్రశ్నించారు. ‘ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రుణ మాఫీ చేయండి. రుణ మాఫీ చేయకుండా ఏదేదో మాట్లాడుతున్నారు? మధ్యలో ఈ ఆర్బీఐ గొడవెందు కు? ఆర్బీఐ ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో, కేంద్రం ఒప్పుకుంటేనే రుణ మాఫీ చేస్తామనో ఎన్నికల ముందు చెప్పలేదే? మీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలే ఎక్కడా చెప్పలేదే? ఎన్నికలకు ముందు ఈ షరతులేమీ చెప్పలేదే? ఇప్పుడు మాఫీ సంగతి మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు వ్యవహారమెందుకు? రాష్ట్రంలో రూ.87,612 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలుండగా, 35 కోట్ల మేరకే మాఫీ చేస్తామని చెప్పిందెవరు? మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని స్వయంగా మీరే కదా ప్రకటించింది. వైఎస్సార్సీపీ ఏదో ఫ్యాక్స్‌లు చేసిందని పచ్చి అబద్ధపు మాట లు చెప్పి ఎందుకు రైతులను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు? అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లబుచ్చుతూ నమ్మి ఓట్లేసిన రైతులందరినీ నట్టేట ముంచుతారా’ అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ డబ్బుకు అన్ని లెక్కలున్నాయి: పార్థసారధి
తన భార్య వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం నగదు జమ చేయాలని, మరి కొంత మొత్తాన్ని సొంతంగా నిర్వహిస్తున్న కనస్ట్రక్షన్ కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుంచి నగదుతో విజయవాడకు బయలుదేరారు. వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కమల వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి కె.పార్థసారథి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.