సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొంతకాలంగా ముందస్తు ఎన్నికలపై చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముందస్తు ఎన్నికల మీద చేసిన వ్యాఖ్యలు ఆయా పార్టీల్లో కొత్త చర్చకు తెరలేపాయి. మరునాడు కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేపట్టిన మౌనదీక్ష అనంతరం ముందస్తు విషయం లేవనెత్తడం.. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడం జిల్లాలో పొలిటికల్
హీట్ పెంచింది.
వాస్తవానికి కరీంనగర్ ప్రజలకు ముందస్తు ఎన్నికలు కొత్తేం కాదు. అదే విషయాన్ని ఇక్కడ వివిధ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. తమ పార్టీకి కరీంనగర్ ఉమ్మడి జిల్లా కంచుకోట అని.. అనేకసార్లు రాజీనామా చేసినా తమను ప్రజలు బ్రహ్మరథం పట్టి తిరిగి గెలిపించుకున్నారని టీఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఉపఎన్నికలు వచ్చినా.. విజయం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు ఎమ్మెస్సార్ వ్యాఖ్యలతో..
► ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డ కరీంనగర్. ప్రస్తుత సీఎం కేసీఆర్ 2004 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండుచోట్ల గెలిచిన అనంతరం సిద్దిపేట శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ ఎంపీగా, అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
► 2006లో తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న సమయంలో తెలంగాణ విషయంలో ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలతో అప్పటి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెస్సార్ సవాలుతో స్పందించిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లారు. 2006లో భారీ మెజార్టీతో గెలిచారు. 2008లో రెండోసారి రాజీనామాతో మెజారిటీని బాగా తగ్గించుకున్నారు. ఈ రెండు దఫాలు అప్పటి మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సమీప ప్రత్యర్థిగా నిలబడటం గమనార్హం.
బండి వర్సెస్ గంగుల..!
► ఉమ్మడి రాష్ట్రంలోనూ కరీంనగర్ జిల్లా రాజకీయాలు ప్రభావం చూపించేవి. తెలంగాణ వచ్చాక.. కరీంనగర్ మరింత కీలకమైంది. సూటిగా చెప్పాలంటే రాజకీయ కేంద్రంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. 2006లో ఎంపీ కేసీఆర్, మంత్రి సత్యనారాయణ మధ్య మాటలపోరు ఏపీలో రాజకీయ వేడిని పెంచింది.
► ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం కూడా ఆనాటి పరిస్థితులను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.
► నాడు కేసీఆర్–ఎమ్మెస్సార్‌లవి, నేటి మంత్రి గంగుల–ఎంపీ బండిలది కూడా ఒకే సామాజిక వర్గమని వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే అప్పటి ఎమ్మెస్సార్ పాత్రను ప్రస్తుతం బండి సంజయ్ పోషిస్తున్నాడని అభివర్ణిస్తున్నారు.
►ఓవైపు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అంగీకరిస్తే తాము సిద్ధమేనని.. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా గెలిచేది తామేనని బండి సంజయ్ ఘంటాపథంగా చెప్తున్నారు. మరోవైపు తీరా తాము ప్రభుత్వం రద్దు చేస్తే.. ఎన్నికల విషయంలో మాట మార్చరన్న గ్యారెంటీ ఏంటి? అని మంత్రి గంగుల ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ‘మోదీని ముందు ఎన్నికల తేదీని ప్రకటించమనండీ.. మా సీఎం కూడా నిర్ణయం తీసుకుంటారు’ అని కమలాకర్ ఎదురుదాడికి దిగడంతో జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి సవాలుకు ప్రతిసవాలు, ఆరోపణకు ప్రత్యారోపణలతో బీజేపీ– గులాబీ శ్రేణుల మధ్య తగ్గపోరు నడుస్తోంది.
ఇద్దరూ దొంగలే అంటున్న కాంగ్రెస్..!
ఈ విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందస్తుకు వెళ్తానంటున్న టీఆర్‌ఎస్ పార్టీ.. బీజేపీని తేదీ కోరడమేంటని, ఎన్నికల కమిషన్ తేదీ నిర్ణయిస్తుందన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. పరిపాలన విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ఇద్దరూ దొంగలేనని స్పష్టం చేశారు. నిజంగా రద్దు చేయాలన్న యోచన ఉంటే గుజరాత్‌తోపాటు ఎన్నికలకు వెళ్లొచ్చు కదా? అంటూ టీఆర్‌ఎస్ పార్టీకి హితవు పలికారు. తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. పోటీకి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment