ఆయన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన గురువు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. గురువు అమరావతి పేరుతో ఐదేళ్ళ పాటు గ్రాఫిక్స్ ప్రపంచాన్ని సృష్టించి ఏపీ ప్రజల్ని భ్రమల్లో ముంచారు. అమరావతి పేరుతో చేసిన అవినీతి భాగోతాలు బయటకి వచ్చి కేసుల మీద కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోని ఆయన శిష్యుడు కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తానని చెబుతున్నారు. శిష్యుడు సృష్టించబోయే మాయా ప్రపంచం ఏంటో..ఆయన కథేంటో చూద్దాం.
అవినీతి కేసులో అరెస్టయి...బెయిల్ రాకపోవడంతో...కంటి వైద్యం కోసం తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గురించి అందరికీ తెలుసు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేయని నేరాలు, ఘోరాలు లేవు. అందరూ వద్దని చెప్పిన చోట అమరావతి పేరుతో 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేసి రాజధాని నిర్మించేందుకు పూనుకున్నారు. అయితే ఐదేళ్ళ పాటు అమరావతి పేరుతో దేశ దేశాలు పర్యటించి గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించి, 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఐదేళ్ళ కాలంలో వెయ్యి కోట్ల ఖర్చుతో అమరావతిలో ఆయన రెండు తాత్కాలిక భవనాలు భవనాలు మాత్రమే నిర్మించారు.
ప్రపంచ స్థాయి రాజధాని అంటూ జపాన్ నుంచి..సింగపూర్ వరకు..లండన్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఎన్నో దేశాల రాజధానుల తరహాలో అమరావతి నిర్మిస్తామని ప్రజల్ని ఊరించారు. చంద్రబాబు అవినీతిని సహించలేక జపాన్ కంపెనీ వాళ్ళు నీ ప్రాజెక్టు వద్దు..నువ్వు వద్దని ఆయన అవినీతి గురించి ఓపెన్‌గా చెప్పి వెళ్ళిపోయారు. ఇక సింగపూర్ కన్సార్షియం వాళ్ళు 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత వారంతట వారే అమరావతి గ్రాఫిక్స్ ప్రపంచం నుంచి తప్పుకున్నారు. సింగపూర్ కన్సార్షియంలో ప్రధాన భాగస్వామి అయిన అక్కడి మంత్రి ఈశ్వరన్ కొంతకాలం క్రితమే అవినీతి కేసులో మంత్రి పదవి పోగొట్టుకుని అరెస్టయ్యారు. మన చంద్రబాబుతో ఇలా ఉంటుంది మరి..
అమరావతి భూ సమీకరణ, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం..అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో పబ్లిక్ ప్రయివేటు పార్టిసిపేషన్ కింద ఇచ్చిన కాంట్రాక్టులు అన్నీ కూడా పెద్ద కుంభకోణాల కింద తేలాయి. వాటి మీద ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ఆరేళ్ళ క్రితం టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు. తర్వాత పీసీసీ చీఫ్ పదవి కూడా పొందాడు. రేవంత్ పాతిక కోట్లకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నాడని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే బహిరంగంగా ఆరోపించారు. ఇదంతా ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే దేశంలో పేరున్న ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి అక్కడ చెప్పిన మాటలు వింటుంటే..గురువునే మించిపోయాడని అర్థమవుతోంది. ఎంతైనా గురువు చంద్రబాబు కోసం... ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నాయకుడు కదా..?
హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహించే మూసీ నది దుర్గంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము అధికారంలోకి రాగానే...హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ నదిని జీవనదిలా మార్చి...వెనిస్ నగరంలో మాదిరిగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీలో అమరావతి నగరం మాదిరిగా పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్ కింద మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్ది..దాన్నొక టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తామని చెప్పారు. అమరావతిలా చేస్తే ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చుండదని...గ్లోబల్ టెండర్స్ ద్వారా మూసీలో వెనిస్ నగరాన్ని సృష్టిస్తామని చెప్పారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం..ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రేవంత్ ఇండియా టుడే వేదిక మీద చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు అమరావతి పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని గ్రాఫిక్స్‌లో సృష్టిస్తే...శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో మరో అమరావతి లాగా...మూసీ నది ప్రాజెక్టు పేరుతో ఇంకో భ్రమల ప్రపంచాన్ని సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఏతా వాతా తేలేదేమంటే...రేవంత్ గురువును మించిన శిష్యుడిగా ఎదిగిపోయారు. తనను కాంగ్రెస్‌లోకి పంపించి...ఇప్పుడు ఎన్నికల్లో తన కోసమే టీడీపీ అంతా పనిచేసేలా సహాయం చేస్తున్నందుకు గురువుకు కృతజ్ఞతగా ఆయనకు గురు దక్షిణ ఇచ్చేందుకు.. నమూనా మాయా ప్రపంచాన్ని తయారు చేయడానికి అవసరమైన అధికారం కోసం రేవంత్ ఎదురు చూస్తున్నారు.
Telangana Assembly Elections: బాబుది గ్రాఫిక్స్ ప్రపంచం.. రేవంత్‌ది భ్రమల లోకం
Published Mon, Nov 13 2023 10:04 AM | Last Updated on Tue, Nov 14 2023 11:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment