సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ప్రతిపక్ష టీడీపీలో మాత్రం ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గెలుపు గుర్రాలేవో, కుంటి గుర్రాలేవో తేల్చుకోలేక సతమతమవుతోంది. సీట్లు ఎవరికి ఇవ్వాలో తెలీక తలపట్టుకుంటోంది. ఈ నాలుగున్నరేళ్లూ చురుకై న పాత్ర పోషించడంలో సీనియర్ నాయకులు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో మళ్లీ వారికి టికెట్లిస్తే పుట్టి మునుగుతుందేమోనన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
వీళ్లకు ఈసారి డౌటే..?
కొంతమంది సీనియర్ నాయకులకు ఈసారి టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం నిరాకరిస్తోంది. ఇందులో తొలివరసలోకి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు తెలిసింది. కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా పెనుకొండ అసెంబ్లీ కాకుండా హిందూపురం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కృష్ణా జిల్లాకు పంపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వీళ్లకు హుళక్కేనా?
గుంతకల్లులో జితేందర్‌గౌడ్‌ను తప్పించి మరొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక.. శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ అనుమానంగా ఉంది. ధర్మవరం టికెట్ రేసులో ఉన్న పరిటాల శ్రీరామ్‌కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయి, బీజేపీలో చేరిన వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఉన్నారు. కళ్యాణదుర్గంలోనూ గతంలో పోటీచేసిన అభ్యర్థిని నిలపడం లేదు.
అనంతపురం అర్బన్ టికెట్ ఈసారి ప్రభాకర్ చౌదరికి లేదని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. కదిరిలో కందికుంట ప్రసాద్‌కు నకిలీ డీడీల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన భార్యకు టికెట్ ఇస్తే గెలుస్తుందా అన్న అనుమానంలో అధినాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా ఉందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాన్చుడు ధోరణి తమ మెడకు చుట్టుకుంటోందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
రూ.20 కోట్లు ఎక్కడ తేవాలి?
ఇటీవల జిల్లాలోని టీడీపీ ఓ నియోజకవర్గ నేత టికెట్ కోసం ప్రయత్నించగా రూ.20 కోట్లు ఉంటే చూపించు టికెట్ ఆలోచిస్తాం అని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. రూ.20 కోట్లు రెడీ చేసుకుంటేనే టికెట్ ఇస్తామని, లేదంటే వేరే ఆలోచిస్తామని తెగేసి చెప్పడంతో చాలామంది నాయకులు బెంబేలెత్తుతున్నారు.
రిజర్వుడు నియోజకవర్గ అభ్యర్థులకు కూడా డబ్బు రెడీ చేసుకుంటేనే టికెట్ ఉంటుందని చెబుతుండడంతో పోటీకి ముందుకొచ్చే అభ్యర్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్‌సీపీ చావుదెబ్బ కొట్టింది. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో ఇప్పటికీ కోలుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు వైఖరితో పార్టీ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయే దశకు చేరుకుంటోందని ఆ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు.
ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment