పుష్కరాలనూ రాజకీయం చేస్తున్నారు : కె.పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పేరుతో ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన ఇంటి కార్యక్రమాల్లా చేస్తూ చంద్రబాబు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పంపడం బాబు రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు.
ప్రొటోకాల్ ప్రకారం ఎవరిని పడితే వాళ్లను పిలవచ్చా? అని నిలదీశారు. ప్రోటోకాల్ చంద్రబాబు ఇంటి వ్యవహారంలా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇది తప్పన్నారు. ఇన్విటేషన్ ఇచ్చినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాలేదని చెప్పి చంద్రబాబు దీన్నికూడా రాజకీయం చేస్తారని మండిపడ్డారు.
సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం..
ఆఖరికి పుష్కరాలను కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పండుగలు, పుష్కరాలు ప్రతిసారీ వస్తాయి. సంప్రదాయానికనుగుణంగా చేసుకుంటాం. చంద్రబాబు పిలిచినా, పిలవకపోయినా పుష్కరాల్లో స్నానాలు చేస్తాం. కానీ అదేదో సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం’’ అని విమర్శించారు.