Telangana political
-
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలపై సైబర్‌దాడికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ శనివారం ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు అనర్హులని, ఈ మేరకు స్పీకర్‌కు సీఎం లేఖ రాయాలన్నారు. విపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో తెలిసినా.. ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడే యత్నాలు చేస్తోందనే చర్చతో ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిన్నదన్నారు. ఏఐసీసీకి రాష్ట్రం ఏటీఎంగా మారింది ఏఐసీసీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి, మెప్పించారు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయా కేసుల విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.దశాబ్ది వేడుకలకు సోనియాను ఆహా్వనించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన బీజేపీ నాయకులను ఎందుకు ఆహా్వనించలేదని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. -
Malkajgiri: అల్లుడి గెలుపు మల్లారెడ్డికి సవాల్
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం తాము నిలిపిన వాళ్లను గెలిపించాల్సిన బాధ్యత భుజస్కంధాలపై ఉండటం. వారు గెలవకపోతే తమ పరపతికి భంగం వాటిల్లుతుంది. ప్రతిష్ట మసకబారుతుంది. ఓవైపు పార్టీల పరంగా బాధ్యతలు, మరోవైపు తమ వారి గెలుపు వారికి సవాల్‌గా మారింది. ఇది కొందరి పరిస్థితి. ఇంకొందరు తాము పోటీ చేస్తున్న చోట గెలవడంతోపాటు మరోచోట తమ వారినీ గెలిపించాలి. ఇటు కృష్ణ యాదవ్.. అటు పూస రాజు.. ► బీజేపీలో జాతీయస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న నగరానికి చెందిన ఇద్దరు నేతలకు పెద్ద బాధ్యతలే ఉన్నాయి. నగరంలోని అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సెగ్మెంట్ అయిన అంబర్‌పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కేంద్రమంత్రిగా, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో తన నియోజవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు ఆయనకు సవాల్‌గా మారింది. ► ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన డా.కె. లక్ష్మణ్దీ దాదాపుగా ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పూస రాజుకు టికెట్ దక్కింది. పార్టీ ఓబీసీ మోర్చా చైర్మన్‌గా ఉన్న లక్ష్మణ్.. అదే విభాగంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న రాజుకు టిక్కెట్ ఇప్పించుకున్నారని పార్టీవర్గాల ప్రచారం. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత లక్ష్మణ్ మీద పడింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడుగానూ, రాజ్యసభ సభ్యుడుగానూ, ఇతరత్రానూ ఎన్నో కీలక స్థానాల్లో ఉన్న లక్ష్మణ్ తన నియోజకవర్గంలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన తప్పనిసరి స్థితి. ఇలా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు తమ జాతీయస్థాయి బాధ్యతల నిర్వహణతోపాటు తమ నియోజకవర్గాల్లో బరిలోని వారు గెలిచేందుకు కృషి చేయాల్సి ఉంది. ఆయనకు అదనపు బాధ్యతలు.. ఈయనకు అల్లుడి గెలుపు ► పోటీ చేస్తున్న తాము గెలవడంతో పాటు తమవారిని గెలిపించాల్సిన బాధ్యతలు బీఆర్ఎస్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డిలపై అదనంగా పడ్డాయి. కంటోన్మెంట్ నియోజవర్గంలోనే తన ఓటు ఉన్న మంత్రి తలసాని ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. కంటోన్మెంట్లో పోటీ చేస్తున్న లాస్య నందిత ఎమ్మెల్యేగా బరిలో దిగడం కొత్త. అధిష్ఠానం ఆమె గెలుపు బాధ్యతలు కూడా తలసానికి అప్పగించింది. ఇటు సనత్‌నగర్‌లో తాను గెలవాలి. అటు కంటోన్మెంట్లో ఆమెను గెలిపించాలి. ► అలాగే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మంత్రి మల్లారెడ్డిపై పడింది. బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీని వీడిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ గెలుపు పార్టీ అధిష్థానానికే సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో మేడ్చల్‌లో అల్లుడి గెలుపు మల్లారెడ్డికి అనివార్యంగా మారింది. మేడ్చల్‌లో తాను గెలవడంతోపాటు అల్లుణ్ని గెలిపించడం మల్లారెడ్డికి పెను సవాల్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఇలా.. ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్‌ఖేరా భార్య కోటా నీలిమ సనత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాతీయస్థాయిలో కీలకస్థానంలో ఉన్న ఆయనకు తన భార్యను గెలిపించుకోవడం సవాల్‌గా మారింది. -
పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు
కరీంనగర్/పెగడపల్లి: ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజికవర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు. కూడికలు.. తీసివేతలు అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్లలో ఏఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములు నిర్దారించే పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ టీం తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజికవర్గాన్ని గుర్తించి వారి మద్దతును తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో 40 నుంచి 45శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయపక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కులపెద్దలతో మంతనాలు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని అప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హమీలిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెల గారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుతుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది. సమయం లేక అభ్యర్థుల అవస్థలు అసలే మాఘి పొద్దు. పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్ప నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు. కార్యకర్తలపైనే ఆధారం ప్రచారానికి సమయం లేకపోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే. -
రాజన్న మీ దగ్గర ఎట్టున్నదే
పెగడపల్లి(ధర్మపురి): పొద్దంతా చేనులో కట్టం చేసి వచ్చిన మల్లన్న పక్క ఊర్లో ఉంటున్న తన సోపతి రాజన్నకు ఫోన్ చేసి ఎలచ్చన్ల గురించి మాట్లాడుతున్న మాటమంతి ఇలా ఉంది. మల్లన్న: ఏం రాజన్న ఎట్లున్నవ్ అంతా మంచిదేనా..? రాజన్న: ఆ మల్లన్న మంచిగున్నానే...నువ్వు ఎట్లున్నవ్.. మల్లన్న: ఆ మంచిగనే ఉన్నా..బాగా రోజులైంది నీతో మాట్లాడక. ఎం జేస్తున్నవు ఏందీ? రాజన్న: ఇప్పుడే చేన్లకు పోయి ఇంటికచ్చిన. ఎల్లచ్చన్లు అచ్చినయ్ కదా. రాత్రికి ఒక నలుగురం కలిసి మంచి చెడూ మాట్లాడుకునుడే ఇంకేముంది. మల్లన్న: ఎలచ్చన్లు ఏంటో రాజన్న..ఎప్పుడూ సూడని సిత్రాలు సూస్తున్నాం. గీ నాయకులు కాళ్లు కడుగుతుండ్రు. బజ్జీలు జేత్తుండ్రు. ఇంటికొచ్చి ఇసీ్త్ర చేస్తుండ్రు, బీడీలాకు కత్తిరిస్తుండ్రు, పొయ్యికాడికచ్చి రొట్టెలు జేత్తుండ్రు. పోరగండ్లకు తానం పోత్తుండ్రు. పచారంలా దప్పులు కొడుతుండ్రు.. అబ్బబ్బ ఎన్నడూ సూడని సిత్రాలు ఎలచ్చన్ల పుణ్యమాని సూస్తున్నాం. రాజన్న: ఔనూ మల్లన్నా.. గీ నాయకులు ఓట్ల కోసం ఏమైన సేసేటట్లు ఉన్నరు. నమ్మబుద్ధవ్వట్లేదు కదా.. మల్లన్న: అవు రాజన్న..గెలిసేదాక ఒక్కటే..గెలిపించాక ఇంకొక్కటి వీల్ల తరికా.. సూడనోల్లమా మనం.. సిన్నగున్నప్పటి నుంచి సూస్తున్నవే కదా. రాజన్న: అవు మల్లన్న..గిసుంటి పనులు సేయడంలో నాయకులను మించినోళ్లు లేరు గదా. మల్లన్న: సరే గానీ రాజన్న..మీ దగ్గర ఎట్టున్నదే.. (ఏ పార్టీ హవా నడుస్తున్నది). రాజన్న: ఏం చెప్పస్తలేదు మల్లన్న. అందరూ వస్తుండ్రు, పోతుండ్రు. ఎవ్వల్లస్తరో(గెలుస్తరో) సమజయితలేదు. మల్లన్న: అవునా..(నవ్వతూ) ఎవరైన రానీ..ఎవరిని నారాజ్ చేయొద్దు మనం. సూద్దాం ఇంకో వారం ఆగితే అంతా కుల్లావుతది గదా. రాజన్న: సరే మల్లన్న. రాత్రి అయింది. బుక్కెడు బువ్వ తిని పడుకుంటా.. మల్లన్న: సరే రాజన్న ఉంటా మరి. -
డిపాజిట్ గల్లంతు అంటే..
సాక్షి, పెద్దపల్లి: ఎన్నికల్లో అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు డిపాజిట్ కూడా రాదంటూ విమర్శిస్తుండం నిత్యం వింటూ ఉంటాం. మరి డిపాజిట్ గల్లంతు అంటే ఏమిటో.. మనలో చాలామందికి తెలియదు.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారంతోపాటు నిర్ణీత డిపాజిట్ (ధరావతు) చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. సాధారణంగా ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో ఆరోవంతుకు మించిన ఓట్లు పోటీచేసిన అభ్యర్థులకు వస్తేనే సదరు అభ్యర్థికి చెల్లించిన డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. లేదంటే ఆ డిపాజిట్‌ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమయ్యాకే అర్హులైన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. -
ఎల్బీనగర్, మహేశ్వరంలలో బోణీ కొట్టని బీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ.. నగర శివారు రంగారెడ్డి జిల్లాలోని ఆ రెండు స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేక పోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ మహేశ్వరం, ఎల్బీనగర్లలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీ అభ్యర్థులు గెలువలేకపోయారు. ఈసారైనా ఇక్కడ బోణీ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా ఈ స్థానాలను కీలకంగా తీసుకుంది. మహేశ్వరంలో గులాబీ గుబాళించేనా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చోటుచేసుకున్న పలు రాజకీయ సమీకరణాలతో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఇప్పటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందలేదు. ఈ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ బోణీ కొడుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్లో జెండా ఎగిరేనా.. అప్పటి వరకు మలక్‌పేట్ నియోజకవర్గంలో అంతర్భాంగంగా ఉన్న ఎల్బీనగర్ 2009లో కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టీడీపీ నుంచి ఎస్వీ కృష్ణ ప్రసాద్‌లు పోటీ చేశారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నిక (2014 ఎన్నిక)ల్లో కాంగ్రెస్ నుంచి సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు పోటీ చేశారు. ఆర్. కృష్ణయ్య విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌ను వీడి అధికార బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. -
మైనంపల్లి రోహిత్ మాటలకు అర్థాలే వేరులే..!
మెదక్: కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్‌రావు మాటలకు అర్థాలే వేరులే.. అనే విధంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తాను గెలిస్తే రోజుకు 48 గంటల కరెంటు ఇస్తాననడంతో ఇదేం చోద్యం రోజుకు 24 గంటలే కదా ఉన్నది.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు. అలాగే, మెదక్ నియోజకవర్గంపై కనీస అవగాహన కూడా లేకుండా ఆయన మాట్లాడుతుండడంతో సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తక్షణం నియోజకవర్గ ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ, రోహిత్‌రావు ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని పలువురు వాపోతున్నారు. ప్రచారంలోనూ ప్రజలపై మండిపడుతూ నేను చెప్పిందే వినాలని అనే విధంగా అసహనం వ్యక్తం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎమ్మెల్యేగా ఎన్నికై తే ఇంకెలా మాట్లాడుతారో అని ప్రజలు విమర్శిస్తున్నారు. జింకలు తరలించారంటూ గగ్గోలు హవేళిఘణాపూర్ మండలం పోచారం అభయారణ్యంలో 120 ఎకరాల్లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం విస్తరించి ఉంది. ఇందులో జింకల సంఖ్య ఒక పరిమితి వరకు మాత్రమే ఉంచుతారు. ఆ పరిమితి దాటితే వాటిని ఇక్కడి నుంచి వివిధ అటవీ ప్రాంతాలకు తరలిస్తారు. ఒకవేళ తరలించకుంటే వాటి సంఖ్య పెరిగి ఆహారం దొరక్క చనిపోతాయి. ఇటీవల ఈ ప్రత్యుత్పత్తి కేంద్రం నుంచి కొన్ని సిద్దిపేట జిల్లాలోని ఆక్సిజన్ పార్కుకు తరలించినట్లు తెల్సింది. దీనిపై రోహిత్‌రావు మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు జింకలను సైతం వదలకుండా ఇక్కడి నుంచి తరలించాడంటూ వ్యాఖ్యలు చేశాడు. పార్కులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఏంటని, ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంపై ఎలా పట్టు సాధిస్తాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. -
ఆమెకు అవకాశం ఏది?
అలంపూర్: మహిళలు మహారాణులు అంటూ కీర్తిస్తుంటాం. పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తాం అంటారు. విద్య, ఉద్యోగాల్లో ప్రస్తుతం మహిళలు రాణిస్తున్నా.. రాజకీయాల్లో మాత్రం వారికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కడం లేదు. ద్వితీయ శ్రేణి పదువుల్లో మహిళలు అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ వంటి చట్టసభలు చేసే కీలక పదవుల్లో మహిళలు రాణించలేకపోతున్నారు. కొన్ని సార్లు మహిళలు బరిలో నిలిచినప్పటికి ఫలితాలు తక్కువగానే వస్తున్నాయి. ఈ ఏడాది సెప్టంబర్లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఏకగ్రీవంగా అమోదించింది. ఈ బిల్లు ఆధారంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం దక్కుతుంది. బిల్లు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్ధి మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిళలు పోటీపడినా రెండవ స్థానానికి పరిమితం అయ్యారు. ఇలా నామినేషన్.. అలా విత్‌డ్రా ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో అలంపూర్ అసెంబ్లీ స్థానంలో మహిళా అభ్యర్థులు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయదలిచిన అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయిజకి చెందిన మేరమ్మ బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అయిజ మండలం సంకాపురానికి చెందిన ప్రేమలత బీఆర్ఎస్, తెలంగాణ రాజ్య సమితి పార్టీ, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదిన జరిగిన నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం మేరమ్మ స్వతంత్ర అభ్యర్ధిగా, ప్రేమలత తెలంగాణ రాజ్య సమితి తరపున వేసిన నామినేషన్లు స్వీకరించారు. కానీ అనుహ్యంగా ఈ నెల 15వ తేదిన తమ నామినేషన్లను ఇద్దరు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు పేర్లు ఎక్కడ కనిపించకుండా పోయాయి. -
పోటీలో లేని గద్వాల జేజమ్మ
సాక్షి, నాగర్‌కర్నూల్: దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న ఉమ్మడి పాలమూరులోని సీనియర్ రాజకీయ నేతలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల పాటు ఎన్నికల పోరులో తలపడుతూ వచ్చిన పలువురు రాజకీయ ఉద్దండులు అనూహ్యంగా ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. మారిన పరిస్థితులకు అనుగుణంగా వీరంతా ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. గద్వాల ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ గద్వాల ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన డీకే అరుణ ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోగా.. సమజ్వాదీ పార్టీ అభ్యర్థిగా 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి గెలుపొందారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా, అనంతరం బీజేపీలో చేరారు. ఆపార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొ నసాగుతున్నారు. అయితే అ నూహ్యంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె దూ రంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇ ప్పుడు బరి నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. చివరి నిమిషంలో జిల్లెల చిన్నారెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్న జిల్లెల చిన్నారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి 1989, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించినా చివరి నిమిషంలో అభ్యర్థిత్వంలో మార్పు చేసింది. ఆయన స్థానంలో మరో నేత మేఘారెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో వెలుగొందిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా బరి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. కందనూలు పోరుకు నాగం వీడ్కోలు.. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో 1983 నుంచి సుమారు 40 ఏళ్లుగా ఎన్నికల బరిలో నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. 1983లో వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాగం కందనూలుతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. టీడీపీ అభ్యర్థిగా 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 ఉపఎన్నికలోనూ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. ఈ అనూహ్య పరిణామానికి కలత చెందిన నాగం కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మరో కాంగ్రెస్ నేత చింతలపల్లి జగదీశ్వరరావు ఈసారి ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. 2009లో టీడీపీ నుంచి బరిలో ఉన్న ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై 1508 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2012 ఉప ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించగా, జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించడంతో జగదీశ్వరరావు పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. -
207 నామినేషన్ల తిరస్కరణ
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో భాగంగా అధికారులు సవ్యంగా లేని 207 నామినేషన్లను తిరస్కరించారు.15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్క్రూటినీ అనంతరం 332 మంది అభ్యర్థులు అర్హత పొందారు. మొత్తం 435 మంది నామినేషన్లు దాఖలు చేయగా సవ్యంగా లేకపోవడంతో 103 మందిని అనర్హులుగా గుర్తించారు. ముషీరాబాద్‌నుంచి 33 మంది, మలక్‌పేట నుంచి 27మంది, అంబర్‌పేట నుంచి 20 మంది,ఖైరతాబాద్ నుంచి 27 మంది, జూబ్లీహిల్స్ నుంచి 20మంది, సనత్‌నగర్ నుంచి 18 మంది, కార్వాన్‌నుంచి 21మంది, గోషామహల్‌నుంచి 24 మంది,చార్మినార్ నుంచి 14 మంది, చాంద్రాయణగుట్ట నుంచి 17 మంది, యాకుత్‌పురా నుంచి 27 మంది, బహదూర్‌పురా నుంచి 12 మంది, సికింద్రాబాద్ నుంచి 27 మంది అభ్యర్థులుగా మిగిలారు. రంగారెడ్డి జిల్లాలో 33 జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల నుంచి 280 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వివరాలు సరిగా లేని 33 నామినేషన్లను తిరస్కరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 4, మహేశ్వరంలో 3, షాద్‌నగర్‌లో 3, చేవెళ్లలో 4, కల్వకుర్తిలో 1, ఎల్బీనగర్లో 5, శేర్లింగంపల్లిలో 6, రాజేంద్రనగర్‌లో ఏడుగురి నామినేషన్లు తిరస్కరించారు. మేడ్చల్‌లో 71 మేడ్చల్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 261 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా స్క్రూటినీలో 71 మంది నామినేషన్లు తిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు -
బాబుది గ్రాఫిక్స్ ప్రపంచం.. రేవంత్‌ది భ్రమల లోకం
ఆయన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన గురువు ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు. గురువు అమరావతి పేరుతో ఐదేళ్ళ పాటు గ్రాఫిక్స్ ప్రపంచాన్ని సృష్టించి ఏపీ ప్రజల్ని భ్రమల్లో ముంచారు. అమరావతి పేరుతో చేసిన అవినీతి భాగోతాలు బయటకి వచ్చి కేసుల మీద కేసులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోని ఆయన శిష్యుడు కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తానని చెబుతున్నారు. శిష్యుడు సృష్టించబోయే మాయా ప్రపంచం ఏంటో..ఆయన కథేంటో చూద్దాం. అవినీతి కేసులో అరెస్టయి...బెయిల్ రాకపోవడంతో...కంటి వైద్యం కోసం తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి గురించి అందరికీ తెలుసు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చేయని నేరాలు, ఘోరాలు లేవు. అందరూ వద్దని చెప్పిన చోట అమరావతి పేరుతో 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేసి రాజధాని నిర్మించేందుకు పూనుకున్నారు. అయితే ఐదేళ్ళ పాటు అమరావతి పేరుతో దేశ దేశాలు పర్యటించి గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించి, 2019 ఎన్నికల్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఐదేళ్ళ కాలంలో వెయ్యి కోట్ల ఖర్చుతో అమరావతిలో ఆయన రెండు తాత్కాలిక భవనాలు భవనాలు మాత్రమే నిర్మించారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ జపాన్ నుంచి..సింగపూర్ వరకు..లండన్ నుంచి ఇస్తాంబుల్ వరకు ఎన్నో దేశాల రాజధానుల తరహాలో అమరావతి నిర్మిస్తామని ప్రజల్ని ఊరించారు. చంద్రబాబు అవినీతిని సహించలేక జపాన్ కంపెనీ వాళ్ళు నీ ప్రాజెక్టు వద్దు..నువ్వు వద్దని ఆయన అవినీతి గురించి ఓపెన్‌గా చెప్పి వెళ్ళిపోయారు. ఇక సింగపూర్ కన్సార్షియం వాళ్ళు 2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత వారంతట వారే అమరావతి గ్రాఫిక్స్ ప్రపంచం నుంచి తప్పుకున్నారు. సింగపూర్ కన్సార్షియంలో ప్రధాన భాగస్వామి అయిన అక్కడి మంత్రి ఈశ్వరన్ కొంతకాలం క్రితమే అవినీతి కేసులో మంత్రి పదవి పోగొట్టుకుని అరెస్టయ్యారు. మన చంద్రబాబుతో ఇలా ఉంటుంది మరి.. అమరావతి భూ సమీకరణ, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం..అమరావతిలో స్విస్ ఛాలెంజ్ పేరుతో పబ్లిక్ ప్రయివేటు పార్టిసిపేషన్ కింద ఇచ్చిన కాంట్రాక్టులు అన్నీ కూడా పెద్ద కుంభకోణాల కింద తేలాయి. వాటి మీద ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన గ్రాఫిక్స్ మాయాజాలం గురించి ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి ఆరేళ్ళ క్రితం టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాడు. తర్వాత పీసీసీ చీఫ్ పదవి కూడా పొందాడు. రేవంత్ పాతిక కోట్లకు పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నాడని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే బహిరంగంగా ఆరోపించారు. ఇదంతా ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే దేశంలో పేరున్న ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి అక్కడ చెప్పిన మాటలు వింటుంటే..గురువునే మించిపోయాడని అర్థమవుతోంది. ఎంతైనా గురువు చంద్రబాబు కోసం... ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నాయకుడు కదా..? హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహించే మూసీ నది దుర్గంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాము అధికారంలోకి రాగానే...హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ నదిని జీవనదిలా మార్చి...వెనిస్ నగరంలో మాదిరిగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీలో అమరావతి నగరం మాదిరిగా పబ్లిక్ ప్రయివేట్ పార్టిసిపేషన్ కింద మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్ది..దాన్నొక టూరిస్ట్ స్పాట్‌గా మారుస్తామని చెప్పారు. అమరావతిలా చేస్తే ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చుండదని...గ్లోబల్ టెండర్స్ ద్వారా మూసీలో వెనిస్ నగరాన్ని సృష్టిస్తామని చెప్పారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం..ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని రేవంత్ ఇండియా టుడే వేదిక మీద చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు అమరావతి పేరుతో ఒక మాయా ప్రపంచాన్ని గ్రాఫిక్స్‌లో సృష్టిస్తే...శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో మరో అమరావతి లాగా...మూసీ నది ప్రాజెక్టు పేరుతో ఇంకో భ్రమల ప్రపంచాన్ని సృష్టించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏతా వాతా తేలేదేమంటే...రేవంత్ గురువును మించిన శిష్యుడిగా ఎదిగిపోయారు. తనను కాంగ్రెస్‌లోకి పంపించి...ఇప్పుడు ఎన్నికల్లో తన కోసమే టీడీపీ అంతా పనిచేసేలా సహాయం చేస్తున్నందుకు గురువుకు కృతజ్ఞతగా ఆయనకు గురు దక్షిణ ఇచ్చేందుకు.. నమూనా మాయా ప్రపంచాన్ని తయారు చేయడానికి అవసరమైన అధికారం కోసం రేవంత్ ఎదురు చూస్తున్నారు. -
TS: తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి...
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరగా.. సిట్టింగ్‌లకే టికెట్లు అన్న ప్రకటన మేరకు కేసీఆర్ బీఫామ్‌లు ఇచ్చారు. దీంతో తొలిసారిగా కారు గుర్తుపై పోటీ చేయనున్నారు. ► కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పలు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఒకసారి వైఎస్సార్సీపీ నుంచి, మిగతా అన్నిసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి గెలిచాక బీఆర్ఎస్లో చేరారు. తొలిసారి కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. ► పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు 2009, 2018లో పినపాక అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఈసారి అదే పార్టీ నుంచి కారు గుర్తు పై పోటీ చేస్తున్నారు. ► ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఆమె గులాబీ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ► అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లో కారు గుర్తుపై తొలిసారి పోటీలో ఉన్నారు. ► సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలవగా, అనంతరం పరిణామాల్లో బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఆయన సైతం బీఆర్ఎస్ నుంచి పోటీకి దిగుతున్నారు. ► పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. అనంతరం బీఆర్ఎస్ గూటికి చేరగా.. ఈసారి ఆయన సిట్టింగ్ కోటాలో బీఆర్ఎస్ బీఫామ్ దక్కించుకున్నారు. ► వైరా నుంచి లావుడ్యా రాములునాయక్ ఇండిపెండెంట్‌గా గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయనకు ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా టికెట్ అందుకున్న బానోతు మదన్‌లాల్ తరఫున ప్రచారంలో నిమగ్నమయ్యారు. పినపాక నుంచి గత ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ తరఫున, పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఈసారి మారిన పరిణామాల నేపథ్యాన వారిద్దరి కండువాలు తారుమారు కాగా.. మళ్లీ ప్రత్యర్థులుగానే బరిలో ఉన్నారు. ఇల్లెందు అసెంబ్లీ స్థానం నుంచి కూడా పాత అభ్యర్థులే పోటీ చేస్తున్నా పార్టీలు మాత్రం మారాయి. గత ఎన్నికల్లో బానోతు హరిప్రియ కాంగ్రెస్ నుంచి, కోరం కనకయ్య బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత హరిప్రియ బీఆర్ఎస్లోకి రాగా, ఇటీవల కనకయ్య కాంగ్రెస్ గూటికి చేరారు. ఇలా ఈసారి మళ్లీ ఇద్దరు పోటీ పడుతున్నప్పటికీ పార్టీలు వేర్వేరు కావడం విశేషం. -
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా !
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొంతకాలంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందస్తు ఎన్నికల మీద చేసిన వ్యాఖ్యలు ఆయా పార్టీల్లో కొత్త చర్చకు తెరలేపాయి. మరునాడు కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేపట్టిన మౌనదీక్ష అనంతరం ముందస్తు విషయం లేవనెత్తడం.. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. వాస్తవానికి కరీంనగర్ ప్రజలకు ముందస్తు ఎన్నికలు కొత్తేం కాదు. అదే విషయాన్ని ఇక్కడ వివిధ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తమ పార్టీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కంచుకోట అని.. అనేకసార్లు రాజీనామా చేసినా తమను ప్రజలు బ్రహ్మరథం పట్టి తిరిగి గెలిపించుకున్నారని టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉపఎన్నికలు వచ్చినా.. విజయం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎమ్మెస్సార్ వ్యాఖ్యలతో.. ► ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ కరీంనగర్. ప్రస్తుత సీఎం కేసీఆర్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండుచోట్ల గెలిచిన అనంతరం సిద్దిపేట శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ ఎంపీగా, అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. ► 2006లో తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలో తెలంగాణ విషయంలో ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలతో అప్పటి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెస్సార్ సవాలుతో స్పందించిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. 2006లో భారీ మెజార్టీతో గెలిచారు. 2008లో రెండోసారి రాజీనామాతో మెజారిటీని బాగా తగ్గించుకున్నారు. ఈ రెండు దఫాలు అప్పటి మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సమీప ప్రత్యర్థిగా నిలబడటం గమనార్హం. బండి వర్సెస్ గంగుల..! ► ఉమ్మడి రాష్ట్రంలోనూ కరీంనగర్ జిల్లా రాజకీయాలు ప్రభావం చూపించేవి. తెలంగాణ వచ్చాక.. కరీంనగర్ మరింత కీలకమైంది. సూటిగా చెప్పాలంటే రాజకీయ కేంద్రంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 2006లో ఎంపీ కేసీఆర్, మంత్రి సత్యనారాయణ మధ్య మాటలపోరు ఏపీలో రాజకీయ వేడిని పెంచింది. ► ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం కూడా ఆనాటి పరిస్థితులను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. ► నాడు కేసీఆర్–ఎమ్మెస్సార్లవి, నేటి మంత్రి గంగుల–ఎంపీ బండిలది కూడా ఒకే సామాజిక వర్గమని వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే అప్పటి ఎమ్మెస్సార్ పాత్రను ప్రస్తుతం బండి సంజయ్ పోషిస్తున్నాడని అభివర్ణిస్తున్నారు. ►ఓవైపు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అంగీకరిస్తే తాము సిద్ధమేనని.. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనని బండి సంజయ్ ఘంటాపథంగా చెప్తున్నారు. మరోవైపు తీరా తాము ప్రభుత్వం రద్దు చేస్తే.. ఎన్నికల విషయంలో మాట మార్చరన్న గ్యారెంటీ ఏంటి? అని మంత్రి గంగుల ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ‘మోదీని ముందు ఎన్నికల తేదీని ప్రకటించమనండీ.. మా సీఎం కూడా నిర్ణయం తీసుకుంటారు’ అని కమలాకర్ ఎదురుదాడికి దిగడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి సవాలుకు ప్రతిసవాలు, ఆరోపణకు ప్రత్యారోపణలతో బీజేపీ– గులాబీ శ్రేణుల మధ్య తగ్గపోరు నడుస్తోంది. ఇద్దరూ దొంగలే అంటున్న కాంగ్రెస్..! ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందస్తుకు వెళ్తానంటున్న టీఆర్ఎస్ పార్టీ.. బీజేపీని తేదీ కోరడమేంటని, ఎన్నికల కమిషన్ తేదీ నిర్ణయిస్తుందన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. పరిపాలన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఇద్దరూ దొంగలేనని స్పష్టం చేశారు. నిజంగా రద్దు చేయాలన్న యోచన ఉంటే గుజరాత్‌తోపాటు ఎన్నికలకు వెళ్లొచ్చు కదా? అంటూ టీఆర్ఎస్ పార్టీకి హితవు పలికారు. తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
ఉద్యమ మార్గదర్శి.. టీవీవీ
నల్లగొండ కల్చరల్: తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) అని ఆ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ కోదండరాం అన్నారు. ఆదివారం టీవీవీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్లో నిర్వహించిన వేదిక దశాబ్ది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేదిక ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వేదిక గమ్యాన్ని చేరుకుందన్నారు. చంద్రబాబు పరిపాలనలో, తెలంగాణ పేరెత్తాలంటే భయపడే పరిస్థితుల్లో దొంగతనంగా సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చేదన్నారు. అప్పటికీ పోలీసులకు భయపడి, విద్యావంతులు కూడా రాని పరిస్థితుల్లో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ మదిలో మెదిలిన ఆలోచన, ఉద్యమానికి మార్గదర్శకత్వం చేయాలనే పిలుపుతో కదలిక వచ్చి అతి కొద్దిమందితో టీవీవీ పురుడుపోసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సరిపోలేదని, ఇంకా సీమాంధ్రుల ఆర్థిక పెత్తనం పోలేదన్నారు. ఇన్నాళ్లూ కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి నిర్మించుకోవాలని, గవర్నర్ పెత్తనం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రజల అవసరాలను ప్రభుత్వానికి తెలుపుతూ వారధిగా పనిచేయాలన్నారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో తెలంగాణ అస్థిత్వ పోరాటానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒక బలమైన రాచరికపు వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్యానికి పట్టంగట్టిన పోరాట చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు. సీమాంధ్రుల పాలనలో ఉద్యోగాలు, నిధులు నీళ్లు కొల్లగొట్టారని, ఆ ఆక్రోశంలోనుంచి పుట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అందివచ్చిందన్నారు. ఆశించిన మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా తెలంగాణ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వమైనా సరే తప్పు జరిగితే నిర్భయంగా ఎత్తిచూపుతామని, ఆ దిశగానే టీవీవీ పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.ధర్మార్జున్ మాట్లాడుతూ 2004లో పులిచింతల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మొదటిసారిగా కోదాడలో జిల్లా టీవీవీ నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ఉద్యమాన్ని ఉరకలేయించామన్నారు. టీవీవీ బాధ్యులు వేణు సంకోజు, జి.వెంకటేశ్వర్లు, పందుల సైదులు, ఆర్.విజయ్‌కుమార్, అంబటి నాగయ్య, చిన్న, తిప్పర్తి యాదయ్య ప్రసంగించారు. అంతకుముందు ప్రొఫెసర్ కోదాండరాం టీవీవీ జెండా ఆవిష్కరించారు.ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, అడ్వకేట్ డి.అమరేందర్‌రావు, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న, జవహర్లాల్, సోమమల్లయ్య, పి.మధుసూదన్‌రావు, వేముల యల్లయ్య, దేవేందర్, లీల పాల్గొన్నారు. -
మునగాలను విడదీస్తే ఊరుకోం
మునగాల,న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాం తంలో అంతర్భాగమై ఉన్న మునగాల పరగణాను విడదీస్తే ఊరుకునేది లేదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ‘మునగాల పరగణా ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమే’ అనే అం శంపై గురువారం మునగాలలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మునగాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రా ప్రాంతంలో విలీనం చేయాలని సీమాంధ్రనాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని తె లంగాణ వాదులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ప్రజల ఆకాంక్ష మేరకే చేపట్టాలని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు సరిహద్దులు నిర్ణయించాల్సిన పాలకవర్గాలు అందుకు భిన్నంగా స్వార్థ రాజకీయాలతో విభజించి పాలించాలనుకోవడం అనైతిక చర్య అని పేర్కొన్నారు. 1956కు పూర్వం మునగాల పరగణా ఆంధ్రా ప్రాంతంలో ఉన్నప్పటీకీ ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి, భాషా తెలంగాణలోనే మమేకమయ్యాయని, ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనచరిత్ర మునగాల పురిటిగ డ్డకు ఉందన్నారు. పరగణా పరిధిలోని గ్రామపంచాయతీలలో ఈ విషయాన్ని ప్రత్యేక తీర్మానాలు చేసి నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ పార్టీల పెద్దలకు అందజేయాలని కోదండరాం ప్రజలకు సూచించారు. ఇక్కడివారు సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్నారని తెలిపారు. మునగాల, భద్రాచలం ప్రాంతాలతో పాటు, హైదరాబాద్‌పై, వనరులపై సర్వాధికారాలు కావాలనే పట్టుదలతో ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటాల కల ఫలించే సమయం దగ్గర పడిం దన్నారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ ఏనాడూ వ్యతిరేకం కాదన్నారు. తమ పార్టీ ఇప్పటికే పలు దఫాలుగా లేఖలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మునగాల పరగణాను జిల్లాలో కొనసాగించేందుకు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోరాటం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా రాజకీయ జేఏసీ కన్వీనర్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో ఉద్యమాల చరిత్ర కలిగిన మునగాల పరగణాను విడదీయాలని ప్రయత్నిస్తే జిల్లా వ్యాప్తంగా పోరాటాలు చేపట్టేందుకు జేఏసీ సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. మండల జేఏసీ కన్వీనర్ ఉప్పుల మట్టారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీహరి నాయక్, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కుర్రా జితేంద్రబాబు, జేఏసీ జిల్లా కోకన్వీనర్ వక్కం తుల కోటేశ్వరరావు, సీపీఐ నాయకులు బద్ధం భద్రారెడ్డి, కందిబండ సత్యనారాయణ, టీడీపీ,బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్‌కుమార్, బొలిశెట్టి కృష్ణయ్య, టి. శ్రీనివాస్ గౌడ్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామనర్సయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకులు బాదె రాము, వక్కంతుల ప్రభాకర్, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ నియోజకవర్గాల జే ఏసీ కన్వీనర్లు రాయిపూడి చిన్ని, పి.ధర్మార్జున్, రంగాచారి, ఓయూ జేఏసీ నాయకులు కందుల మధు, తెలంగాణ అధ్యాపకుల సంఘం జిల్లా నాయకుడు సిరికొండ శ్రీనివాస్, కోదాడకు చెందిన జేఏసీ నాయకులు పందిరి నాగిరెడ్డి, బంగారు నాగమణి తదితరులు పాల్గొన్నారు.