మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి. పక్కన బుగ్గన
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్ నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయానికి రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి అనుమతులు రానున్నాయన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ప్రధాని నియమించిన కమిటీ సమావేశం గురువారం ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాధన్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ ప్రకాశ్, హిమాన్షు కౌశిక్, రమణారెడ్డి హాజరయ్యారు.
అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందనుందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి సంబంధించిన అంశాలు పురోగతిలో ఉన్నాయన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించినప్పుడు ప్రధాని మోదీ ఒక కమిటీని నియమించారని గుర్తు చేశారు. ఈ కమిటీ రెండో సమావేశం గురువారం రెండున్నర గంటలకు పైగా సాగిందన్నారు. ప్రధానితో సీఎం జగన్ ఏ అంశాలైతే చర్చించారో అవే అంశాల పరిష్కారానికి ముందుకెళ్లేలా చర్చ జరిగిందని చెప్పారు.
కడప స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని కోరాం
‘తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి కేంద్ర కమిటీతో చర్చించాం. రేషన్ కార్డుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశాం. ఉమ్మడి ఏపీలో పౌర సరఫరాల సంస్థ విభజన అనంతరం ఏపీకి వచ్చింది.. దీంతో రుణ భారం ఆ సంస్థకు ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భాగాన్ని ఆ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరాం. అలాగే కడప స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించాలని విన్నవించాం. బీచ్ శాండ్ మినరల్స్ విషయంలో కేంద్రం నిబంధనల కారణంగా పరిశ్రమలు రావడం లేదని, వాటిని సడలించాలని కోరగా, సానుకూలంగా స్పందించారు.
ఏపీలో 26 జిల్లాలను ఏర్పాటు చేశాక 12 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు లేవు. వీటిలో ఆరు జిల్లాలు మాత్రమే కేంద్రం నిబంధనలకు అర్హత సాధించాయి. మిగిలిన ఆరు జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశాం. షెడ్యూల్డు కమర్షియల్ బ్యాంకుల్లో ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రుణ ప్రతిపాదనలను అనుమతించాలని కోరాం. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో కూలంకషంగా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. మొత్తం 11 అంశాలపై ఈ సమావేశంలో చర్చించాం.
ఆయా అంశాలకు సంబంధించిన కేంద్ర అధికారులంతా సమావేశానికి హాజరై సానుకూలంగా స్పందించారు. గతానికి, ఇప్పటికి చాలా అంశాల్లో పురోగతి సాధించాం. పోలవరం రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరాం. త్వరలోనే అవి వస్తాయి. పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత సమయానికే పూర్తవుతుంది. 14వ ఆర్థిక సంఘం సమయంలో చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా చేసిన అప్పులను రెగ్యులరైజ్ చేయాలని కోరాం. అలాగే రిసోర్స్ గ్యాప్ ఫండ్‌పై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం
రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ‘2015లో చిత్తశుద్ధి లేకుండా 2013–14 ధరల ప్రకారం, 2010–11 క్వాంటిటీ ప్రకారం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని అవివేకంతో నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు కట్టాలంటే కొన్నేళ్లు పడుతుంది. ఒక సంవత్సరం రేటుకే కట్టుబడి ఉంటే ప్రాజెక్టు ముందుకెలా వెళ్తుంది? దాని లోపాలు తొలగించడానికే ఇంత సమయం పట్టింది. చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేసి చేతులు కాల్చుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు.
విజయవాడలో కూర్చొని రాష్ట్రానికి సంబంధించినవి అడగలేకపోయారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రుల్ని కూర్చోబెట్టి కూడా పెండింగ్ అంశాలను సాధించలేకపోయారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ చొరవతో ఇవన్నీ పరిష్కారమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఢిల్లీకి వస్తున్నాం. కేంద్రం దగ్గరకు వచ్చి ఇది మాకు రావాల్సిన సాయం.. ఇది మా హక్కు అని అడుగుతున్నాం. అలా చేస్తున్నాం కాబట్టే ఒక్కొక్కటి పరిష్కారమవుతున్నాయి. ’ అని బుగ్గన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment