పట్టిసీమతో పోలవరానికి పాతర
వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ఆందోళన
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయటంతో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పలు అనుమానాలు అలుముకున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, సొంత పార్టీకి చెందిన రైతు నేతలు వ్యతిరేకిస్తున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క చేయకుండా పట్టిసీమపై అప్రజాస్వామికంగా ముందుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
అందరూ వద్దంటున్నా హడావుడిగా ముందుకే వెళుతున్నారంటే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి ముడుపులు స్వీకరించేందుకేనని ఆరోపించారు. తక్షణమే అన్ని పార్టీలు, రైతు సంఘాలతో సమావేశం నిర్వహించి పోలవరంపై సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.
అప్పుడు తెలియలేదా బాబూ?
రాజధాని ప్రాంతం ఎంపిక, పట్టిసీమ నిర్మాణం తదితర అంశాల్లో ప్రతిపక్షాల మాటను సీఎం చంద్రబాబు లెక్క చేయకపోవడం దారుణమని పార్థసారథి విమర్శించారు. రాజధాని కట్టవద్దంటున్నారని, రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోపు పట్టిసీమ నిర్మించడమనేది అసలు సాధ్యమేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఓవైపు పోలవరం నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్న బాబు మరోవైపు కనీసం మూడేళ్లయినా పట్టే పట్టిసీమ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు.