రైతులను బెదిరిస్తే ఊరుకోం | ysrcp leader pardhasarathi fire on tdp govt | Sakshi
Sakshi News home page

రైతులను బెదిరిస్తే ఊరుకోం

Published Sun, Oct 5 2014 2:04 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

రైతులను బెదిరిస్తే ఊరుకోం - Sakshi

రైతులను బెదిరిస్తే ఊరుకోం

వైఎస్సార్‌సీపీ హెచ్చరిక ... రాజధాని నిర్మాణంపై సీఎం మాటలు గర్హనీయం
 
హైదరాబాద్: రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ, గుంటూరు పరిసరాల రైతులను సీఎం చంద్రబాబు బెదిరిస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం భూసేకరణపై రైతులు అత్యాశకు పోవద్దని, అత్యాశకు పోతే అనర్థాలేనని చంద్రబాబు శుక్రవారం చేసిన ప్రకటన తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్ కావాలా లేక భూసేకరణ కావాలా? రైతులే నిర్ణయించుకోండి. భూమి ఇస్తే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరిస్తాం... లేదంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తాం...’ అని బాబు బెదిరించడం గర్హనీయమన్నారు. ఆయన మాట తీరు చూస్తూంటే  ఏమాత్రం మారలేదనేది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అదేదో పోటా చట్టం మాదిరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం రైతులను బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోని రైతులు తమ భూములకు మార్కెట్ విలువ కావాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా? అదే చంద్రబాబు వందిమాగధులు, ఆయన వర్గీయులు, తాబేదారులు ఎక్కువ ధరకు భూములను అమ్మకానికి పెడితే అత్యాశ కాదా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక చక్కటి రాజధాని కావాలనేది వైఎస్సార్‌సీపీ అభిమతమని, దాని నిర్మాణానికి తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని, అయితే రైతులను ఇబ్బందులు పెడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టంచేశారు.

వాస్తవానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 35 నుంచి 40 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, ముందుగా దానిని రాజధాని అవసరాల కోసం తీసుకుని ఆ తరువాత రైతుల భూముల గురించి ఆలోచిస్తే మంచిదని సూచించారు. టీడీపీ నేతల ప్రకటనలు, భూసేకరణ కోసం వేసిన కమిటీ తీరును చూసినపుడు అసలు ప్రభుత్వ ఉద్దేశ్యం మంచి రాజధాని నిర్మించడం కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి పోషించి తన వాళ్లందరికీ పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చడమేనన్నది వెల్లడవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఓట్లేయని లక్షలాది మంది పింఛన్లను ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా తొలగించారని తెలిపారు. పామర్రు నియోజకవర్గంలో జన్మభూమి సభలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేద్దామని వెళ్లిన తమ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరిపోతారంటూ ఆమె చేతిలో ఓటమిపాలైన వర్ల రామయ్య మాట్లాడ్డం అభ్యంతరకరమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement