వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని)
ప్రభుత్వానికి పేర్నినాని సూచన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిరర్థకమైన పట్టిసీమ పథకాన్ని పక్కన పెట్టి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై తక్షణమే దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్ చేశారు. చరిత్రాత్మకమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న పట్టిసీమ పథక నిర్మాణం అపహా స్యం పాలైందని విమర్శించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమ నిరర్థకమైనదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు రైతు సంఘాల నాయకులు ఘోషించినా చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు అదే నిజమైందని చెప్పారు.
రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్ట్ పంపులను తీసుకొచ్చి పట్టిసీమ వద్ద బిగించారని ఎద్దేవా చేశారు. గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళతామని, జగన్ దొడ్లోకి కూడా నీళ్లిస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, తీరా చూస్తే అది విఫలమైందని తెలిపారు. నదుల అనుసంధానం జరిగిందంటూ ప్రచార ఆర్భా టం చేశారని, వాస్తవానికి జరిగింది నిధుల అనుసంధానమేనని ధ్వజ మెత్తారు. ఏపీ నుంచి సింగపూర్‌కు, సింగపూర్ నుంచి ఏపీకి నిధుల అనుసంధానం జరిగిందని నాని దుయ్యబట్టారు.
కృష్ణా డెల్టాకు నీటిని తీసుకువెళ్లడానికి 12 వేల క్యూసెక్కుల అక్విడెక్టు అవసరమైతే, కేవలం 2500 క్యూసెక్కుల సామర్థ్యం గల అక్విడెక్టును హడావుడిగా నిర్మించారని విమర్శించారు. ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వెళ్లే గోదావరి నీటిని పట్టిసీమ పేరు చెప్పి పంపులతో తోడి పక్కదారిన సముద్రం లో కలిపినట్లుగా ఉందని ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు. పంపులకు సంబంధించిన అవి నీతిపై విచారణ జరిపి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని జల వనరుల శాఖ మంత్రి ప్రకటించడం విడ్డూరమన్నారు. అవినీతితో వారు జేబులు నింపుకొని, సిబ్బంది ని బలిపశువులను చేస్తున్నారన్నారు.